Saturday, December 20, 2025
E-PAPER

ఇదేం తీరు?

- Advertisement -

ప్రతిపక్షాల ప్రశ్నలకు మొఖం చాటేసిన ప్రధాని మోడీ అర్థంతరంగా ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు
బట్టబయలైన కాషాయ ఎజెండా
‘వందేమాతరం’ పేరుతో రవీంద్రుడిపై సెటైర్లు నెహ్రూపై కాషాయ అక్కసు
‘నరేగా’ సవరణల్లో మహాత్ముడి పేరు తొలగింపు
యథాప్రకారం విదేశీ టూర్లకు వెళ్లిన పీఎమ్‌

నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు అర్థంతరంగా ముగిసాయి. ఈనెల 1 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల ఆందోళనల్ని పట్టించుకోకుండా తాను అనుకున్నది… కోరుకున్నది చేసుకొని సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయింది. ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమల్లోకి తెస్తున్నట్టు స్పష్టమైంది. దీనికి ‘వందేమాతరం’ గీతం 150 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని, పార్లమెంటులో దీనిపై ప్రత్యేక చర్చను ప్రభుత్వం చేపట్టింది. ఆ గీత రచయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను అవమానపరిచేలా బీజేపీ సభ్యులు సభలో వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ‘బాబు రవీంద్ర’ అని వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత మరో సభ్యుడు అభ్యంతరం చెప్పడంతో ‘తప్పు’ను సరిదిద్దుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

వందేమాతరంపై చర్చ సందర్భంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ సభ్యులు అవాకులు చెవాకులు పేలారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల ప్రదర్శన ఆయా సభ్యుల వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. దేన్నీ అధికార బీజేపీ పట్టించుకోలేదు. తామనుకున్న ఎజెండాను పార్లమెంటులో ముగించుకోవడానికే ప్రధాన్యత ఇచ్చారు. యధాప్రకారం ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో విదేశీ పర్యటనలకు వెళ్లారు. బీమారంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సభలో నిరసనల మధ్యే ఈ బిల్లును కేంద్రం ఆమోదించుకుంది.

దేశవ్యాప్తంగా బీమా ఉద్యోగులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా, కేంద్రం పట్టించుకోలేదు. విద్యుత్‌ సవరణ చట్టం-2025ను పార్లమెంటు ఎజెండా జాబితాలో పెట్టినా, విద్యుత్‌ ఉద్యోగుల అల్టిమేటంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దేశ భద్రతకు సంబంధించి అణుశక్తి రంగానికి సంబంధించిన సవరణ బిల్లును కూడా మోడీ ప్రభుత్వం ఆమోదం తెలుపుకుంది. ఈ బిల్లు ద్వారా దేశ రక్షణరంగంలోకి ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు మార్గం సుగమం అయ్యింది. అన్నింటికీ మించి గ్రామీణ పేదలపై కేంద్రం కక్షకట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, ప్రభుత్వ స్పాన్సర్డ్‌ స్కీంగా మారుస్తూ చట్ట సవరణ చేశారు. ఈ నిర్ణయం సరైంది కాదనీ, గ్రామీణ ప్రజలు ఉపాధిని కోల్పోతారని ప్రతిపక్షాలు గొంతుచించుకొని కేకలు వేసినా, లోక్‌సభలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినా, పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలు నిర్వహించినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈ చట్టానికి తాననుకున్నట్టే మహాత్మాగాంధీ పేరును తొలగించి సవరణలు చేసుకొని, సభను వాయిదా వేసు కొని వెళ్లిపోయింది. ఈ బిల్లులపై తొందర పాటు శాసన ప్రక్రియ వద్దంటూ ప్రతిపక్షాలు ఎంత చెప్పినా మోడీ సర్కార్‌ లెక్కచేయలేదు. కనీసం బిల్లును జాయింట్‌ పార్లమెంటు కమిటీకి సిఫార్సు చేయాలని కోరినా కేంద్రం అంగీకరించలేదు. దీనిపై దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. చివరకు ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్చించేందుకు కూడా మోడీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఉన్నత చదువుల్ని పూర్తిగా ప్రయివేటుకు అప్పగిస్తూ ప్రతిపాదించిన వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ బిల్లు-2025ను ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు.

మొత్తంగా కేంద్రం 8 బిల్లుల్ని ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాలు, నిరసనల మధ్య ఆమోదించుకొని, నామ్‌కే వాస్తేగా రెండు బిల్లుల్ని జేపీసీ, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు సిఫార్సు చేసింది. ఎజెండాలో పెట్టిన మరికొన్ని బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ధైర్యాన్ని కేంద్రం చేయలేదు. అప్పటికే ప్రతిపక్షాలు పార్లమెంటును పూర్తిగా స్తంభింప చేస్తుండటంతో విధిలేక ఆ బిల్లుల్ని వాయిదా వేసు కుంది. అయితే ఈ ప్రమాదం తప్పిపోలేదనీ, జనవరిలో జరిగే రెండో విడత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఆమో దింపచేసుకుంటారని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఆయా బిల్లుల వల్ల నష్టపోయే ప్రజానీకంతో క్షేత్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ ను రూపొందించుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -