రేపు తేలనున్న భవితవ్యం
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపే లక్ష్యంగా ముమ్మరంగ ప్రచారం కొనసాగించిన అభ్యర్థులు మంగళవారం ఓటరు దేవుని ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నం వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని గ్రామాల్లో ఓటర్లకు తాయిళాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..మూడవ విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబాల్లో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం..పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కానుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో గుబులు నెలకొంది. ఇన్ని రోజులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారాలు..ప్రలో భాలు చేపట్టాం..ఇప్పుడు ఏం జరుగుతుందో? తీర్పు ఎలా ఉంటుందో? నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. గెలవకుంటే ఎట్లా.?ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం..అమ్ముకున్నాం..అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో.. అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు తీవ్ర కలవరం చెందుతున్నారు. గెలవకుంటే ఎలా అన్న సందిగ్ధం వారిలో నెలకొంది. ఏదేమైనా ఈ పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి.ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో కొన్ని గంటల్లో తేలనుంది.



