Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల పెన్షన్‌ రూ.6 వేలు ఎప్పుడిస్తారు?

వికలాంగుల పెన్షన్‌ రూ.6 వేలు ఎప్పుడిస్తారు?

- Advertisement -

– కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం : మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వికలాంగుల పెన్షన్‌ రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందనీ, దాన్ని ఎప్పుడిస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబ పెద్దలాగా రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికీ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. వికలాంగుల రిజర్వేషన్లు నాలుగు శాతానికి పెంచుతామన్నారనీ, అమలు చేయలేదని చెప్పారు. వికలాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదని అన్నారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ అమలు కాలేదన్నారు.
వారికి ఇచ్చిన హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరాడుతూనే ఉంటుంద న్నారు. వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ కె వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో 5.15 లక్షల మంది వికలాంగులకు నెలకు రూ.నాలుగు వేల పెన్షన్‌ వచ్చేదని అన్నారు. ఇపుడు కేవలం 4.90 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వస్తోందన్నారు. 25 వేల మంది వికలాంగులకు పెన్షన్లలో కోత విధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లలో లక్ష మందికి కోత విధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సభ్యులు కె కిశోర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు మన్నె గోవర్ధన్‌ రెడ్డి, ఆజం అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -