Tuesday, February 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మెట్రో రెండో దశకు మోక్షమెప్పుడు?

మెట్రో రెండో దశకు మోక్షమెప్పుడు?

- Advertisement -

కమిటీల పేరుతో కాలయాపన
కేంద్రం వ్యూహాత్మక మౌనం వెనుక ఆంతర్యం ఇదేనా?
రాజకీయ కోణం ఉందంటున్న విశ్లేషకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు అత్యంత కీలకమైన ‘మెట్రో రెండో దశ’ విస్తరణ వ్యవహారం అటకెక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మారి, కొత్త డీపీఆర్‌లు సిద్ధమైనా.. కేంద్రం నుంచి అనుమతుల్లో మాత్రం కదలిక లేదు. కమిటీల పేరుతో జరుగుతున్న ఈ జాప్యం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన మెట్రో రూట్‌ మ్యాప్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. కొత్త రూట్‌లను(ఎయిర్‌ పోర్ట్‌ మెట్రోతో సహా) ఖరారు చేసింది. ఇందులో.. రెండో దశ ఫేజ్‌-2 ‘ఏ’లో 76.4 కి.మీ మొదటి 5 కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు.. ‘బి’ విభాగం కింద మూడు రూట్‌లలో నిర్మించనున్న 86.1 కి.మీ. కారిడార్‌లకు మరో రూ.19,759 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. ప్రయాణికుల రద్దీ అంచనాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, పరిశీలన పేరుతో కమిటీలను వేస్తూ కాలం వెళ్లదీస్తోంది. దీని వెనుక ఉన్న అసలు ఆంతర్యం ‘నిధుల కేటాయింపు’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే, రకరకాల సాంకేతిక కారణాలు చూపుతూ జాప్యం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

తెర వెనుక ‘ఎల్‌అండ్‌టీ’ ఎపిసోడ్‌..
మెట్రో మొదటి దశను నిర్మించి, నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉన్నామని, ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని లేదా ప్రభుత్వం టేక్‌ ఓవర్‌ చేయాలని కొంతకాలంగా కోరుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఎల్‌అండ్‌టీ మెట్రో బాధ్యతల నుంచి తప్పుకునే ప్రక్రియ లేదా ఈక్విటీ మార్పుల గురించి కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం మొదటి దశ నష్టాల్లో ఉండగా, రెండో దశను ఎవరు నిర్మిస్తారన్న దానిపై కేంద్రానికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ రెండో దశకు అనుమతి ఇచ్చినా, అది కూడా నష్టాల బాట పడితే ఆ భారం(సావరిన్‌ గ్యారెంటి) కేంద్రంపై పడుతుందన్న భయం ఢిల్లీ పెద్దల్లో ఉంది. అందుకే ఎల్‌అండ్‌టీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేవరకు రెండో దశను పెండింగ్‌లో పెట్టారన్న వాదన వినిపిస్తోంది.

‘డబుల్‌ ఇంజిన్‌’ లేని లోటేనా?
అన్నింటికంటే ప్రధానమైనది రాజకీయ కారణం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌) మెట్రో ప్రాజెక్టులకు చకచకా అనుమతులు, నిధులు మంజూరవుతున్నాయి. కానీ, తెలంగాణకు వచ్చేసరికి ‘వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌'(వీజీఎఫ్‌) దగ్గర పేచీలు పెడుతున్నారు. ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) ఉంటేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ తరచుగా చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి, అభివృద్ధి పనుల్లో జాప్యం చేయడం ద్వారా.. బీజేపీ ఉంటేనే పనులు జరుగుతాయి అన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ పరిశీలకుల మాట. ఎల్‌అండ్‌టీ నష్టాలైనా, కేంద్ర-రాష్ట్రాల పంచాయితీ అయినా.. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం నగర ప్రజలే. కమిటీల పేరుతో కాలయాపన ఆపి, తక్షణమే రెండో దశ పట్టాలెక్కకపోతే, భవిష్యత్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ స్తంభించిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కిషన్‌రెడ్డి ‘సన్నాయి నొక్కులు’ ఎందుకు?
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం సరైన డీపీఆర్‌ ఇవ్వలేదని విమర్శిస్తూనే, మరోవైపు కేంద్రం నిధులు ఇస్తుందని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అనుమతులు మాత్రం రావడం లేదు. నిజానికి ఎల్‌అండ్‌టీ ఆర్థిక ఇబ్బందులు, కేంద్రం సందేహాల గురించి కిషన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. నేరుగా ఆ విషయాన్ని చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -