Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంనీళ్లకు దారేది..?

నీళ్లకు దారేది..?

- Advertisement -

– కాల్వలు పూడ్చి రోడ్లు వేస్తున్న మాఫియా
– విచ్చలవిడిగా ఇసుక మట్టి దందా
– కాల్వల నీరు పంటపొలాల వైపు మళ్లింపు

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రాజెక్టుల చివరి ఆయకట్టుకు నీరు రాక ఒకవైపు పంటలు ఎండుతుంటే.. మరోవైపు తవ్విన సాగునీటి కాల్వలను ఇసుక మాఫియా మాయం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు కాల్వల పనులు పూర్తికాక, పూర్తయినా చెట్లు మొలిచి నిర్వహణ లేక సాగునీరు అందని పరిస్థితులు ఉండగా.. మరికొన్ని చోట్ల కాల్వలను కొందరు రోడ్ల కోసం పూడ్చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలింపు కోసం దొంగదారులను వెతుకుతున్నారు. పంట పొలాలకు సాగునీరు అందించే కాల్వలను ధ్వంసం చేయడం వల్ల నీరు పంటపొలాలకు మళ్లీ.. పంట చేతికి రాకుండా పోతున్నది. ఇంకా కాల్వలు పూడ్చటంతో నీరు ఎక్కువై ఒక్కోసారి గ్రామాలు కూడా జలమయం అవుతున్నాయి.
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని ఎల్లూరు పరిధి నుంచి వచ్చే మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల కింద వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి పాతిక ఏండ్లు అయినా కేఎల్‌ఐకి చెందిన పిల్ల కాల్వలు ఇంకా పూర్తి చేయలేదు. దీంతో అచ్చంపేట, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి పరిధిలో కేఎల్‌ఐ 63- డి పరిధిలో ఉన్న పిల్ల కాల్వల స్థితి దయనీయంగా మారింది. కల్వకుర్తి పరిధిలో పోతారెడ్డిపల్లి, కోనాపూర్‌ నుంచి రంగాపూర్‌ మోకరాల నుంచి శిలార్‌పల్లి వెల్లే కెఎల్‌ఐ కాల్వలను కొందరు ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లు పూడ్చి రోడ్డు వేశారు. పోతారెడ్డిపల్లి నుంచి రంగాపూర్‌ రహదారి కోసం ఈ రోడ్డును వేశారు. రోడ్డు వేసే ముందు కెఎల్‌ఐ కాల్వల దగ్గర చిన్న బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సింది. అయితే, బ్రిడ్జీలు ఏర్పాటు చేయకుండా కాల్వలను పూడ్చి వేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇసుకను తరలించడానికి అక్రమ మార్గాల అన్వేషణలో కాల్వలను ధ్వంసం చేసి మట్టితో పూడ్చేశారు. కొనాపూర్‌తండా నుంచి కోనాపూర్‌ రోడ్డు కోసం మరో కాల్వను పూడ్చి వేశారు. కాల్వల కట్టలకు నెర్రెలు వచ్చినా.. రంధ్రాలు పడినా మరమ్మతులు చేసి ఖరీఫ్‌కు సిద్ధం చేయాల్సి ఉండగా అధికార యంత్రాంగం ఇవేవీ చేయడం లేదు. జూరాల చివరి ఆయకట్టు అయిన చిన్నంబావి, పెబ్బేరు, వీపనగండ్ల, పాన్‌గల్‌, గద్వాల ప్రాంతాల్లో కాల్వల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నెట్టెంపాడు, బీమా పరిధిలోని కాల్వల పరిస్థితులు దారుణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించి వచ్చే ఖరీఫ్‌కు సాగునీటికి ఆటంకం లేకుండా చూడాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు.
మా పంటపొలాలకు నీరు రావడం లేదు.
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మాకు నీరు రావడం లేదు. మేము చివరి ఆయకట్టుదారులం. కొంత మంది కాల్వలను ధ్వంసం చేయడం వల్ల సాగు నీరు రావడం లేదు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాల్వలకు మరమ్మతులు చేపట్టి ఖరీఫ్‌లో పంట పొలాలకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి.
రాములు, రంగాపూర్‌, వంగూరు మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా
కాల్వల మరమ్మతులు చేయించాలి
రాష్ట్ర ప్రభుత్వం కాల్వల నిర్వహణ ప్రతి ఏటా వేసవిలో చేయాల్సింది. డి- 63 కాల్వను కొందరు కాంట్రాక్టర్లు, ఇసుక మాఫియా ధ్వంసం చేసి మట్టితో పూడ్చివేసి రోడ్డు వేశారు. ఆ రోడ్డు వెంట ఇసుక మట్టిని అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కాల్వల మరమ్మతు చేపట్టి ఖరీఫ్‌ పంటలకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి.

  • సి. బాల్‌రెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్‌ జిల్లా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -