Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఏం చేయాలి చెప్మా ?

ఏం చేయాలి చెప్మా ?

- Advertisement -

అంతర్మథనంలో ట్రంప్‌

వాషింగ్టన్‌ : ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం మొదలు పెట్టి నెల రోజులు కావస్తోంది. ఈ పోరులో ఆయన అనుకున్న లక్ష్యాలేవీ సాధించలేకపోగా అంతర్జాతీయ ఇంధన ధరలు 40 శాతం మేర పెరిగి ఆకాశాన్ని తాకాయి. స్వదేశంలో ఆయన రేటింగ్‌ నానాటికీ పడిపోతోంది. ఇప్పుడు ఆయన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి… ఇరాన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొని యుద్ధాన్ని ముగించడం. రెండోది…యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం. యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రంప్‌ అధ్యక్ష పదవికే ఎసరు రావచ్చు. దౌత్య యత్నాలు ఫలించకపోవడంతో చేసేదేమీ లేక తాజాగా యుద్ధానికి ఆయన మరో వారం విరామం ప్రకటిం చారు. అయినప్పటికీ ఇరాన్‌ మాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్‌ పైన, ఇజ్రాయిల్‌ పైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతోంది. హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణను కొనసాగిస్తోంది. చమురు, గ్యాస్‌ రవాణాను అడ్డుకుంటోంది.

యుద్ధాన్ని ట్రంప్‌ ముగిస్తారా లేక మొండిగా కొనసాగిస్తారా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా ఉంది. యుద్ధాన్ని కొనసాగిస్తే ఎదురయ్యే విపత్కర పరిణామాలు ఆయనకు తెలియనివి కావు. పశ్చిమాసియాలోనే కాదు…ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటంకాలు ఎదురవుతాయి. యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నానని, చర్చల ద్వారా కథను సుఖాంతం చేయాలని సహాయకులను ట్రంప్‌ వేడుకుంటున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని హూంకరిస్తున్నారు. పాకిస్తాన్‌ ద్వారా ఇరాన్‌కు పంపిన పదిహేను సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనకు అటు వైపు నుంచి ఇంకా సానుకూల స్పందన లభించలేదు.

పైగా ఇరాన్‌ కూడా అమెరికాకు షరతులు విధిస్తోంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆయన వద్ద పెద్దగా మార్గాలు లేవని మాజీ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవైపు చర్చల మంత్రం పఠిస్తూనే మరోవైపు మధ్యప్రాచ్యానికి వేలాది మంది సైనికులను ట్రంప్‌ తరలిస్తుండడం గమనార్హం. టెహ్రాన్‌ ఎక్కువ రాయితీలు కోరకుండా చూసేందుకే ట్రంప్‌ ఈ ఎత్తుగడ వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌ సైనిక సామర్ధ్యాన్ని దెబ్బతీసి, అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. యుద్ధాన్ని ప్రారంభించిన తొలి రోజులలోనే ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని, ఐఆర్‌జీసీ కమాండర్‌ను, ఇరాన్‌ రక్షణ మంత్రిని హతమార్చినప్పటికీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు చేకూరలేదు. పైగా ఇరాన్‌పై ప్రయోగించిన క్షిపణి గురితప్పి ఓ బాలికల పాఠశాలపై పడడం, అనేక మంది విద్యార్థినులు సహా 175 మంది ప్రాణాలు కోల్పోవడం ట్రంప్‌ను అప్రదిష్టపాలు చేసింది.

కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ యుద్ధం మొదలైన తొలి వంద గంటల వ్యవధిలో ఇరాన్‌ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ స్వల్ప వ్యవధిలోనే ఐదు వందల క్షిపణులు, రెండు వేలకు పైగా షాహెద్‌ డ్రోన్లను ప్రయోగించి శత్రువులను కంగుతినిపించింది. తొలుత ఇజ్రాయిల్‌-అమెరికా, ఇరాన్‌ మధ్యే యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పుడు అందులోకి ట్రంప్‌ 16 దేశాలను లాగారు. అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఐఆర్‌జీసీని ఏమీ చేయలేకపోతున్నారు. ఇదిలావుంటే హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరిచినప్పుడే అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం సమసిపోతుంది. అయితే ఆ పని జరిగేలా లేదు. యుద్ధంలో సాయపడేందుకు నాటో సభ్య దేశాలు మొండిచేయి చూపడంతో ట్రంప్‌ ఆగ్రహంతో ఊగిపోతూ శాపనార్థాలు పెడుతున్నారు. ఏదేమైనా యుద్ధాన్ని ప్రారంభించడం తెలిసిన ట్రంప్‌కు దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -