Wednesday, July 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరైతుకు మద్దతేది?

రైతుకు మద్దతేది?

- Advertisement -

అందరికీ అన్నం పెట్టేవాడే రైతు. ఇప్పుడు ఆ రైతే కనపడని స్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టిలతో యుద్ధం చేస్తూ నాగలి పట్టిన రైతన్నకు పాలకులు తోడ్పాటు ఏ రకంగానూ ఉండటం లేదు. ప్రత్యామ్నాయ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు తప్ప వ్యవసాయంపైనే ఆధారపడాలంటే చావే శరణ్యమన్న ఆలోచనకు పురికొల్పే విధానాలు ఎక్కువయ్యాయి. శక్తినంతా ధారపోసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతుది తప్పా?.. ‘అదంతా మాకు సంబంధం లేదు మేం ప్రకటించిన మద్దతు ధరతో పంటలు అమ్ముకోండి, లేకపోతే మీ చావు మీరు చావండి’ అంటున్న కేంద్ర ప్రభుత్వానిదా?. అలాగయితే, నేను రూ. 500 కోట్లు పెట్టి సినిమా తీశాను, టికెట్‌ ధర పెంచకుంటే లాభాలు రావు అని నిర్మాత చెప్పగానే, అనుమతి ఇస్తున్నవి ప్రభుత్వాలు. ఒక రైతు ఎకరాకు రూ.యాభై వేల పెట్టుబడి పెడితే నష్టం వస్తున్నదని.. క్వింటాల్‌కు వంద రూపాయలు పెంచమంటే ఎందుకు పెంచడం లేదు? దీనికి సమాధానం చెప్పాలి.
కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైస్‌ (సీఎసీపీ) నివేదిక ఆధారంగా జరిగిన ఒక అధ్యయనంలో 2013-24 మధ్య దేశ వ్యాప్తంగా పది ప్రధాన పంటల్లో మొక్కజొన్న, వేరుశనగ, ఇతర కొన్ని వాణిజ్య పంటలు మినహా మిగిలిన వేటిలోనూ ద్రవ్వోల్బణానికి తగినట్టు రైతుల ఆదాయం పెరగలేదని నిగ్గుతేల్చింది. పదకొండేండ్ల మోడీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు రైతులు బాగుపడేందుకు చేసింది శూన్యం. ప్రధానమంత్రి సమ్మాన్‌ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు అందించింది. అందులోనూ కొంతమంది రైతులకే. ఆ తర్వాత అనేక కొర్రీలు పెట్టి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులను పథకానికి దూరం చేసింది. పంట పండించేందుకు చేసిన అప్పును తిరిగి చెల్లించడం కోసమే ఏడాదంతా రైతు కష్టపడుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పంటలు బాగా పండినా పేద, మధ్య తరగతి రైతుల్లో ఒక్క రైతూ తన సంపాదనలో కుటుంబ సభ్యుల పేర కనీసం పదివేల రూపాయలు కూడా డిపాజిట్‌ చేసుకోలేదు. ఈ లెక్కలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు వెల్లడించినవే. మెజారిటీ రైతులు పంట రుణాలు, ప్రయివేటు అప్పులు తీర్చడానికే సరిపోతోంది. కానీ ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా భారతదేశం ఎదిగిందని, ఇది తమ పాలనకు నిదర్శనమని పాలకులు చెప్పుకోవడంలో అర్థమేముంది?
సాగుకాలం మొదలైన నాటినుంచి రైతులకు అడుగడుగునా గండాలే. విత్తిన గింజలు మొలకెత్తడం ఒకెత్తయితే.. మొలకెత్తిన పైరును చీడపీడల నుంచి కాపాడుకోవడం.. పంట తీయడం మరో ఎత్తు. ప్రకృతి విపత్తుల నుంచి దాటి సమృద్ధిగా దిగుబడులు వచ్చినా.. చివరిలో పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకురాగా ధరలు పాతాళానికి పడిపోవడం. ఇలా ఎన్నో కష్టానష్టాలకోర్చి పంటలు సాగు చేసినా అంతిమంగా మిగిలేది అప్పులు,తిప్పలు.
వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు(నాబార్డు) సర్వే ప్రకారం 2016-17లో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.8,931 మాత్రమే. 2021-22 నాటికి అది 13,669కి పెరిగింది. అందులో సాగుద్వారా సమకూరేది చాలా తక్కువే. వాస్తవానికి గతంలో ప్రధానమంత్రి మోడీ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రకటించారు. అదే లక్ష్యమైతే ఆ లెక్కన చూసినపుప్పడు రూ.17,882 పెరగాలి. పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ఏడాది పాటు ఆ డబ్బులు ఎలా సరిపోతాయో పాలకులే సెలవివ్వాలి. రెట్టింపు ఆదాయం ఎలా సమకూరుస్తామన్నది ప్రభుత్వంలో ఉన్నవారే చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. వ్యవసాయాన్ని కొర్పొరేట్లకు కట్టబెట్టేందుకు విధానాల రూపకల్పనలో కేంద్రం బిజీగా ఉంది తప్ప.. రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఏ మాత్రం ఆలోచనలు చేయడం లేదు.
తమది రైతు ప్రభుత్వమని గతంలో ఊరేగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గానీ, రైతు రాబడులకు భరోసా ఇస్తామన్న ప్రస్తుత బీజేపీ హయాంలోని మోడీ ప్రభుత్వం గానీ స్వామినాథన్‌ సిఫార్సులను అమలుచేయకుండా మోసం చేశాయి. ఇప్పటికే 66 దేశాలు, అంటే ప్రపంచ జనాభాలో పదహారు శాతం ఆహార దిగుమతులపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఆ దుస్థితి మనకు రాకూడదంటే ఇప్పటికైనా పాలకులు ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని ఒక మహాకవి చెప్పిన సారాన్ని గుర్తుపెట్టు కుంటే బాగుంటుంది. రైతుకు ఆదాయ హామీతో పాటు మార్కెటింగ్‌, నిల్వ కేంద్రాలు, విత్తన నాణ్యత, జల వ్యవస్థలను కల్పించాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేసేందుకు పూనుకోవాలి. అప్పుడే రైతు వెన్నెముక నిలబడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -