Thursday, April 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినిర్మాణాత్మక చర్చలేవీ..!?

నిర్మాణాత్మక చర్చలేవీ..!?

- Advertisement -

చట్టసభలు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలి. ప్రజల కష్టాలను పరిష్కరించే చిరునామాగా నిలవాలి. కానీ, తాజా అసెంబ్లీ భేటి అందుకు భిన్నం. మూడు వాకౌట్‌లు, ఆరు సస్పెన్షన్లు అన్నట్టుగా ముగిసింది. మొత్తంగా 82 గంటలకుపైగా పనిచేసి పది బిల్లులను ఆమోదించింది. అందులో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక అంశాలు మినహా అన్నీ చోటుచేసుకున్నాయి. పద్దులపై చర్చలు చేయడంలో చిత్తశుద్ధి లోపించింది. ఇదో తంతు, దాన్ని తొందరగా ముగించాలనే ఆతృత ఇటు అధికారపక్షం, సర్కారును ఇరుకున పెట్టాలని అటు ప్రధానప్రతిపక్షం ప్రయత్నించింది. ఇరుపక్షాలు పట్టుదలకు పోయి విలువైన సభాసమయాన్ని వృధా చేశాయి. అసెంబ్లీలో నిర్మాణాత్మకమైన చర్చలు, శాస్త్రీయ విశ్లేషణల ద్వారా అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల ఆశలు కొంతైన నెరవేరతాయని ఆశిస్తే, నిరాశే మిగిలిందని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. ప్రజలకు భంగపాటే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమన్వయం, పట్టువిడుపులు ఇరువురి మధ్యలేక ఎప్పటిలాగే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా పరిస్థితి తయారైంది.

సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలను 45 రోజులు నిర్వహించాలి. కానీ, పది రోజులు నడిచాయి. గత పదేండ్లుగా పట్టుమని ఎన్నడూ పదిహేను రోజులకు మించి జరగలేదన్నది వాస్తవం. ప్రజాసమస్యలను చర్చించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వేరే ఎవరిదో కాదు అధికార, విపక్షాలదే. బడ్జెట్‌, అనంతర పరిణామాలు రాష్ట్రానికి మేలు చేస్తాయనే నమ్మకాన్ని కలిగించలేదు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. సర్కారీ నియామకాలు అంతంతే. ఉపాధి అవకాశాలు నిర్వీర్యమవుతున్నాయి. దారిచూపాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులేయడం లేదు. వీబీజీ రామ్‌జీ ద్వారా ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చిన ఘనత కేంద్రంలోని మోడీ సర్కారుదే. దానిపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యామ్నాయ అవకాశాలను సభలో చర్చించి నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు అంతంతే కావడం గమనార్హం.

ఇటీవల క్రిస్టియన్‌ మతమార్పిడిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయమై దేశవ్యాప్తంగా సంబంధిత తరగతుల్లో ఆందోళన నెలకొంది. దానిపై చర్చే లేదు. అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం తడిచి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని గాలి కొదిలేశారు. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ చూపలేదు. అధికార, ప్రతి పక్షమేగాక ప్రజాపక్షం గురించి మాట్లాడాలన్న ధ్యాసే లేదు. అంగన్వాడీలు, ఆశాల డిమాండ్లు, విద్యాసంస్థల్లో కాంటాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు ఏవీ చర్చించలేదు. ఎంతసేపూ రాజకీయ అరోపణలు, విమర్శలతో కాలం గడుపుతూ రెచ్చగొట్టే ధోరణి తప్ప ప్రజానుకూల నిర్ణయాలవైపు అడుగులేవి? హైడ్రా మూలంగా మధ్యతరగతి ప్రజలు ఇండ్లు, ప్లాట్లు, ఇతరాలు కోల్పోయారు.

ఆ సమస్యపైనా మాట్లాడే పరిస్థితులే లేవు. వెలుగుమట్లలో కూల్చివేతలపైనా సభలో వివరణ ఇవ్వలేదు, బాధితులకు న్యాయం చేసే విషయంలో సర్కారుతో పాటు ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదా? లేబర్‌కోడ్‌లపౖౖె సభలో తీర్మానం చేసి కనీస వేతనాలపై కేంద్రాన్ని నిలదీయకుండా విమర్శలు, ప్రతి విమర్శలతో కాలాన్ని వృధా చేశారు. ప్రజాసమస్యలపై ప్రజాసంఘాల గొంతు వినపడకుండా పోలీసుల బలప్రయోగం ద్వారా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్‌, ప్యూర్‌, క్యూర్‌ పేర లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అది సమావేశాల నిర్వహణలో కనిపించలేదు. అక్రమ మైనింగ్‌, భూ కబ్జాల చుట్టూ అసెంబ్లీ, మండలిని తిప్పి ప్రజా సమస్యలను పెడచెవిన పెట్టింది.

ప్రజాపాలన మహాగొప్పగా ఉందంటూ డప్పుకొట్టుకుంటున్న కాంగ్రెస్‌ సర్కారుకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక కిలేరిగి వాతపెట్టింది. బడ్జెట్‌లో కేటాయింపులు, చేస్తున్న ఖర్చుకు భారీ తేడాలు ఉంటున్నాయ‌ని గొంతెత్తింది. మూడు రకాల నివేదికల ద్వారా పరిపాలన డొల్లతనాన్ని బయటపెట్టింది. అప్పులతో ఆర్థిక క్రమశిక్షణ మందగించిందనీ, ఆర్‌బీఐ చేబదుళ్లతో కాలంగడుపుతూ తిరిగి చెల్లించలేని పరిస్థితికొచ్చిందని స్పష్టం చేసింది. ఏకంగా ప్రభుత్వ ప్రణాళికలలే సరిగ్గాలేవని చెప్పడాన్ని కాంగ్రెస్‌ సర్కారు గమనించాలి.కేరళం అసెంబ్లీ ఎన్నికల కోసం సమావేశాలను వేగంగా ముగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ అనేది వైరుధ్యాలకు వేదికగా నిలవకూడదు, ఆది కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండాలి. చర్చలు అర్థవంతంగా, క్రమశిక్షణతో సాగినప్పుడే శాసనసభకు సార్థకత. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలన్నది జనవాక్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -