•బొమ్మలరామారం మండలం ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు
•ముచ్చటగా మూడు కేంద్రాలకే ముహూర్తా పెట్టిన ఎమ్మెల్యే
•అన్నదాతల పడిగాకాపులు
నవతెలంగాణ _బొమ్మలరామారం
వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు.కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం వరి ధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాథుడే లేకుండా పోయాడు. రెండు రోజుల క్రితం నుంచి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వరి కోతలు పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పలు పోసిన రైతులు కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నారు. 15 రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసిన రైతులు వాటిని కాపలా కాసేందుకు ధాన్యం తడవకుండా పట్టాలు కప్పుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చీకటిమామిడి, మేడిపల్లి, ఫకీర్ గూడెం,గ్రామాలలో మాత్రమే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఐకెపి కేంద్రాలు ప్రారంభించారు.మిగతా చోట్ల నేటికి ప్రారంభించలేదు. రోజువారీగా సోషల్ మీడియాలో ప్రారంభిస్తామని పెట్టడం, తెల్లవారుజామున రైతులంతా సిద్ధం కాగానే వాయిదా పడ్డదని చెప్పడమే సరిపోతుంది. ఎంతో ఆశతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాగా అధికారుల నాయకులు రైతులను నిరాశ పరుస్తున్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటి వరకు కొనుగోలు జరపకపోవడం శోచనీయమని రైతులు వాపోయారు.వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు కోసిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావడం జరిగింది. కేంద్రానికి తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయడమే కాదు కనీసం తూకాలు కూడా ఏర్పాటు చేయలేదు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కనీసం టార్పాలిన్లను పంపిణీ చేయడంలో కూడా విఫలమయ్యారు. మొంథా తుఫానుకు కురిసిన భారీ వర్షాలకు రైతులు తీసుకువచ్చిన వారి ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే వడ్లను రైస్ మిల్ కు తరలించే ప్రక్రియ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
• మా ఊర్లో ఎప్పుడు కొంటారు
చుట్టుపక్కటూళ్లలో వడ్లు కొనుడు మొదలైంది గాని, మా ఊర్లో ఎప్పుడు కొంటార. నిన్న మొన్న భారీ వర్షాలకు వడ్లని నానిపోయాయి, మల్లమల్ల ఎండవోసుడు కావట్టె, పారబోస్తున్న వర్షం భయంతో సాయంత్రం కాగానే పరదాలు కప్పుతున్నాం.కేంద్రంలో మంచినీరు కూడా లేదు.కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం
బండ రమేష్ మర్యాల
పట్టించుకోవడం లేదు..
ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్న ధాన్యం ఎవరు కొంటారో తెలియడం లేదు. ఐకెపి ఆధ్వర్యంలో మూడు గ్రామాలలోనే ప్రారంభించారు.ఈసారి కొత్తగా సంఘ బంధ నిర్వాహకులకు బాధ్యత అప్పగించారు. ఇంతవరకు ఏ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు.రోజు పరదాలకు 3 నుంచి 5వేల అవుతుంది.అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు.
•గుర్రం ప్రవీణ్ రెడ్డి చౌదర్ పల్లి



