పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌పై ఉభయసభల్లో చర్చ
పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశ భద్రతా విషయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలు జరిగాయి. లోక్‌సభలో రెండో రోజూ చర్చ కొనసాగగా, రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఉగ్రదాడి ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలు, ‘ఆపరేషన్ సిందూర్’ కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, కనిమొళి, ఎ.రాజా చర్చలో పాల్గొనగా, ప్రభుత్వం తరపున ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మాట్లాడారు.
అరగంటలోనే కాల్పుల విరమణను ప్రతిపాదించారు : రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడి అమానుషమని, ఈ దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి మద్దుతు తెలిపాయని, ఇందుకు తాము గర్విస్తున్నామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలుగా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్రానికి, సాయుధ బలగాలకూ అండగా నిలుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని రాహుల్ తెలిపారు. ప్రతిపక్షాలే కాదు.. యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిందని గుర్తుచేశారు. పహల్గాం దాటి బాధితులను స్వయంగా కలిసినట్టు ఆయన వెల్లడించారు. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు రాజకీయ సంకల్పం ఉండాలని, 1971 యుద్ధంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని, అప్పటి జనరల్ మాణిక్ షాకు ఇందిరాగాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేశారు. యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ఈ ప్రభుత్వానికి లేదనే విషయం రక్షణ మంత్రి చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయని విమర్శించారు. మీరు దాడులు చేయొద్దని పాక్‌కు చెప్పడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. పాక్‌కు భారత్ 30 నిమిషాల్లోనే ఎందుకు లొంగిపోయిందని రాహుల్ నిలదీశారు.
భద్రతా వైఫల్యమే ఉగ్రదాడికి కారణం : ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పహల్గాంలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బైసారన్ వ్యాలీలో ఎందుకు భద్రతను ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. సరైన భద్రత లేకపోవడం వల్లే 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై నమ్మకంతో టూరిస్టులు బైసారన్ లోయకు వెళ్లారని, కానీ కేంద్రం మాత్రం దేవుడి మీద భరోసా వేసిందని అన్నారు. 2019లో టీఆర్‌ఎఫ్ ఉగ్ర సంస్థ ఏర్పడి, ఆర్మీ అధికారుల్ని చంపుతూ 25 సార్లు ఉగ్రదాడులకు పాల్పడినా.. 2023 వరకు ఆ సంస్థను ఉగ్ర సంస్థగా గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. బైసారన్ ఘటనలో భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ పదువులకు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. 11 ఏండ్లుగా అధికారంలో ఉన్న వారి బాధ్యత ఇదేనా అని నిలదీశారు. ముంబయిలో 2008లో జరిగిన సెప్టెంబర్ 26 దాడుల తర్వాత ఆ రాష్ట్ర సీఎం, హోంశాఖ మంత్రి రాజీనామా చేసినట్టు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని, అమెరికా అధ్యక్షుడు ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారని ఆమె ప్రశ్నించారు. ఉగ్రదాడి బాధితుల బాధను తాను అర్థం చేసుకుంటానని, తన తండ్రి రాజీవ్‌గాంధీని ఉగ్రవాదులు చంపినప్పుడు తన తల్లి పడిన బాధను ప్రత్యక్షంగా చూశా నని, ఆ వేదన తానూ అనుభవించానని ఈ సందర్భంగా ప్రియాంకగాంధీ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం క్రెడిట్‌ను ఆశిస్తూ, బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. భారత సాయుధ బలగాల సేవలు, త్యాగాలను ఆమె ప్రశంసించారు. జాతీయ భద్రతపై చెక్కుచెదరని వారి సంకల్పాన్ని కొనియాడారు. కాగా, సభలో ప్రియాంకా గాంధీ పహల్గాం, ఆపరేషన్ సిందూర్ అంశాలపై మాట్లాడుతున్నపుడు బీజేపీ ఎంపీలు ‘హిందూ’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు కౌంటర్‌గా ప్రతిపక్ష ఎంపీలు ‘ఇండియన్’ అంటూ నినాదాలు చేశారు.
అణ్వాయుధ బెదిరింపులకు దేశం తలవంచదు : రాజ్‌నాథ్ సింగ్
పాకిస్తాన్ చేపడుతున్న అణ్వాయుధ బెదిరింపులకు దేశం తలవంచదని, ఎటువంటి యుద్ధ వ్యూహాలనైనా తిప్పికొడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఉగ్రవాదానికి ఇండియా వ్యతిరేకమన్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేషన్ సిందూర్ సంకేతంగా నిలుస్తుందని తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రూపుమా పాలనుకుంటే, ఆ దేశానికి సహకారం అందించేందుకు ఇండియా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ఎటువంటి విప్లవం పుట్టదని, దానివల్ల కేవలం విధ్వంసం, ద్వేషమే మిగులుతుందన్నారు. ప్రతిపక్షాలు సిందూర్ విజయం గురించి కాక, భారతీయ యుద్ధ విమానాల గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాయని విమర్శిం చారు. ఏదో ఒక రోజు పీఓకే ప్రజలు ఇండియాతో కలుస్తారని, భారతీయులమని చెప్పుకునేందుకు వాళ్లు గర్వపడతారన్నారు.
ప్రతీకారం తీర్చుకున్నాం : అమిత్ షా
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని అంతమొందించామన్నారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు.
వినే ధైర్యం లేకుంటే ఆ పదవికి అర్హులు కారు : ఖర్గే
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ సభలో లేకపోవడాన్ని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. అందరూ అఖిల పక్ష సమావేశంలో పాల్గొంటే మోడీ బీహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయా అని.. సమస్య గురించి జరిగే చర్చలు వినే ధైర్యం లేకుంటే ఆ పదవిలో ఉండేందుకు అర్హులు కారని విమర్శించారు. భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్‌ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానన్నారు. గత ప్రభుత్వాలు జాతీయ భద్రత విషయంలో సాధించిన విజయాలను తక్కువ చేసి చూపిస్తూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఆయుధాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే వాళ్లు అబద్ధాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నాయంటూ ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి అసత్యాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరని, తామెప్పుడూ పాకిస్తాన్‌కు మద్దతివ్వలేదని స్పష్టం చేశారు.
ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం : అఖిలేశ్
దేశ సరిహద్దులో శాంతి కావాలని, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించొద్దని ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ వేళ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విజయవంతంగా మిలటరీ ఆపరేషన్ నిర్వహించి అకస్మాత్తుగా కాల్పులు విరమించడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పే అవకాశాన్ని వదులుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ప్రకటన ప్రభుత్వమే చేస్తుందని ఆశిస్తే.. పరాయి దేశాధ్యక్షుడి నోటి నుంచి ఆ అంశాన్ని వినాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపిం చారు. 370వ అధికరణ రద్దు తర్వాత ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, పర్యాటకం పెరిగిందని కేంద్రం ఊదర గొడుతూ వచ్చిందని, ఆ విషయాన్ని నమ్మే పర్యాటకులు అక్కడకు వెళ్లారని అన్నారు. కానీ కేంద్రం భద్రతా వైఫల్యంలో ఏ మేర ఉందో తేటతెల్లమైందన్నారు. ‘టెక్నాల జీని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిం చుకోవడంలో ఉన్న శ్రద్ధ పుల్వామాలో ఆర్‌డీఎక్స్ తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకునేందుకు ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. కేంద్రం దృష్టి పెడితే ఏ మార్గం ద్వారా వాహనం వచ్చిందో తెలుసుకోలేకపోయేదా అని అన్నారు.
మాకెవరూ చెప్పలేదు : ప్రధాని మోడీ
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామ ని, ఇందుకు దేశం సంబురాలు చేసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తమపై నమ్మకం ఉంచారని, సిందూర్ శపథాన్ని నెరవేర్చామని చెప్పారు. త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామన్నారు. భారత సైన్యం పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిందని, ఊహలకు కూడా అందని విధంగా టెర్రరిస్టులను శిక్షించామని, ఆపరేషన్ సిందూర్‌తో వారిని మట్టిలో కలిపేశామని అన్నారు. ఏప్రిల్ 22న కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేశామని, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఉగ్రదాడి జరిగిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత తమకు చెప్పలేదని వెల్లడించారు. మే 9న పెద్దఎత్తున దాడి జరపనున్నట్టు జేడీ వాన్స్ తనకు చెప్పినపుడు, అందుకు ప్రతిగా పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయనకు తెలిపానన్నారు. బుల్లెట్‌కు సమాధానం బుల్లెట్‌తోనే చెబుతామని చెప్పానని, పాకిస్తాన్‌కు ఎవరూ సాయం చేసినా ఊరుకునేది లేదని అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి కుయుక్తులు పన్నినా మళ్లీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.