ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అయోమయం
రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతాధికారుల చర్చలు
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. దీనిపై ఎలా ముందుకు పోవాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులు చర్చలు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం మూడు దఫాలుగా గడువు పొడిగించినా ప్లాట్ల యాజమానులు ముందుకు రావడం లేదు. దీంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రోత్సహించేందుకు మున్సిపల్ శాఖ జూన్ 2025 వరకు గడువును పొడిగించింది. అది ముగిసి ఆర్నెల్లు అయ్యింది.
ఆన్‌లైన్లో ధరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ప్రకటించగానే ఆన్‌లైన్లో 15.54 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేరాయి. వీటన్నింటిని పరిశీలించిన మున్సిపల్ శాఖ అధికారులు 11.62 లక్షల మంది దరఖాస్తుదారులకు లేఖలు రాసింది. ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు మార్కెట్ ధరను చెల్లించాలని పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రోత్సహించేందుకు 25 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ప్రతిగా కేవలం 2,08,000 మంది మాత్రమే సరైన డాక్యుమెంట్లతో ముందుకు వచ్చారు. వారికి లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ధృవీకరించింది. మిగతా దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం రావడం లేదు. దీనికి బాధ్యత వహిస్తూ అధికారులు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఆదాయం అంతంతే…
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ. 3వేల కోట్లు రాబట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయినా ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా రూ. 147 కోట్లే రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇక్కడ నుంచి లెక్క తప్పింది. దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎందుకు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతున్నది. ఈ స్కీమ్‌లో ప్లాట్ల ధృవీకరణ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, స్థలం ఖాళీగా ఉండాల్సి ఉంది. దీంతోపాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖ కూడా ఆ స్థలాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఆ స్థలాలు బఫర్‌జోన్లు, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల స్థలంపై సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినా ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వీటన్నింటితోపాటు ఫీజు కూడా ఎక్కువగా నిర్ణయించారనే విమర్శలున్నాయి. ఈ కారణాలతో చాలా మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌కు చేయించుకునేందుకు ముందుకు రాకపోయి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్న యాజమానులు మాత్రం తగిన ఆధారాలతో వచ్చి ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిర్ణయం
రాష్ట్రంలో 159 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఉన్నాయి. వాటిలోనే ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుంది. 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లకు ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తోపాటు కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.



