Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళితులకు ఒరిగేదేముంది?

దళితులకు ఒరిగేదేముంది?

- Advertisement -

బడ్జెట్‌లో అంకెలు పెరిగినా ప్రయోజనాలు సున్నా
సబ్‌ప్లాన్‌ కేటాయింపులు ఫుల్‌-ఖర్చులు నిల్‌ : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్‌ బాబు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర బడ్జెట్‌లో అంకెలు పెరిగినా దళితులకు ప్రయోజనం కలగడం లేదని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ జాతీయ కార్యదర్శి టీ.స్కైలాబ్‌ బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా 20 శాతమున్న దళితులకు రూ.1.96,400 కోట్లు కేటాయించారని తెలిపారు. అయితే సబ్‌ ప్లాన్‌ కు కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. 102 శాఖల ద్వారా దాదారు రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించినప్పటికీ, వాటన్నింటిని ఒక చోట పెట్టి ఫూల్‌ చేసి నోడల్‌ ఆఫీసర్‌ను కేటాయించకపోవడంతో దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం వాటిని ఖర్చు చేసే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. వివిధ శాఖల ద్వారా ఖర్చుపెట్టినప్పటికీ ప్రత్యేకంగా దళితులకు ఖర్చు చేయకపోవడంతో వారి సంక్షేమం కుంటుపడు తుందని వివరించారు. దళితుల్లో 70 శాతం మంది కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 శాతం మంది దళితులు సరైన దుస్తులు పౌష్టికాహారానికి నోచుకోవడం లేదని తెలిపారు.

దళితుల జనాభా 20 నుంచి 25 శాతానికి పెరుగుతున్నప్పటికీ బడ్జెట్‌ మాత్రం 16 శాతం దగ్గరే ఆగిందని విమర్శించారు. పట్టణాలకు పెరిగిన వలసల్లో దళితులు ఎక్కువగా ఉంటున్నారనీ, వారికి కనీస నివాసం కల్పించడం లేదని స్కైలాబ్‌ బాబు విమర్శించారు. బీజేపీ 12 ఏండ్ల పాలనలో దళితులపై దాడులు పెరిగాయనీ, వారి ఉపాధిని దెబ్బతీసేలా నరేగా చట్టాన్ని రద్దు చేసి వీబీ జీ ఆర్‌ఏఎంజీ’ని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 రోజుల పని దినాలు పెంచుతామన్న కేంద్రం అందుకు అనుగుణంగా రూ.1,50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆ చట్టం ప్రారంభ దినాలలో రూ. 1,18,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుతం తగ్గించిందన్నారు. మూడు విభాగాల ద్వారా దళితులకు కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ కింద కేంద్రమే ఒక నోడల్‌ ఆఫీసర్‌ను అపాయింట్‌ చేసి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టే విధంగా ప్రత్యేకంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రికి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి మూడు నెలలకోసారి ఈ బడ్జెట్‌పై సమీక్ష చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -