Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంఏం చేద్దాం?

ఏం చేద్దాం?

- Advertisement -

– వాణిజ్య చర్చలపై ప్రభుత్వం కసరత్తు
– కీలక మంత్రిత్వ శాఖలకు సూచనలు
న్యూఢిల్లీ :
అమెరికాతో ఈ నెలాఖరులో జరిగే వాణిజ్య చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 25న అమెరికా ప్రతినిధి బృందం మన దేశానికి వస్తుంది. అప్పుడు జరిగే వాణిజ్య చర్చల్లో అమెరికా ముందు ఉంచే ప్రతిపాదనలపై పరిశీలన జరపాలని కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖలను ప్రభుత్వం కోరింది. ఎలాంటి అవరోధాలు లేకుండా వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఏం చేయాలి, ఏయే రంగాలకు రాయితీలు అందించాలి అనే అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. మోడీ ప్రభుత్వం ఇవ్వజూపుతున్న దాని కంటే అమెరికా ఎక్కువ ప్రయోజనాలనే కోరుతుండడంతో ట్రంప్‌ విధించిన గడువు లోగా తుది ఒప్పందం కాదు కదా…కనీసం మధ్యంతర ఒప్పందం కూడా కుదరలేదు.సుంకాలను భారీగా తగ్గించాలని, టారిఫ్‌ యేతర వాణిజ్య అవరోధాలను తొలగించాలని ట్రంప్‌ ప్రభుత్వం పట్టుపడుతోంది. ట్రంప్‌ విధించిన పాతిక శాతం సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఈ సుంకాలకు తోడు రష్యా నుంచి రక్షణ, ఇంధన దిగుమతులు జరిపితే అదనపు ‘జరిమానా’ విధిస్తానని ట్రంప్‌ బెదిరించారు. దీంతో ప్రభుత్వం ఏం చేయాలో తోచక మల్లగుల్లాలు పడుతోంది. జరిమానా ఏ మేరకు విధించేదీ ట్రంప్‌ ప్రకటించలేదు. ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాయని సంకేతాలు అందుతున్నాయి. అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాల తొలి జాబితాలో భారత్‌ కూడా ఉంటుందని అందరూ ఆశించారు. అయితే చర్చల్లో పురోగతి కన్పించకపోవడం అమెరికాను నిరాశ పరచింది. ట్రంప్‌ సుంకాల హెచ్చరికలను ఎదుర్కోవడానికి అనేక ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న విధంగానే భారత్‌ కూడా తన ఆర్థిక వృద్ధిని కాపాడుకోవడానికి, దేశీయ ఉత్పత్తిదారుల నుంచి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి రాయితీలను సమతుల్యం చేసుకునే ప్రయత్నంలో సూత్రబద్ధమైన, ఘర్షణకు తావులేని వైఖరిని అవలంబిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తొందరపాటు ప్రదర్శించిన కొన్ని దేశాలకు చివరికి ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలు ఇచ్చిన రాయితీలతో పోలిస్తే వాటికి వచ్చినవి చాలా స్వల్పంగానే ఉన్నాయి. అమెరికాతో వాణిజ్య లోటు కలిగిన బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాలకు ఇదే చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా జరిగే చర్చలు సానుకూలంగా ఉంటే అక్టోబర్‌ కంటే ముందే ఒప్పందం కుదరవచ్చునని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. భారత్‌ కంటే ముందుగానే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇది మన సమీకరణాన్ని మరింత క్లిష్టతరం చేయవచ్చు. ప్రస్తుతం చైనా వస్తువులపై అమెరికా 30 శాతం టారిఫ్‌ విధిస్తోంది. ఏదేమైనా భారత్‌, అమెరికా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగితే అంతిమంగా ట్రంప్‌, మోడీ పరస్పరం సంప్రదించుకొని ఒప్పందంపై ప్రకటన చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -