Saturday, January 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబడ్జెట్‌లో మనకేంటి?

బడ్జెట్‌లో మనకేంటి?

- Advertisement -

కేంద్రంవైపు రాష్ట్రం చూపు
ఈ బడ్జెట్‌లోనైనా నిధులిస్తారేమోనని ఆశ
రూ.1.50 లక్షల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
12 ఏండ్లుగా నెరవేరని విభజన హామీలు
ఈసారీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే మోడీ సర్కారు ప్రాధాన్యత ఇస్తుందని ప్రచారం
ప్రతిపక్ష పాలక ప్రభుత్వాలపై బీజేపీ వివక్ష

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. ఈసారైనా తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయిస్తుందా? అనేది రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్‌లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏటా ఇలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం, అక్కడ మొండిచేయి చూపించడం ఆనవాయితీగా మారింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. మోడీయే ప్రధానిగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను 12 ఏండ్లయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అంటే తెలంగాణ పట్ల ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది.

2025-26 కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ప్రాధాన్యత బీజేపీ ఇస్తున్నది. ఈ ఏడాది అస్సాం, పశ్చిమబెంగాల్‌, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల్లోనూ ఆయా రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. వచ్చేనెల ఒకటిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనూ ఆ రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తుందనే రాజకీయ చర్చ జరుగుతున్నది. ఎన్డీఏలో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు ఏపీ, బీహార్‌లకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందనీ, వామపక్షాలు, ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఈసారి కూడా మొండిచేయి, వివక్ష తప్పవనే ప్రచారం జరుగుతున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశెలు పెట్టుకుంది. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈసారి ఎంతోకొంత ఎక్కువగా నిధులు కేటాయించాలని పేర్కొంటూ ప్రతిపాదనలు పంపారు.

రాష్ట్రంలో 8 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు
రాష్ట్రంలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వికారాబాద్‌- కృష్ణ కొత్త రైలు మార్గం, కల్వకుర్తి- మాచర్ల రైలు లైన్‌, గద్వాల్‌- డోర్నకల్‌ రైలు మార్గం, కాచిగూడ- జగ్గయ్యపేట రైలు మార్గం, పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైలు లైన్‌, బోధన్‌- లాతూర్‌ రోడ్‌ లైన్‌, అక్కన్నపేట బైపాస్‌ రైలు లైన్‌, పాండురంగాపురం- భద్రాచలం రోడ్‌ లైన్‌ వంటి వాటికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌లో తెలంగాణను చేర్చాలని సూచించింది. ఖమ్మం లేదా మహబూబాబాద్‌ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. పీఎం మిత్ర కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్రం సాయం చేయాలని కోరింది. తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 లక్ష్యానికి అనుగుణంగా లాజిస్టిక్స్‌, ఇండిస్టియల్‌ కారిడార్‌ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది.

ఐఐఎంను మంజూరు చేయాలి
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వాలని తెలిపింది. హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కోరింది. పవర్‌ సిస్టం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద ఆరు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను ఇవ్వాలని తెలిపింది. పీఎం-కుసుమ్‌ కింద సోలార్‌ పంపుసెట్లను కేటాయించాలని పేర్కొంది. సింగరేణికి బొగ్గు బ్లాకుల గుర్తింపునకు అనుమతి ఇవ్వాలని కోరింది. తాడిచెర్ల కోల్‌ బ్లాక్‌-2 మైనింగ్‌ లీజుకివ్వాలని తెలిపింది.

పీఎంఏవైలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలకు పీఎంఏవైని విస్తరించాలని కోరింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఈనెల పదో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి విజ్ఞప్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. సెస్‌, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఈ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి పట్ల కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వచ్చేనెల ఒకటిన తెలుస్తుంది.

కేంద్రంలో 47 అంశాలు పెండింగ్‌
రాష్ట్ర విభజన జరిగి 12 ఏండ్లు అవుతున్నది. తెలంగాణకు రావాల్సిన కీలక నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే నిలిచిపోయాయి. దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టూ సుమారు 350 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుమతులతోపాటు రూ.34,367 కోట్లు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్లు కావాలని ఇప్పటికే కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలను సమర్పించారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దాని నిర్మాణానికి రూ.44,028 కోట్లు మంజూరు చేయాలని కోరింది. గోదావరి నుంచి మూసీకి నీటిని మళ్లించే లింక్‌ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.ఆరు వేల కోట్ల ఆర్థిక సాయం కావాలని తెలిపింది. వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ (యూజీడీ) ప్రాజెక్టుకు కేంద్ర నిధులు కావాలని పేర్కొంది. హైదరాబాద్‌ సమగ్ర మురుగు నీటి మాస్టర్‌ ప్లాన్‌ (అమృత్‌ 2.0/ స్పెషల్‌ ప్రాజెక్ట్‌), బందర్‌ పోర్ట్‌, హైదరాబాద్‌ డ్రై పోర్ట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ ప్రతిపాదనల కోసం రూ.17 వేల కోట్లు మంజూరు చేయాలని కోరింది. ఇటీవలే వరంగల్‌ మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఆదిలాబాద్‌, కొత్తగూడెం, బసంత్‌ నగర్‌ విమానాశ్రయాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -