Thursday, July 24, 2025
E-PAPER
Homeక్రైమ్మా వాళ్ల జాడెక్కడ..?

మా వాళ్ల జాడెక్కడ..?

- Advertisement -

– సిగాచి’ వైస్‌ చైర్మెన్‌ను నిలదీసిన బాధిత కుటుంబసభ్యులు
– మూడ్రోజుల తర్వాత ఘటనాస్థలికి రావడంతో ఆగ్రహం
– లభించని 11 మంది ఆచూకీ
– ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమం
– మొత్తం 18 మృతదేహాల గుర్తింపు, బంధువులకు అప్పగింత
– మార్చురీలో మరో 20 మృతదేహాలు
– శిథిలాల నుంచి రెండు మృతదేహాలు వెలికితీత
– కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
– సీఎం పర్యటనలో మేనేజ్‌మెంట్‌ ఉందన్న చిదంబర్‌ నాథన్‌
– 40 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించిన యాజమాన్యం
– 90 రోజుల వరకు ఆపరేషన్‌ నిలిపివేత.. స్టాక్‌ మార్కెట్‌కు లేఖ
– బాధితులకు కాంగ్రెస్‌ నేతలు మీనాక్షి, మహేష్‌కుమార్‌ గౌడ్‌ పరామర్శ

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమ వాళ్ల జాడలేకపోవడంతో ఆందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యులు కంపెనీ వైస్‌ చైర్మెన్‌ చిదంబర్‌ నాథన్‌ను నిలదీశారు. కంపెనీలో పనిచేసిన కార్మికుల లెక్కలు, మృతులు, గాయపడినవారు, సురక్షితంగా ఉన్న వాళ్ల సంఖ్యకు సంబంధించి చెబుతున్న లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచూకీ లేని తమ వాళ్లు 11 మంది ఏమయ్యారో చెప్పాలని నిలదీశారు. చనిపోతే కనీసం వాళ్ల మృతదేహాలైనా చూపాలంటూ కన్నీరు పెడుతూ వేడుకున్నారు. ప్రమాదం జరిగిన మూడ్రోజుల తర్వాత సిగాచి కంపెనీ వైస్‌ చైర్మెన్‌ చిదంబర్‌ నాథన్‌ బుధవారం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అక్కడే ఉన్న బాధితుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గుమిగూడి వైస్‌ చైర్మెన్‌ను నిలదీశారు.

ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో 60 మంది కార్మికులున్నారని చెప్పడం ఏమిటంటూ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్‌ వైస్‌ చైర్మెన్‌ను ప్రశ్నించారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేదనీ, కాంట్రాక్టు కార్మికుల జాబితా ఎందుకు లేదో చెప్పాలని అన్నారు. అదే విధంగా కంపెనీ రెస్క్యూ ఆపరేషన్‌ నత్తనడకన సాగుతుండటం వల్ల గల్లంతైన వారి ఆనవాళ్లు తెలియడం లేదు. దాంతో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు అడ్డుకున్నారు. మంత్రిని చుట్టు ముట్టి తమ వాళ్ల గురించి కనీస సమాచారం ఇచ్చేవాళ్లు లేరంటూ కన్నీరు పెట్టుకున్నారు.

మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నా తమ వాళ్లు బతికున్నారా..? చనిపోయారా..? ఏమయ్యారో..? చెప్పడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క జేసీబీతోనే శిథిలాలను తొలగించడం వల్ల మూడు రోజులైనా గల్లంతైన వారి ఆచూకీ లభించక వారి కోసం వచ్చిన వాళ్లు అక్కడే ఎదురు చూస్తున్నారు. ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబ సభ్యుల్ని మంత్రి ఓదార్చి, నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.


పొంతన లేని లెక్కలతో గందరగోళం
సిగాచి కెమికల్‌ కంపెనీలో ప్రమాదం జరిగిన రోజు జూన్‌ 30న ఎంత మంది డ్యూటీలో ఉన్నారన్న లెక్కల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మొదటి రోజు కంపెనీ వాళ్లు ఆ రోజు పని చేసిన కార్మికుల వివరాలను వెల్లడించారు. కంపెనీలో 162 మంది కార్మికులు, సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఆ రోజు మరణాల తీవ్రత ఇంతగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రెండో రోజు భారీ ఎత్తున మృతదేహాలను గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులు మాత్రం 143 మంది డ్యూటీలో ఉన్నారని ధ్రువీకరించారు. కంపెనీ చెప్పిన లెక్క ప్రకారం మరో 19 మంది ఏమైనట్టో ఎవ్వరూ చెప్పట్లేదు. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులు ఆ రోజు డ్యూటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

కంపెనీలో కాంట్రాక్టు కార్మికులు విధులకు రాగానే వారి సెల్‌ఫోన్స్‌ను తీసుకుని ప్రత్యేక లాకర్‌లో పెట్టి డ్యూటీ దిగగానే ఇస్తారు. ఆ సెల్‌ఫోన్స్‌ ఆధారంగా ఆ రోజున ఎంత మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేశారనే వివరాలు తెలుసుకోవచ్చు. కానీ.. వారి వివరాలేవీ చెప్పట్లేదు. బుధవారం పటాన్‌చెరు వచ్చిన కంపెనీ వైస్‌ చైర్మెన్‌ చిదంబర్‌ నాథన్‌ మాత్రం ప్రమాదం జరిగిన రోజున 60 మంది కార్మికులున్నట్టు మీడియాకు చెప్పారు. దాంతో కంపెనీ, అధికారులు చెబుతున్న లెక్కల్లో మరింత గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పటి వరకు ఎంత మంది సురక్షితంగా బయటపడ్డారు..? ఎంత మంది గాయపడ్డారు..? ఎంత మంది మరణించారు..? ఎంత మంది ఆచూకీ లభించలేదనే స్పష్టతను ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు.


కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌.. లభించని 11 మంది ఆచూకీ
రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆధ్వర్యంలో హైడ్రా, డిజాస్టర్‌, ఫైర్‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో శిథిలాలను తొలగిస్తున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షం పడటంతో సహాయక చర్యలు ఆపేశారు. బుధవారం కూడా వర్షం రావడమే కాకుండా శిథిలాల్లోంచి మళ్లీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, ఘాటైన రసాయన వాయువులు వెలువడటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. నష్టానికి సంబంధించి ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ కోసం శిథిలాల తొలగింపు నత్తనడకన సాగేలా కంపెనీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆచూకీ లేని 11 మంది ఆనవాళ్లు లభించాలంటే మొత్తం శిథిలాలను తొలగించాలి. మూడు రోజులు దాటినందున శిథిలాల్లో చిక్కినట్లైతే వాళ్లు బతికేందుకు అవకాశం తక్కువేనని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


కోటి నష్టపరిహారం ప్రకటించిన యాజమాన్యం
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇస్తామనీ, ఇప్పటి వరకు 40 మంది మృతి చెందగా 33 మంది గాయపడి చికిత్స పొందుతున్నారని సిగాచి కంపెనీ సెక్రె టరీ వివేక్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోటి రూపాయల ఆర్థిక సహాయంతో పాటు అన్ని రకాల బీమా క్లైయిమ్‌లు చెల్లిస్తామన్నారు. గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. 90 రోజుల వరకు ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నామని నేషనల్‌ స్టాక్‌ మార్కెట్‌కు తెలియజేశారు.


అధికారులతో టచ్‌లో ఉన్నాం: వైస్‌ చైర్మెన్‌ చిదంబర్‌ నాథన్‌
మూడో రోజు కంపెనీ వైస్‌ చైర్మెన్‌ చిదంబర్‌ నాథన్‌ పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి వద్దకు వచ్చి ప్రమాద బాధితుల్ని కలిశారు. దాంతో పెద్ద ఎత్తున బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకొని నిలదీయంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వైస్‌ చైర్మెన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగలేకనే రాలేదన్నారు. నిన్నటి సీఎం పర్యటనలో మేనేజ్‌మెంట్‌ వాళ్లు ఉన్నారని, సీఎం మాత్రం మా కంపెనీ వాళ్లు రాలేదా అని ఎందుకు అన్నారో మాకు తెలియదన్నారు. కలెక్టర్‌, ఎస్పీతో టచ్‌లోనే ఉన్నానని తెలిపారు. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులున్నారన్నారు. రియాక్టర్‌ పేలినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 30 ఏండ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు.


బాధితుల్ని పరామర్శించిన కాంగ్రెస్‌ నేతలు మీనాక్షి, మహేష్‌కుమార్‌ గౌడ్‌
సిగాచి ప్రమాదంలో క్షతగాత్రులైన బాధితుల్ని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. మొదట ధృవ ఆస్పత్రిలో ఉన్న గాయపడినవారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడి నుంచి కంపెనీ వద్దకు వచ్చి సహాయ చర్యల గురించి కలెక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు. అదే విధంగా మాజీ ఎంపీ హనుమంతరావు పరామర్శించారు. ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, నాయకులు గౌష్‌భాషా, రామకృష్ణ, నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మదీనగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, అతిమేల మాణిక్‌, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు పరామర్శించారు.


నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీ
సిగాచి కంపెనీలో జరిగిన భారీ పేలుళ్ల ప్రమాదానికి గల కారణాలేంటనేది నిగ్గుతేల్చేందుకు నలుగురు శాస్త్రవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. చైర్మెన్‌గా సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వర్‌, సభ్యులుగా శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.ప్రతాప్‌కుమార్‌, డాక్టర్‌ సూర్యనారాయణ, పూణెకు చెందిన భద్రతా అధికారి డాక్టర్‌ సంతోష్‌ ఘుగేను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎం.దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


18 మృతదేహల అప్పగింత.. గుర్తించాల్సినవి 20
కంపెనీలో 143 మంది ఉన్నారని కలెక్టర్‌ ప్రవీణ్య వివరాలను వెల్లడించారు. వీరిలో 60 మంది సురక్షితంగా ఉన్నారని, 35 మంది గాయాల పాలై చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరణించిన వారిలో ఇప్పటి వరకు రక్త నమూనాల ద్వారా 18 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పజెప్పారు. మరో 20 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. గల్లంతైన 11 మంది ఆచూకీ ఇంత వరకు లభించలేదు. వీరంతా శిథిలాల్లోనే ఉండొచ్చంటున్నారు. 36 మృతదేహాలకు సంబంధించి 18 గుర్తించగా మరో 18 డీఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు ప్రయోగశాలలో ఉన్నాయి. ఈ రోజు వెలికి తీసిన రెండు మృతదేహాల నమూనాలు సేకరించలేదు. 25 మంది బంధువుల రక్త నమూనాల్ని సేకరించగా మరో ఐదు కుటుంబాల వాళ్లు అందుబాటులోకి రాలేదు. 36 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. 18 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందజేశారు. గాయపడిన 34 మందికి రూ.50 వేల చొప్పున మంజూరు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -