Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగ్రూప్‌-1 కొలువులు వచ్చేదెప్పుడు?

గ్రూప్‌-1 కొలువులు వచ్చేదెప్పుడు?

- Advertisement -

అభ్యర్థుల్లో ఆందోళన
మెయిన్స్‌ పరీక్షను రద్దు చేయాలని కొందరి డిమాండ్‌
హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ తర్జనభర్జన
న్యాయ నిపుణులతో సంప్రదింపులు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసే అవకాశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-1 కొలువులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ మెరిట్‌ జాబితాను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలను పున:మూల్యాంకనం చేపట్టాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ని ఆదేశించింది. దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని కోరింది. ఒకవేళ పున:మూల్యాంకనం సాధ్యం కాకుంటే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను తిరిగి నిర్వహించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలను రద్దు చేయాల్సిందేనని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. తిరిగి రాతపరీక్షలను నిర్వహించాలని కోరుతున్నారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ తర్జనభర్జన పడుతున్నది. ఏం చేయాలనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయాలని సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో టీజీపీఎస్సీకి సానుకూలంగా తీర్పు రాకుంటే అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలను నిర్వహించి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం టీజీపీఎస్సీ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది.

563 గ్రూప్‌-1 పోస్టులతో నోటిఫికేషన్‌
రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 19న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను జూన్‌ తొమ్మిదిన నిర్వహించింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మంది హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో కలిపి 31,403 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలను నిర్వహించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 31,403 మంది అభ్యర్థులు ఎంపికైతే వారిలో 21,093 మంది పరీక్షలకు హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గతేడాది నవంబర్‌ ఒకటి నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు నిర్వహించారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రొవిజినల్‌ మార్కుల వివరాలను ప్రకటించింది. గ్రూప్‌-1 అభ్యర్థులకు ఏప్రిల్‌ 24న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది. జూన్‌ 16న మూడోవిడత ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించింది. అదేనెల 13 నుంచి 17 వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం తీర్పు వెలువడడంతో గ్రూప్‌-1 కథ మళ్లీ మొదటికి వచ్చింది.

ఉమ్మడి రాష్ట్రంలో 6 ఏండ్లు న్యాయపోరాటం
ఉమ్మడి రాష్ట్రంలోనూ గ్రూప్‌-1పై ఇదే పరిస్థితి తలెత్తింది. 2011 గ్రూప్‌-1 మెయిన్స్‌లో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు ఏపీ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని 2016, జూన్‌ 29న ఆదేశించింది. దీంతో 2016, సెప్టెంబర్‌ 14 నుంచి 24వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగాయి. తెలంగాణలో 8,782 మంది అభ్యర్థులు అర్హులు కాగా, 1,792 మంది హాజరయ్యారు. ఆ తర్వాత 2017, జులై 24 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 238 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. 2017, అక్టోబర్‌ 28న 128 గ్రూప్‌-1 పోస్టులకు 122 అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. ఆరేండ్లపాటు న్యాయపోరాటం సాగింది. ఇప్పుడు తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ కోర్టుకు వెళ్లింది. టీజీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయాలని భావిస్తున్నది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశమున్నది. దీంతో ఏం జరుగుతుందో ఎన్నేండ్ల సమయం పడుతుందో గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.

ఇదీ వివాదం…
గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షల్లో వచ్చిన మార్కులపై అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరీక్షల్లో జెల్‌ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్షకు హాజరైన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ మంది ఎంపిక కావడం, రెండు పరీక్షా కేంద్రాల్లో రాసిన వారిలో ఎక్కువ మంది టాపర్లుగా నిలవడం వంటి అంశాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జులై ఏడో తేదీన సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణను సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. మంగళవారం తీర్పు వెలువరించడంతో గ్రూప్‌-1 అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad