పాక్ బాయ్ కాట్ నిర్ణయంపై సమాలోచన
ఆంక్షలతో దారికితెచ్చే ప్రయత్నంలో ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ వచ్చేసింది. పొట్టి ప్రపంచకప్ వేటకు 20 దేశాలు ఆతిథ్య దేశాలకు చేరుకోగా, సోమవారం నుంచే వార్మప్ మ్యాచ్‌లు ఆరంభమైనవి. ఈ శనివారం నుంచి టీ20 వరల్డ్‌కప్ మేనియా షురూ కానుండగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఊహించని తలనొప్పి ఎదురైంది. భారత్‌లో ప్రపంచకప్ ఆడలేమని బంగ్లాదేశ్ తప్పుకుంటే.. బంగ్లాకు బాసటగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసింది. బాయ్ కాట్ నిర్ణయం ఐసీసీతో పాటు కమర్షియల్ భాగస్వాములను కలవర పెడుతోంది.
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంక సంయక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల్లో పర్యటనకు ప్రభుత్వాల అనుమతులు వంటి పలు కారణాలతో ఐసీసీ టోర్నమెంట్లకు భారత్, పాకిస్తాన్‌లు హైబ్రిడ్ మోడల్‌లో ఆతిథ్యం ఇస్తున్నాయి. నిరుడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను యుఏఈలో ఆడగా.. తాజాగా పాకిస్తాన్ తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతుంది. పాకిస్తాన్ సెమీస్‌కు, ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌లు సైతం శ్రీలంకలోనే నిర్వహిస్తారు. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయినా.. దాయాదుల సమరాన్ని ఐసీసీ భారీగా సొమ్ముచేసుకుంటుంది.
ప్రతి టోర్నమెంట్‌లో గ్రూప్ దశలోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. తాజా టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్, పాక్‌లు గ్రూప్-ఏలో ఉన్నాయి. అటు అభిమానుల్లో, అటు కమర్షియల్ మార్కెట్‌లో దాయాదుల మ్యాచ్ పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది. భారత్, పాక్ మ్యాచ్ నిర్వహణతో ఐసీసీ సమారు రూ.2200 కోట్లు ఆర్జిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేయటంతో ఐసీసీ అంతర్మథనంలో పడింది. పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించటం పక్కనపెడితే.. ఐసీసీకి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ బరిలోకి దిగేలా చేసేందుకు ఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది.
ఎవరికీ ఉపయోగం లేదు!
భారత్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసేందుకు పాకిస్తాన్ వద్ద కారణాలు లేవు. బంగ్లాదేశ్‌ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించటాన్ని విమర్శించిన పీసీబీ… బంగ్లాకు బాసటగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రపంచకప్ ఆడేందుకు నిరాకరించి బంగ్లాదేశ్ ఆర్థికంగా దారుణంగా దెబ్బతింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే.. ఐసీసీ రూ.200 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. దీనికి అదనంగా ప్రతి ఏడాది ఐసీసీ రూ. 300-350 కోట్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గ్రాంట్‌గా అందిస్తోంది. ఈ నిధుల్లో కోత లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశం లేకపోలేదు. పీసీబీకి ఆర్థికంగా ఉపయుక్తంగా ఉన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లకు ఎన్‌ఓసీ నిరాకరణ సహా ద్వైపాక్షిక సిరీస్‌లకు పాక్‌లో పర్యటించకుండా అగ్రదేశాలకు ఆదేశాలు ఇచ్చేందుకు సైతం ఐసీసీ వెనుకాడబోదని తెలుస్తోంది. ఐసీసీ నుంచి ప్రత్యక్షంగా నిధుల కోతతో పాటు దేశీయంగా క్రికెట్‌తో ఆదాయ ఆర్జన పాకిస్తాన్‌కు దూరం కానుంది!.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌తో ప్రసారదారు సుమారు రూ.2000 కోట్లు ఆర్జించనుంది. ఐసీసీ టోర్నమెంట్లకు మెగా మ్యాచ్‌లతోనే మీడియా హక్కులకు భారీగా ధర వస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే, ప్రసారదారు నుంచి ఐసీసీకి ఒత్తిడి ఎదురుకానుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ప్రసారదారు నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ అమ్మకాలు, బ్రాండింగ్, ప్రకటనల రూపంలో ఐసీసీ దండిగా ఆదాయం వస్తుంది. తాజా పరిస్థితుల్లో ఓవరాల్‌గా రూ.2200 కోట్ల వరకు ఐసీసీ నష్టపోనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నాకౌట్ దశలోనూ రద్దుగా ముగిస్తే.. ఆ నష్టం మరింత అధికంగా ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పాయింట్ల కోత, నెట్‌రన్‌రేట్‌పై ప్రతికూల ప్రభావం వంటి క్రికెటింగ్ జరిమానాలకు సిద్ధపడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పీసీబీపై ఆర్థిక ఆంక్షలతో దారికితెచ్చుకునే ఆలోచనలో ఐసీసీ ఉండగా.. అమోమయ పరిస్థితిలో ఐసీసీ బోర్డు సమావేశంపై సైతం ఎవరికీ స్పష్టత లేదు.



