– రెండో పీఆర్‌సీని ప్రకటించాలి
– పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
– టీయూఎంఅండ్ హెచ్‌ఈయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్
– సార్వత్రిక సమ్మె జయప్రదానికి వక్తల పిలుపు
రెండో పీఆర్‌సీని ప్రకటించాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు తీపికబురంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు భూపాల్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు’ పరిష్కరించాలంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసీయుద్దీన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించారు. ఉద్యోగుల పట్ల గత కేసీఆర్ ప్రభుత్వ తోవలోనే రేవంత్ సర్కార్ ప్రయాణిస్తున్నట్టుగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పిన కాంగ్రెస్.. 18నెలల నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కె యాదానాయక్ జులై 9 సార్వత్రిక సమ్మెతోపాటు పలు అంశాలతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం యాదానాయక్ మాట్లాడుతూ 2023 జులై1 నుంచి రావాల్సిన రెండో పీఆర్‌సీని 51శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమవుతున్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెల్లకోసారి ఇవ్వాల్సిన డీఏలను పెండింగ్‌లో పెట్టటమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జె వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్‌గా ఉద్యోగ నియామకాలు చేపడుతూనే ఆ స్థానంలో ఉండే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని రోడ్డున పడేస్తే ఆయా కుటుంబాల పరిస్థితేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ విధానాలకు నిరసనగా ఈ నెల 9న సార్వత్రిక సమ్మె జరగనున్నదనీ, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్లు కార్మిక వర్గ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఆ సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
టాప్రా ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు సుదీర్ఘకాలం పనిచేసి 61 ఏండ్లకు రిటైరయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించకపోవడం వల్ల ఆ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ, ఐఎన్‌టీయూసీ నాయకులు కె వేణుగోపాల్, హెచ్‌ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, బలరాం, జనార్దన్ బట్టు, శంశాద్‌ఖాద్రి, గిరి యాదయ్య, వి భూలక్ష్మి, ఎ కవిత తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల పట్ల నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.