మరో రెండున్నర నెలల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఎలా ఉంటాయన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో మొదలైంది. ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజులు పెంచుతున్న సంకేతాలు యాజమాన్యాల నుంచి తల్లిదండ్రులకు అందాయి. పరిస్థితులు ఎలా ఉన్నా యాజమాన్యాలు ఏడాదికోసారి 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచేస్తున్నాయి. నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫీజుల భారం లేకుండా చేస్తామని గత సర్కార్ కమిటీల పేరిట సాగదీసింది. ప్రస్తుత ప్రభుత్వం గద్దెనెక్కి రెండేం డ్లు దాటినా ఫీజుల దోపిడీని అరికట్టలేకపోయింది. ఇది వచ్చే విద్యాసంవత్సరానికైనా అమల్లోకి వస్తుందా అన్నది సంశయంగానే ఉంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
రాష్ట్రంలో విద్యా సంవత్సరం అంటే ఫీజుల దోపిడీ అన్నట్టుగా మారింది. ఇంజినీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు రూ.1.83 లక్షలు. అదే పాఠశాల విషయానికి వస్తే కార్పొరేట్ స్కూళ్లలో రూ.5 లక్షలు! పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఓ పాఠ శాల కొద్దిరోజుల క్రితం పాఠ్యపుస్తకాల ధరలను రూ.18 వేలకు పెంచింది. అలాగే పేరొందిన ప్రముఖ విద్యా సంస్థలు ఆరో తరగతి ఫీజును అమాంతం 30 వేల రూపాయలు అదనంగా పెంచాయి! దీన్ని సాకుగా చూపెడుతూ కొన్ని యాజమాన్యాలు ‘మా దగ్గర ఫీజు తక్కువగా ఉంది. బయట చూడండి మీకే తెలుస్తుంది’ అంటూ ఏదో తక్కువ చేస్తున్నట్టు నటిస్తూ అందినకాడికి దండుకుంటు న్నాయి. ఇలాగైతే సామాన్యుల పిల్లలకు విద్య అందేనా? ఈ దోపిడీకి కళ్లెమెప్పుడు? ఈ ప్రశ్నే తల్లిదండ్రుల గుండెలో ఇప్పుడు ఒక ఆందోళనగా ఉంటోంది. ఇంత బహిరంగంగా ఫీజుల్ని పెంచుతుంటే, ప్రభుత్వ పెద్దల కట్టడి చేసే చర్యలు మాటలకే పరిమితం కావడం శోచనీయం.
ప్రభుత్వం ఏడాది క్రితమే ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చేందుకు బిల్లు నమూనా సిద్ధమైనప్పటికీ, దానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలపై బిల్లులు ఆమోదం పొందినా ఫీజుల బిల్లును మాత్రం ఆమోదానికి పెట్ట లేదు. దీని వెనుక అంతర్య మేంటి? వ్యక్తిగత అంశాలపై సవాల్ విసురు కునేందుకు సమయం కేటాయించిన అధికార, ప్రధాన ప్రతిపక్షసభ్యులు లక్షల మందికి ఉపయోగపడే బిల్లు గురించి ఎందుకు మాటాడలేదు? కావాలనే పక్కన పడేశారా అన చర్చ ఇప్పుడు నడుస్తోంది. దీనికి జవాబు పాలకులే చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, ఆచరణలో అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత సర్కార్ రుసుములను కట్టడి వేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని 2024 సెప్టెంబర్‌లో ప్రకటించింది. రాష్ట్ర విద్యాకమిషన్ కూడా దీనికోసం చట్టం తీసుకురావాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. అయినప్పటికీ అమల్లోకి రాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఒకవైపు విద్య వంటి ప్రాథమిక హక్కు విషయంలో ఇలా ఆలస్యం చేయడం అనేక అనార్థాలకు దారితీస్తుందని మేధావులు, విద్యావేత్తల అభిప్రాయం. ఇంకోవైపు, ”అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య” అనే నినాదం ప్రజలను ఆకర్షించేలా ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామనే ప్రకటనలు వినిపిస్తున్నాయి. ”యంగ్ ఇండియా” వంటి పేర్లతో కొత్త ప్రభుత్వ పాఠశాలల ప్రచారం జరగడం ఒకవైపు ఆశాజనకంగా కనిపించినా, టెక్నో, గ్లోబల్, ఒలింపియాడ్ వంటి పేర్లతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో దోచుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ఫీజులు పెంచుకునేందుకు పాలకవర్గాలే అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు అదనపు ఫీజులు, ప్రత్యేక కార్యక్రమాల పేరుతో మరింత భారాన్ని మోపుతు న్నాయి. దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణి పెరుగుతున్నప్పుడు, ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.కానీ, లేకపోవడం బాధాకరం.
విద్య అనేది లాభాపేక్షతో నడిచే రంగం కాకూడదు. అది సమాజ అభివృద్ధికి పునాది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని నిర్వర్తించడంలో ఆలస్యం చేయడమంటే భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో మాటలు కాకుండా చర్యలు అవసరం. ఇప్పటికైనా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురా వాలి. ఆ చట్టంలో ప్రతి పాఠశాల ఫీజుల నిర్మాణం పారదర్శ కంగా ఉండేలా నిబంధనలు పెట్టాలి. నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి, ఫీజుల పెంపుపై పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల స్థాయిని పెంచి, ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయమివ్వాలి.
ఈ దోపిడీకి కళ్లెమెప్పుడు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



