Tuesday, November 18, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటి ?

అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటి ?

- Advertisement -

– ఆ సంస్థ నిధులపై పన్నులున్నాయా ?
– ఈడీ, సీబీడీటీ దర్యాప్తు చేశాయా లేదా ?
– తాజా వార్తా కథనాల నేపథ్యంలో కేంద్రానికి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఇఎఎస్‌ శర్మ లేఖ
న్యూఢిల్లీ :
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 330,000 డాలర్లు చెల్లించి అమెరికన్‌ లాబీయింగ్‌ సంస్థతో ఏ రీతిన కార్యకలాపాలు కొనసాగిస్తుందో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)లు దర్యాప్తు చేసాయా లేదా అని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అరవింద్‌ శ్రీవాస్తవకు లేఖ రాశారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ అందుకున్న నిధులు దేశీయ పన్నులకు లోబడి వుంటాయా లేదా అని కూడా తెలుసుకోవాల్సి వుందన్నారు. అమెరికా ప్రభుత్వ కార్యకర్తలతో లాబీయింగ్‌ చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తమను నియమించిందని అమెరికా లాబీయింగ్‌ సంస్థ స్క్విర్‌ పాటన్‌ బాగ్స్‌ అమెరికా సెనెట్‌కు తెలియచేసింది. ఈ మేరకు బహిరంగంగా చేసిన ప్రకటనను శర్మ తన లేఖలో ప్రస్తావించారు. ఈ లాబీయింగ్‌ సంస్థకు మరో లాబీయింగ్‌ సంస్థ ఈ ఏడాది ఆర్‌ఎస్‌ఎస్‌ తరపున 330,000 డాలర్లు చెల్లించిందని వచ్చిన వార్తా కథనాలను కూడా ఆయన ప్రస్తావించారు.
భారత్‌లో రిజిస్టర్‌ అయి కూడా లేని ఆర్‌ఎస్‌ఎస్‌, కేవలం సభ్యులిచ్చే విరాళాలు లేదా గురు దక్షిణలతోనే నడిచే ఈ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో అమెరికాలో సొమ్ములు చెల్లించే స్థాయిలో వుందా అంటూ ఆశ్చర్యం కలుగుతోందని శర్మ పేర్కొన్నారు.

”ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లో రిజిస్టర్‌ కానపుడు, అమెరికా లాబీయింగ్‌ సంస్థ పేరుతో డాలర్ల రూపంలో ఎలా చెల్లించింది? అమెరికాలో మరేదైనా చట్టం కింద ఆర్‌ఎస్‌ఎస్‌ రిజిస్టర్‌ అయివుందా ? గురు దక్షిణగా పిలిచే సొమ్ములే ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిధులైనపుడు అటువంటి గురు దక్షిణ నిధుల్లో కొంత భాగాన్ని విదేశీ లాబీయింగ్‌ సంస్థకు మళ్లించడం ఆ సంస్థకు సముచితమేనా? అని శర్మ తన లేఖలో ప్రశ్నించారు.
సనాతన ధర్మం నిర్వచన ప్రకారం, ఒక విద్యార్ధి తనకు విజ్ఞానాన్ని నేర్పిన గురువుకు కృతజ్ఞతగా ఇచ్చే సాంప్రదాయసిద్ధమైన మొత్తాన్ని గురు దక్షిణ అంటారు. అటువంటి మొత్తాలను అందచేసిన విద్యార్ధులకు తాము ఇచ్చిన మొత్తాల్లో కొంత భాగం ఇలా అమెరికాలో లాబీయింగ్‌ కోసం విదేశీ సంస్థకు మళ్ళింపులు జరిగాయని తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.
గతంలో ఆదాయ పన్ను ట్రిబ్యునళ్ళు ఆర్‌ఎస్‌ఎస్‌ నిధులపై పన్ను బాధ్యతలను నిర్ణయించే సమయంలో గురు దక్షిణ ఆలోచన లోని వాస్తవ కృతజ్ఞతా స్ఫూర్తిని ప్రశంసిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ వసూలు చేసే నిధులకు పన్ను మినహాయింపును మంజూరు చేసిన అంశాన్ని శర్మ ఈ సందర్భంగా తన లేఖలో గుర్తు చేశారు.

”అయితే, ఇలా లాబీయింగ్‌ చేయడాన్ని విదేశీ ప్రభుత్వ కార్యకర్తలను ‘విద్యావంతులను’ చేయడానికి అని భాష్యం చెప్పగలిగే స్వేచ్ఛను ఎవరైనా తీసుకోగలిగినట్లైతే అప్పుడు ఆ నిధుల్లోని కొంత భాగాన్ని ‘గురువు’, విదేశీ ప్రభుత్వంతో లాబీయింగ్‌ చేయడానికి విదేశీ సంస్థకు చెల్లించడానికి ఉపయోగించారు అంటే అటువంటి నిధుల స్వభావం బృహత్తరంగా ప్రధానమైన మార్పుకు లోనవుతుంది.” అని ఆయన పేర్కొన్నారు.
”అమెరికా సెనెట్‌కు లాబీయింగ్‌ సంస్థ వెల్లడించిన అంశాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తావన ఎలా వచ్చింది, అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్‌ రిజిస్టర్‌ అయిందా లేదా, అమెరికాలో పనిచేస్త్నున్న తమ శాఖ గురించి ఆర్‌ఎస్‌ఎస్‌, సిబిడిటికి తెలియచేసిందా లేదా, గురు దక్షిణ మొత్తాలను అమెరికాలోని లాబీయింగ్‌ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా బదిలీ చేయగలిగింది, అటువంటి నిధుల బదిలీ భారత రెగ్యులేటరీ అధికార యంత్రాంగం కోణంలో చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ప్రక్రియ ద్వారానే జరిగిందా లేదా వంటి పై నాలుగు ప్రశ్నలకు ఆర్‌ఎస్‌ఎస్‌ సమాధానాలు చెప్పాలని సీబీడీటీ అడగకూడదా? అని శర్మ తన లేఖలో పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ హైర్‌ చేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్క్విర్‌ పాటన్‌ బాగ్స్‌ (ఎస్‌పీబీ) అనే సంస్థ పాకిస్తాన్‌ ప్రభుత్వ పే రోల్‌లో కూడా వుంది. బయటకు వచ్చిన ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉదంతం భారత్‌లో పెద్ద రాజకీయ దుమారాన్ని లేపింది. పైగా ఆ సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీల పారదర్శకతపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.
అమెరికా సెనెట్‌ ముందు, ప్రతినిధుల సభ ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి 2025 తొలి మూడు మాసాల్లో స్క్విర్‌ పాటన్‌ బాగ్స్‌ (ఎస్‌పీబీ)కి 330,000 డాలర్లు చెల్లించినట్టు లాబీయింగ్‌ సంస్థ అమెరికా ప్రభుత్వానికి తెలియచేసిన పత్రాల్లో పేర్కొందని అమెరికా కేంద్రంగా పనిచేసే వార్తా సంస్థ ప్రిజమ్‌ తెలిపింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌, ఎస్‌పీబీతో సహా పలు సంస్థలతో కోట్లాది డాలర్ల మేరకు జరిపిన లాబీయింగ్‌ కార్యకలాపాలు ఎలా జరిగాయి, అదే సమయంలో ట్రంప్‌ ప్రభుత్వం పాక్‌కు అనుకూలంగా 29 శాతం నుంచి 10శాతానికి టారిఫ్‌లను తగ్గించడంతో సహా గణనీయమైన విధాన మార్పును ఎలా తీసుకువచ్చిందీ వివరిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ విడిగా సవివరమైన వార్తను ఇచ్చింది. ఇదే కాలంలోనే భారత్‌పై 50శాతం మేరకు అమెరికా టారిఫ్‌లు పెంచింది.

ప్రిజమ్‌ దర్యాప్తు కథనం ప్రచురితమైన తర్వాత, ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన అఖిల్‌ భారతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ సునీల్‌ అంబేద్కర్‌, ఈ కథనాలను తోసిపుచ్చారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లో పనిచేస్తోంది, అమెరికాలో ఎలాంటి లాబీయింగ్‌ సంస్థతోనూ సంబంధాలు నెరపడం లేదు.’ అనిఎక్స్‌ పోస్టులో సునీల్‌ అంబేద్కర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -