Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంఈ బడ్జెట్‌ ఏమిస్తుందో…!?

ఈ బడ్జెట్‌ ఏమిస్తుందో…!?

- Advertisement -

గంపెడాశతో ఎదురుచూస్తున్న మధ్యతరగతి జీవులు
నాటకీయ ప్రకటనలు, పన్నుకోతలు వద్దు
ఉపాధి, గూడు చూపించండి…ధరలను అదుపు చేయండి

న్యూఢిల్లీ : 2026-27వ సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తోంది. ఈ బడ్జెట్‌ తమ రోజువారీ జీవితాలకు ఊరట కలిగిస్తుందని, ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని మధ్య తరగతి జీవులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి వారు నాటకీయ ప్రకటనలు, పన్ను కోతలను కోరుకోవడం లేదు. వాటికి బదులుగా తమకు స్థిరమైన ఆదాయం లభించాలని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని, గృహ వసతి కల్పించాలని, ఆరోగ్య రక్షణ అందించాలని ఆశిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ రోజువారీ జీవితాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలని అనుకుంటున్నారు. అసలు బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజానీకం ఏమి కోరుకుంటోందనే విషయంపై ఆర్థికవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయంటే…

కొనుగోలు శక్తి పెరగాలంటే…
నిలకడైన ఉపాధి, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం…ఇవి మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయి. కాబట్టి 2026 బడ్జెట్‌ ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆర్థికపరంగా విశ్వాసం పెరిగినప్పుడు సంప్రదాయ దుస్తుల కొనుగోలు దానంతట అదే పెరుగుతుంది. వస్త్ర పరిశ్రమతో సంబంధమున్న కళాకారులు, నేత పనివారు, ఎంఎస్‌ఎంఈలు ఎంతగానో ప్రయోజనం పొందుతాయి. కింది స్థాయిలో విధాన పరమైన మద్దతు అవసరమవుతుంది.

అలా చేస్తే ధరలు స్థిరం
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, రిటైల్‌ వ్యాపారాలను సులభతరం చేయడం, నిధుల లభ్యతను మెరుగుపరచడం వంటి చర్యలు ధరలను స్థిరంగా ఉంచడంలో ఉపకరిస్తాయి. నాణ్యత, నమ్మకాన్ని కాపాడుకుంటూ ఖర్చు పెట్టే సొమ్ముకు తగిన విలువను అందించడం ఎంతో ముఖ్యం. కాబట్టి దీనిపై మరింత దృష్టిని పెట్టాలి.

ఆర్థిక కేంద్రాలకు దగ్గరగా గృహ నిర్మాణాలు
నాణ్యతలో రాజీ పడకుండా అద్దె గృహ పథకాలు చేపట్టడం, పాత గృహాలను పునరుద్ధరించడం, ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రారంభించడం వంటి చర్యలతో హౌసింగ్‌ సమస్యను పరిష్కరించవచ్చు. ఆర్థిక కేంద్రాలకు సమీపంలో గృహ నిర్మాణాలు చేపడితే ప్రజలపై రోజువారీ ఒత్తిడి తగ్గుతుంది. పని ప్రదేశం చేరువగా ఉంటే కార్మికుల జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు.

పన్ను కోతల అవసరం లేదు
కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం పన్ను రహిత ఆదాయ పరిమితిని ఇప్పటికే 12 లక్షల రూపాయలకు పెంచింది. అంతేకాక ఎంపిక చేసిన వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. తద్వారా వేతన జీవులకు ఎంతో ఊరట కల్పించింది. ఫలితంగా అధిక వ్యక్తిగత పన్నులపై ప్రజల్లో ఆందోళన తగ్గిపోయింది. ఇప్పుడు మధ్య తరగతి జనానికి కావాల్సింది పన్ను కోతలు కావు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉండాలి. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి. వారి సొంతింటి కలను నెరవేర్చి, ఆరోగ్య రక్షణ కల్పిస్తే పొదుపు పెరిగి వారి జీవితాలు క్రమేపీ మెరుగుపడతాయి.

సమతూకంగా ఉండాలి
మొత్తంగా చూస్తే మధ్య తరగతి ప్రజలు సమతూకమైన బడ్జెట్‌ను కోరుకుంటున్నారు. అంటే ఉద్యోగాలకు రక్షణ కల్పించడంతో పాటు నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలని ఆశ పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షలాది మధ్య తరగతి ప్రజానీకం హడావిడి ప్రకటనలను ఆశించడం లేదు. తమ రోజువారీ జీవితాలు సాఫీగా, స్థిరంగా సాగాలన్నదే వారి కోరిక. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వారి న్యాయసమ్మతమైన కోరికను నెరవేరుస్తారో లేదో చూడాల్సి ఉంది.

ధరల పెరుగుదల… మధ్య తరగతిపై ఎఫెక్ట్‌
మధ్య తరగతి ప్రజలు పండుగలు, వివాహాలు, కుటుంబ వేడుకలు వచ్చినప్పుడు దుస్తులు కొంటారు. గృహ బడ్జెట్‌ ఒత్తిడికి గురైనప్పుడు వారు ముందుగా వాయిదా వేసుకునేది దుస్తుల కొనుగోలునే. గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు ఓ ప్రణాళిక ప్రకారం అవసరాల మేరకే ఖర్చు చేయడం అలవాటు చేసుకున్నారు. అంటే విలువకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న మాట. ప్రజలు ఎప్పుడూ నాణ్యతనే కోరుకుంటారు. అయితే అది పెట్టే ఖర్చుకు తగినట్టు ఉండాలని ఆశిస్తారు.

నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం
స్పష్టమైన భూ యాజమాన్య హక్కులు, సరళమైన డాక్యుమెంటేషన్‌ వంటి చర్యలు గృహ యాజమాన్యాన్ని సులభతరం చేస్తాయి. స్వల్పకాలిక ప్రోత్సాహాల కంటే నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. దేశంలో ఆర్థిక పరమైన స్థిరత్వం ఉన్నప్పటికీ ఓ మోస్తరు ఆదాయం పొందుతున్న కుటుంబాలకు ఇప్పటికీ ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఇంధనం, ఎల్పీజీ సిలిండర్లు, పాలు-పాల ఉత్పత్తులు, కూరగాయల ధరలు గృహ బడ్జెట్‌ను నేరుగా ప్రభావితం చేస్తాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆచితూచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా దుస్తులు, ఇతర కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఒక సగటు మధ్య తరగతి పౌరుడిని గందరగోళానికి గురి చేస్తుంది. గృహ రుణాల విషయానికి వస్తే వడ్డీ రేట్లను బడ్జెట్‌ ప్రకటనల కంటే ద్రవ్యోల్బణం, ఆర్బీఐ విధానాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే వడ్డీ రేట్లు మరింత కోతకు గురి కాకుండా స్థిరంగా ఉంటాయి.

సొంతింటి కల నెరవేరాలంటే…
మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఎదురు చూసేది సొంత గూడు కోసమే. అయితే అది మెజారిటీ ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఆస్తి ధరలు, నిర్మాణ ఖర్చులు పెరిగిపోతుండడంతో మధ్య తరగతి జీవులకు సొంతింటి కల కలగానే ఉండిపోతోంది. అయితే నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో అది సాధ్యపడడం లేదు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వేగవంతంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సామూహిక గృహాల నిర్మాణాన్ని చేపట్టి మౌలిక వసతులు కల్పించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -