మోడీ పాలనలో మారిపోతున్న చట్టాలు, పథకాలు, ప్రాజెక్టుల పేర్లు
హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం
తాజాగా అటకెక్కిన మహాత్ముడు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో చట్టాలు, పథకాలు, ప్రాజెక్టులు, మంత్రిత్వ శాఖలు… ఇలా ఒకటేమిటి? అన్నింటి పేర్లూ మారిపోతున్నాయి. తాజాగా మహాత్మాగాంధీని కూడా ప్రభుత్వం అటకెక్కించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామిణ్)గా మారిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిలో కొన్ని పోకడలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అవేమి టంటే.. ఏ పేరు మారినా అది హిందీలోనే ఉంటోంది. హిందీకే ఉన్నత స్థానాన్ని కల్పించాలన్న బీజేపీ సాంస్కృతిక రాజకీయాలలో ఇది ఓ భాగం. సంఫ్‌ు పరివార్ సైద్ధాంతిక ప్రాజెక్ట్ అయిన ‘వలసవాద నిర్మూలన’ యత్నాలు ఇటీవలి మోడీ ప్రకటనల్లో ప్రతిబింబిస్తున్నాయి. 200 సంంవత్సరాల థామస్ బాబింగ్టన్ మెకాలే వారసత్వం నుంచి భారత్ వైదొలగాలని ప్రధాని పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు.
మత ఆచారాలనూ వదలలేదు
ప్రభుత్వ వైఖరిలో కన్పిస్తున్న మరో పోకడ ఏమిటంటే కొన్ని పథకాల నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను తొలగించడం. దానికి సమాంతరంగా బీజేపీ-జనసంఫ్‌ు రాజకీయ వారసత్వంలో భాగమైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి వారి పేర్లను కొన్ని పథకాలకు జోడించడం. అదే సమయంలో మతపరమైన కొన్ని ఆచారాలకు సంబంధించిన పదాలను కూడా ఉపయోగించారు. ఉదాహరణకు ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర కీలక కార్యనిర్వాహక సంస్థలు ఉన్న భవన సముదాయానికి ‘సేవా తీర్థ్’గా నామకరణం చేశారు. తీర్థ్ అంటే హిందూ మత యాత్ర అని అర్థమన్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో ప్రభుత్వం ఎక్స్‌పర్ట్ : కాంగ్రెస్ ఎద్దేవా
క్రెడిట్ కొట్టేయడానికే మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మారుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పథకాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని, దానిని కప్పిపుచ్చుకోవడానికే పైపై మార్పులు చేస్తోందని విమర్శించింది. పథకాలు, చట్టాల పేర్లు మార్చడంలో మోడీ ప్రభుత్వం ఎక్స్‌పర్ట్ అని ఆ పార్టీ కమ్యూనికేషన్ల విభాగం అధ్యక్షుడు జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ‘వారు నిర్మల్ అభియాన్‌ను స్వచ్ఛ భారత్ అభియాన్‌గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల్‌గా పేరు మార్చారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్, నామకరణంలో వారు నిపుణులు. పండిట్ నెహ్రూను వారు ద్వేషిస్తున్నారు. అయితే ఆశ్చర్యమేమంటే మహాత్మా గాంధీని కూడా ద్వేషిస్తున్నట్లు కన్పిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 నుంచీ అమలులో ఉంది. ఇప్పుడు మీరు దానికి పేరు మారుస్తు న్నారు. మహాత్మా గాంధీ అనే పేరులో తప్పేముంది?’ అని జైరాం రమేష్ ప్రశ్నించారు. కాగా కాంగ్రెస్ పార్టీ తన వెబ్‌సైటులో 32 పథకాల పేర్లతో ఓ జాబితాను ఉంచింది. 1975-2013 మధ్యకాలంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాలను ప్రారంభించాయని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం వాటి పేర్లను మార్చేసిందని తెలిపింది.
‘రాజ్’ పదానికి చెల్లుచీటీ
ప్రధాని కార్యాలయం, ఇతర కార్యాలయాల సముదాయానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టడానికి, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని రాజ్‌భవన్‌లు, రాజ్‌నివాస్‌లను లోక్‌భవన్‌లుగా మార్చేయడానికి ముందే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ విస్తరించి ఉన్న చారిత్రక రాజ్‌పథ్‌కు 2022 సెప్టెంబరులో మోడీ ప్రభుత్వం కర్తవ్యపథ్ అని పేరు పెట్టింది. ఆ నెల 8వ తేదీన కర్తవ్యపథ్‌ను మోడీ ప్రారంభించారు. రేస్ కోర్స్ రోడ్డు పేరు మార్చాలని 2016 సెప్టెంబరులో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. దీంతో భారత ప్రధానికి కొత్త చిరునామా లభించింది. రేస్ కోర్స్ రోడ్డు పేరు భారతీయ నైతికతను, విలువలను ప్రతిబింబించడం లేదని మున్సిపల్ కార్పొరేషన్ వివరణ ఇచ్చింది.
పాత పథకాలకు కొత్త పేర్లు
1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభిం చిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ‘ఇందిరా ఆవాస్ యోజన’ 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్‌గా మారింది. యూపీఏ-1 ప్రభుత్వం 2005 డిసెంబరులో ఏడు సంవత్సరాల కాలానికి జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (జేఎన్‌ఎన్ యూఆర్‌ఎం)ను ప్రారంభించింది. ఆ తర్వాత దానిని మరో రెండు సంవత్సరాలు…అంటే 2014 మార్చి 31 వరకూ పొడిగించారు. అయితే మోడీ ప్రభుత్వం 2015 జూన్ 25న దీని స్థానంలో అమృత్ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకు విద్యుత్‌ను అందించడానికి 2005 ఏప్రిల్‌లో ప్రారంభించిన రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను 2015 జూలై 25న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనలో విలీనం చేశారు.
మంత్రిత్వ శాఖలకూ…
కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు మోడీ ప్రభుత్వం 2020 నవంబరులో ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ అని పేరు పెట్టింది. అదే సంవత్సరం నూతన జాతీయ విద్యా విధానం సూచన మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ)ను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ మంత్రిత్వ శాఖ విద్యా శాఖగానే ప్రారంభమైంది. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985 సెప్టెంబర్ 26న దీని పేరును ఎంహెచ్‌ఆర్‌డీగా మార్చింది.
చట్టాల పేర్లూ మారాయి
1860వ సంవత్సరపు ఐపీసీ, 1973 నాటి సీఆర్‌పీసీ, 1872వ సంవత్సరపు భారతీయ సాక్ష్య చట్టం స్థానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి వరుసగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ)లను అమలులోకి తెచ్చింది. వలసవాద నిర్మూలన ప్రక్రియలో ఇది ఓ భాగమని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అనేక బిల్లులకు హిందీ పేర్లు పెట్టింది. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు-2025 దీనికి ఓ ఉదాహరణ. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన చారిత్రక చట్టం ఇప్పుడు నారీ శక్తి వందన్ చట్టం-2023గా మారింది. అణు శక్తి రంగాన్ని నియంత్రించే కొన్ని కీలక చట్టాలను సంస్కరించడానికి ప్రభుత్వం శాంతి బిల్లు-2025కు ఆమోదం తెలిపింది.



