ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలో ఉత్కంఠ
తొలిసారి టెస్టు క్రికెట్‌కు గువహటి ఆతిథ్యం
రేపటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
నవతెలంగాణ-గువహటి
కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్ టెస్టు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి గువవటి బార్సపర పిచ్‌పై నెలకొంది. సిరీస్‌లో 0-1తో భారత్ వెనుకంజలో నిలువగా.. దక్షిణాఫ్రికాతో 25 ఏండ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తోంది. తొలి టెస్టు మూడు రోజుల్లోపే ముగియగా.. గువహటి పిచ్ ఎలా ఉంటుంది? స్పిన్‌కు అనుకూలమా? పేస్‌కు సహకరిస్తుందా? పరుగుల వేట సులువేనా? అనే ప్రశ్నలు ఇరు జట్లను మరింత ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు శనివారం నుంచి ఆరంభం కానుంది.
ఎర్రమట్టి పిచ్
గువహటి బార్సపర పిచ్ ఎర్ర మట్టితో తయారు చేశారు. సహజంగా ఎర్ర మట్టి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. కానీ మ్యాచ్ ముంగిట పిచ్‌పై పచ్చిక, తేమ, రెగ్యులర్‌గా వాటరింగ్ చేశారా? లేదా అనే అంశాలను బట్టి స్పందించే స్వభావం అంచనా వేయవచ్చు. ప్రస్తుతం పిచ్‌పై పచ్చిక సాధారణంగానే కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ టెస్టు పిచ్ తరహాలో ఉండవచ్చనే అంచనా. బార్సపర పిచ్ తొలి రెండు రోజులు పేస్, బౌన్స్‌ను అనుకూలిస్తూ.. మూడో రోజు నుంచి స్పిన్‌కు సహకరించే వీలుంది. కోల్‌కతా టెస్టుతో పోల్చితే గువహటిలో బ్యాటర్ల పరుగుల వేట కాస్త సులభతరంగా ఉండవచ్చు. బార్సపరలో ఇదే తొలి టెస్టు కావటంతో పిచ్ స్వభావంపై ఇప్పుడే స్పష్టమైన అవగాహన కష్టం.
పంత్‌కు పగ్గాలు
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుతో పాటు గువహటికి ప్రయాణం చేసినా.. రెండో టెస్టులో అతడు ఆడేది అనుమానమే. గతంలోనూ గిల్ మెడ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఇటీవల వరుస సిరీస్‌ల్లో ఆడుతున్న గిల్‌కు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతి అందించే సూచనలు ఉన్నాయి. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సారథ్య పగ్గాలు తీసుకోవటం లాంఛనమే. కానీ గిల్ స్థానంలో బ్యాటర్‌గా ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. సెలక్షన్ కమిటీ మరో బ్యాటర్‌ను జట్టుకు ఎంపిక చేయలేదు. టాప్ ఆర్డర్‌లో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌లు జట్టుతో పాటు అందుబాటులో ఉన్నారు.
ఈ ఇద్దరూ తొలి టెస్టులో ఆడలేదు. సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరిని ఎంపిక చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నా.. సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన వేరుగా ఉన్నాయి. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్టులో ముగ్గురు వికెట్ కీపర్లు, నలుగురు ఆల్‌రౌండర్లను ఆడించటంపై తీవ్ర విమర్శలు రేగాయి. దీంతో రెండో టెస్టులో కనీసం నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.
సఫారీకి కష్టాలు
పేసర్ కగిసో రబాడ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. రబాడ ఆడేది లేనిది శనివారం ఉదయమే తేలనుంది. రబాడ ఆడితే.. కార్బన్ బాచ్, వియాన్ ముల్డర్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్‌లో ఓ టెస్టు విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. ఇప్పుడు 25 ఏండ్ల తర్వాత ఏకంగా టెస్టు సిరీస్ విజయంపైనే కన్నేసింది. అందుకు గువహటిలో సఫారీలు తుది జట్టు ఎంపికలోనూ వ్యూహ చతురత చూపించాల్సి ఉంటుంది. మార్‌క్రామ్, రియాన్ రికెల్టన్, హమ్జా, బవుమా, టోనీ, స్టబ్స్‌లు దక్షిణాఫ్రికాకు కీలకం కానున్నారు.



