Tuesday, November 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'అందరికీ నాణ్యమైన విద్య' అందేదెప్పుడు?

‘అందరికీ నాణ్యమైన విద్య’ అందేదెప్పుడు?

- Advertisement -

సమాజంలో విద్య ప్రాధాన్యతను, ఆవశ్యకతను గుర్తించిన పేద, మధ్య తరగతి బడుగువర్గాలు తమ పిల్లలను చదువుకోసం పంపేక్రమం వేగవంత మయ్యే సమయానికి దేశవ్యాప్తంగా విద్యారంగంలో ప్రయోగాల క్రమం మొదలైంది. తొంభ య్యవ దశకంలో నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ విధానాలు ఊపందుకోవడంతో ఖండాంతర ఆర్థిక సహాయం, ప్రపంచ బ్యాంకు నిబంధనలతో ‘ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు,’ ‘అందరికీ చదువు’, ‘అందరూ చదవాలి-అందరూ ఎదగాలి’ లాంటి అందమైన నినాదాలతో ఆకర్షించింది. ఎపెప్‌, డిపెప్‌, యస్‌యస్‌ఏ, ఆర్‌యంయస్‌ఏ, లాంటి ప్రాజెక్టులతో పాలక వర్గాలు, ప్రభుత్వ విద్యను ప్రయోగాల పుట్టగా మార్చడమే కాక కేంద్ర బిందువైన ఉపాధ్యాయుడిని నిమిత్తమాత్రుడిని చేశాయి. ఈ పరిస్థితులు కార్పొరేట్‌ శక్తులకు మంచి అవకాశాన్ని కల్పించినట్లయింది. ‘రేపు మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలంటే మా పాఠశాలల్లో చేర్చండి’ అంటూ ఊరిస్తూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి దాకా తమ పిల్లలను ప్రయివేటు బాటపట్టే పరిస్థితులు కల్పించారు. ఇక ఉన్నత వర్గాలకోసమైతే మొత్తం పాఠశాల భవనం ప్రాంగణం చలువ పందిళ్లు, ఎయిర్‌ కండిషన్డ్‌లతో ‘స్టార్‌’ ‘గ్లోబల్‌’ స్కూళ్లు వెలిసినవి. నేడు హైద్రాబాద్‌ నగరంలో 5వ తరగతి విద్యార్థికి సంవత్సరానికి 5 లక్షలు, 8వ తరగతి విద్యార్థికి 8.5 లక్షల చొప్పున వార్షిక ఫీజు వసూలు చేసే ప్రయివేటు స్కూళ్లు ఉన్నాయంటే నమ్మశక్యం కాకున్నా, నమ్మి తీరాల్సిందే! ఇక తక్కువ ఆదాయమున్న వర్గాలు సైతం అప్పు సప్పుతోన్కెనా చదివించుకోగలిగే స్కూళ్లను వెతుక్కో వడంతో ప్రయివేటు పాఠశాలలు లేని మండల కేంద్రాలు, ఓ మోస్తరు పెద్ద గ్రామ పంచాయతీలు వెతికినా దొరకని పరిస్థితిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో 2014-15లో 24.85 లక్షల విద్యార్థులుండగా, పదేండ్లలో ఆ సంఖ్య పదహారు లక్షలకు తగ్గింది. అదే ప్రయివేటులో 31.17 లక్షల నుండి 36.26 లక్షలకు పెరిగింది. ఇరుకు గదులు, అపార్ట్‌మెంట్‌లలోకి చేరిన పాఠశాలలు, పట్టణాల్లోనైతే గల్లీ గల్లీకో స్కూల్‌ చందంగా మారింది. ఇదే సందర్భంలో సబ్బండ వర్గాల ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంపాటు కె.జి. నుంచి పి.జి. వరకు అందరికీ ఒకేవిధమైన విద్య నూతన ప్రభుత్వ లక్ష్యమంటూ గొప్పగా ఊరించి ఎంతటి నిర్లక్ష్యానికి గురైందో ఇది వరకే చాలాసార్లు చెప్పు కున్నాం. ఆ నిర్లక్ష్యం, పర్యవాసానాలకు చికిత్స చేయడమే లక్ష్యంగా ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించి నూతన ప్రభుత్వానికి అవకాశమిచ్చినారన్నది వాస్తవం.
కానీ, నూతన ప్రభుత్వం వచ్చి రెండేండ్లవుతున్నా విద్యారంగం ఉదాసీనత నుండి ఇంకా బయట పడలేదు. సమాజాభివృద్ధికి విద్య మూల స్తంభంలాంటిదని చెపుతూనే అవసరమైన కనీస నిర్మాణాత్మక చర్యల విషయంలో కూడా నిర్లిప్త వైఖరి కొనసాగుతున్నది. విద్యారంగంలో సంస్కరణలకోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో రిటైర్డ్‌ ఐఏయస్‌ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు నాణ్యమైన విద్య లక్ష్యంగా అవసరమైన సంస్కరణలతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకోసం ‘తెలంగాణ విద్యా కమిషన్‌’ ఏర్పాటు చేయబడిరది. ఈ కమిషన్‌ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తదితర గ్రూపులతో విస్తృత చర్చల ద్వారా చేసిన అభిప్రాయసేకరణతో ఏప్రిల్‌ 2025లో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈలోగా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. అద్దె భవనాల్లో ఉన్న అన్ని రకాల గురుకులాలకోసం ప్రభుత్వం స్వంత భవనాలను నిర్మించాలనే నిర్ణయం అవశ్యకమైనదైనా, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చినట్లు లేదు. ‘నూతన జాతీయ విద్యావిధానం-2020′ నేపథ్యంలో ”తెలంగాణ రైజింగ్‌-2047” లక్ష్యంగా తెలంగాణ విద్యారంగ నిర్ధిష్ట అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా మార్గనిర్దేశానికి, రాష్ట్ర విద్యావిధాన’ రూపకల్పనకంటూ ఆగస్టు చివరన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావు చైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో మరో కమిటీ నియమించబడింది. దీనికి మళ్లీ వర్కింగ్‌ కమిటీల పేరుతో రిటైర్డ్‌ ఉన్నతాధికారులు, విద్యా రంగ ప్రముఖులు, కన్వీనర్లుగా పదకొండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవన్నీ విద్యావిధాన రూపకల్పన కోసం చేస్తున్న విస్తృత ప్రయత్నాలని పిస్తున్నా క్షేత్ర స్థాయి ఆచరణకు సంబంధించిన ప్రభావవంతమైన చర్యలేవీలేవు. ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు- పదోన్నతులు, పాఠశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా, పారిశుధ్య పని సిబ్బంది కేటాయింపులు తప్ప రెండేండ్లలో విద్యారంగంలో మార్పులు శూన్యం. రెండు దశాబ్దాలుగా మండల, డివిజన్‌ స్థాయి పర్యవేక్షణాధికారుల పోస్టులు, దశాబ్దకాలంగా డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పని భారమంతా ఉపాధ్యాయులపైనే అదనంగా పడుతున్నది. మరి ఇది బడుగులు, అట్టడుగు వర్గాలు, బీదల చదువులపట్ల నిర్లక్ష్యం కాదా?ఈ నిర్లక్ష్యాన్నే మనాలి? చెప్పేమాటలు గొప్పగానే అనిపించినా వాస్తవ పరిస్థితులు ఉపాధ్యా యులు, విద్యాభిమా నులను అయో మయానికి, ఆందోళనకు గురిచేస్తున్నవి.

ఈ సమస్యలకుతోడు బోధనాభ్యసన పరిస్థితులకు సంబంధించి కొత్తగా ఉపాధ్యా య వృత్తిలో చేరడం పట్ల నిరాసక్తత, ఉపాధ్యా యులుగా ఉన్నవారు వృత్తిని వదులుతున్నా రంటూ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తి పట్ల నిస్సహాయత, నిరాసక్తతపై ఈ మధ్య ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించబడ్డ ఎన్‌సిఈఆర్‌టి పూర్వ డైరెక్టర్‌ ప్రొ.కృష్ణ కుమార్‌గారి వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ముఖ్యంగా వివిధ బోధనా కార్యక్రమాల పేరుతో అమలుచేస్తున్న ఎఫ్‌ఎల్‌యన్‌, తొలిమెట్టు, బేస్‌లైన్‌ పరీక్షలు, కొత్తగా ఫేసి యల్‌ రికగ్నిషన్‌ సర్వీసు (ఎఫ్‌ఆర్‌యస్‌)ల ద్వారా హాజరు నమోదు లాంటి వాటి మూలంగా బోధనా సమయం తగ్గిపోతుందనే భావన ఉపాధ్యాయులకు కలుగుతున్నది. దీనికితోడు నిరంతరం మళ్లీ మళ్లీ నివేదికలు పంపడం, ఫారాలు నింపడం, సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లాంటివి బోధన విద్యార్థిపై కేంద్రీకరణకు ఆటంకంగా మారడమే కాక సగటు ఉపాధ్యాయుడికి చికాకు కల్పించేవిగా మారుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. కృష్ణకుమార్‌ మాటల్లో ”బోధన స్థితిగతుల మూలంగా నిరాశతో తమ ఉద్యోగాన్ని వదిలివెళ్తున్నవారి మూలంగా ఒక నిశ్శబ్ద సంక్షోభాన్ని గమనించవచ్చు. రెండు దశాబ్దాల క్రితమే ఈ ధోరణి ప్రారంభమైనట్లు యునెస్కోసైతం గుర్తించినట్లు తమ అధికారిక జర్నల్‌లో ప్రచురించిన ప్రపంచ వ్యాప్త సర్వే స్థితిగతుల వివరాలను బట్టి తెలుస్తున్నది.”
ఈ పరిస్థితుల్లో పాఠశాల భవనాల నిర్మాణంతోపాటు క్షేత్రస్థాయి బోధనా స్థితిగతులు, ఉపాధ్యాయుల అందుబాటు, మార్గదర్శక పర్య వేక్షణ పరిస్థితులను చక్కదిద్దాలి. రాష్ట్రస్థాయి ఉన్నతాధి కారులుసైతం ఆఫీసులో దస్తావేజుల పరిశీలనకే సమయాన్ని కేటాయించడం కాకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణలో కనీసంగానైనా ఉండాలి. ఉపాధ్యాయు లను కేవలం సేవలందించే వారిగాకుండా భవిష్యత్‌ పౌరులకు నిర్దేశకులుగా విద్యారంగంలో వారి అభిప్రాయాలకవసరమైన ప్రాధాన్యతనీయాలి. ‘బాసిజం’ కాకుండా స్ఫూర్తిదాయకమైన మార్గదర్శ కత్వంతో చఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని పెంచేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలకు ఉపక్రమించాలి. కార్పొరేటు విద్యాసంస్థల ఫీజులు నియంత్రించాలి. సెలబస్‌, పరీక్షలు ఇత్యాది విషయాల్లో ఏకపక్ష స్వతంత్ర విధానాలకు చెక్‌పెట్టాలి. ప్రభుత్వాలు అధికారం కోసం అందమైన మాటలు, కమిటీలతో కాలయాపన మాని చిత్తశుద్ధితో విధానాల అమలుకు పూనుకోవాలి. మేధావుల హెచ్చరికలను పరిశీలించి చక్కదిద్దాలి. అప్పుడే అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించగలం.
పి.మాణిక్‌రెడ్డి
9440064276

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -