Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeకవితఊపిరాడని వేళ

ఊపిరాడని వేళ

- Advertisement -

ఉక్కబోస్తున్న వేళ
మనల్ని మనమే బరువుగా
మోస్తున్న వేళ
సమస్యలన్నీ చెమట బిందువులుగా మారి
మనలో ఉన్న ఓపికను
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవేళ…
ఏం చేస్తాం..
తలామునకలైపోతాం..
కాసేపు.. తలకిందులైపోతాం..
నేలకు, నింగికి, నింగికి, నేలకు
నిచ్చెనలాంటి వాక్యాల్ని
ఒక్కొక్కటి అల్లి
కవితలుగా మారిపోతాం.
ఒక్కోసారి..
దీపంలాగ వెలగడమంటే ఇష్టముండదు..
చీకటిలాగ నలగడమంటేనే ఇష్టం.
చెదరని తెల్లని కాగితంలా ఉండడమంటే నచ్చదు.
ముడతలు పడ్డ కాగితంలా ముడుచుకుపోయి
చిరిగిపోవడమే ఇష్టం..
ఊపిరాడని సమయాల్లో
దిగాలుగా కూర్చోడం నచ్చదు
ఊహాలోకాల మీద దండయాత్ర
చేయాలనిపిస్తుంటుంది..
ఊపిరాడని క్షణాలమీద
ఊపిరులూదే గీతాలు రాయాలనిపిస్తుంది.
అలా అలా అలల్లా కాకుండా
ఎడారిలానే ఉండాలనిపిస్తుంది.
ఒంటరితనాన్ని వెంటేసుకుని వెళ్తుంటే..
నాకైతే.. పదిమంది మిత్రులతో
కలిసి వెళ్ళినట్టనిపిస్తుంది.
కొందరికైతే.. ఊపిరాడని వేళ
ఉరికంబమెక్కినట్టుగా
మెడకు ఉచ్చుబిగిసినట్టుగా తోస్తుంది..
వైరాగ్యంతో విహరించే నాలాంటివాడికి
అది వరాలజల్లు కురిసినట్టుగా ఉంటుంది.
ఒక కొత్త విషాద కావ్యానికి
తొలివాక్యం రాసుకున్నట్టుగా ఉంటుంది..
– డా. తిరునగరి శరత్‌ చంద్ర, 6309873682

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad