భారతదేశమే కాదు, చుట్టుపక్కల దేశాలన్నీ బౌద్ధదేశాలుగా వర్ధిల్లుతున్న సమయంలో అన్ని విషయాల్ని కాపీకొడుతూ వైదిక మతస్తులు తమ దేవీదేవతలను తయారు చేసుకున్నారు. పురాణాలు రాసుకున్నారు. పైగా, బుద్ధుడిని తమ అవతారాలలో ఒకడిగా ప్రకటించుకున్నారు. అయితే, ఆ పురాణాలలో ఏముంది? లక్షల ఏండ్ల క్రితమే పురాణ పాత్రలు బాణాలు, బల్లేలు, శూలాలు, ఈటెలు, చక్రాలు, గొడ్డళ్లు వాడారని ఒక అబద్దాన్ని జంకూ, బొంకూ లేకుండా రాసేసుకున్నారు. అలాగే తమ కల్పిత దేవీ దేవతలకు బంగారు ఆభరణాలు ఉన్నట్టు కలలుగన్నారు. లోహాలు ఎప్పటినుండి వాడుకలోకి వచ్చాయన్న విషయం తెలుసుకోకుండానే, ఆ నాటి రచయితలు, కవులూ వాటిని రాసేశారన్నమాట! వారి సృజనాత్మకతనంతా జోడించారన్నమాట!! ఆ దేవుళ్లు, ఆ పురాణాలు నిజమని నమ్మేవారు వాటికి విస్తృత ప్రచారం చేశారు. జనం కూడా వాటికి అలవాటు పడ్డారు. ఎవరైనా నిజం చెప్పినా – ‘అదంతా అబద్ధం’ అని తమ విశ్వాసాల్లో తాము నిక్షేపంగా బతికేయగలుగుతున్నారు.
అసలు ఈ ప్రపంచంలో లోహాలు ఎప్పుడు ఎలా కనుగొనబడ్డాయో చూద్దాం – లోహ యుగం సాధారణ శకానికి ముందు 4500లో ప్రారంభమైంది. రాగి, కంచు, ఇనుము వంటి లోహాలు వాడకంలోకి వచ్చాయి. అది కూడా వివిధ ప్రాంతాలలో, వేరు వేరు సమయాలలో వాడకంలోకి వచ్చాయి. లోహ యుగాన్ని మళ్లీ మూడు భాగాలుగా విభజించుకోవచ్చు-
- రాగి యుగం 2. కంచు యుగం 3. ఇనుము యుగం
రాగియుగం సాధారణశకానికి ముందు 4500-3500 మధ్య ప్రారంభమైంది. మధ్య ప్రాచ్యం భారత ఉపఖండం, ఐరోపా (యూరప్)లలో రాగి వస్తువులు ఉపయోగంలోకి వచ్చాయి. కంచుయుగం సా.శ.ముందు 3300 – 1200 మధ్యకాలంలో ప్రారంభమైంది. మొసపొటేమియా, ఈజిప్టు, భారతదేశం, చైనాలలో కంచువాడకం ప్రారంభమైంది. భారత దేశంలోని హరప్పా నాగరికత ఈ విషయం ధృవపరుస్తుంది. ఇదే సమయంలో చైనాలో రాగి, తగరంల మిశ్రమం వాడకానికి వచ్చింది. ఇక ఇనుము యుగం సా.శ. ముందు 1200 నుండి మిడిల్ ఈస్ట్‌లో ఇనుప సామానులు, ఇతర ఉపకరణాలు, ఆయుధాలు వగైరా తయారయ్యాయి. అక్కడి నుండి క్రమంగా ఇనుము వాడకం ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
భారతదేశానికి వస్తే, ఇక్కడ రాగి వాడకం సా.శ. ముందు 4000 నుండి – ఆ తర్వాత కంచు వాడకం సుమారు 2600 నుండి అంటే హరప్పా నాగరికతతో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అలాగే ఇనుము వాడకం సా.శ.ముందు 1000 నుండి ప్రారంభమైనట్టు ఆధారాలు దొరికాయి. ఒక్కొక్క అధ్యయనం కొన్నికొన్ని సంవత్సరాల తేడాతో వివరాలు ఇవ్వొచ్చు గాక- కానీ, స్ఫూలంగా విజ్ఞాన శాస్త్రం చెప్పే విషయం ఇది. జీవ పరిణామ దశాల్లో మనిషి లక్షల ఏండ్లు గడుపుతూ వచ్చినా, అతని జీవితం లోహాల వాడకం లేకుండానే గడిచిపోయింది. లోహాల వాడకంలో క్రమంగా పురోగమనం సాధించి, పనిముట్లు, పరికరాలు, వస్తువులు, మనిషి తయారుచేసుకుంటూ వచ్చాడు. ఒక రకంగా ఈ లోహాల సమాచారం – దేవుడి సృష్టి ఎప్పుడు జరిగిందీ? కనపడని ఆ దేవుడి తలలు వర్ణిస్తూ, భక్తకవులు పురాణాలు ఎప్పుడు రాసుకున్నారూ? అనే విషయం విషదమౌతోంది కదా?
లోహాలు వాడుకలోకి రాకముందే, వైదిక దేవీదేవతలు పెద్ద పెద్ద బంగారు కిరీటాలు, బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు ఎలా ధరించారూ? అవన్నీ కల్పితాలే కదా? వైజ్ఞానిక దృష్టికోణంలో నుంచి ఆలోచిస్తే – వైదిక రచయితల కల్పనలన్నీ వారి వారి భ్రమలేనని.. తెలిసిపోతుంది! వాటికి ఏ విధమైన వాస్తవ నిరూపణలూ, ఆధారాలు లేవన్నది గ్రహించాలి. వైదిక గ్రంథాలలోనే కాదు, ఇంకా ఏ ఇతర మత గ్రంథాలలో ఉన్నా అది అబద్దమే అవుతుంది. అందుకే చెప్పేది- కల్పిత కథల్ని, గాథల్ని కల్పితాలుగానే చూడాలి! పురాణాలు ఎప్పటికీ చారిత్రక గ్రంథాలు కావు. పురాణ పురుషులు చారిత్రక పురుషులు కాలేరు. ఆ తేడాను అందరూ అర్థం చేసుకోవాలి! చరిత్ర అంటే ఏమిటో కూడా తెలియని కాలంలో ఆ ‘పవిత్ర’ పురాణాలు రాయబడ్డాయని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఒక పాల సముద్రం దాంట్లో డన్‌లప్ పరుపులాగా తేలుతూ ఉండే ఒక పెద్ద నాగుపాము – ఆదిశేషు – దాని మీద విష్ణుమూర్తి పడుకుని ఉండడం.
ఆయన భార్య లక్ష్మీదేవి ఆయనకు కాళ్లునొకుతూ ఉండడం- ఇదంతా ఊహ, కల్పన కాకుండా వాస్తవమయ్యే అవకాశముందా? లేదు కదా? అసలు ఈ ప్రపంచంలో పాల సముద్రం ఎక్కడ ఉంది? దానిలో అంత పెద్ద పాము ఎలా తేలుతూ ఉంది? అది ఇద్దరిని మోస్తూ, పడగా విప్పి ఉంటుందా? అదంతా కల్పన అని ఒప్పుకుంటే ఏ గొడవా ఉండదు. కానీ అదంతా నిజం అని దబాయించే బడుద్దాయులు న్నారు కదా?” మీ వివేచనా ఏ పాటిదీ?”-అని ప్రశ్నించిన వారిని పాపం – పుణ్యం- పవిత్రత వంటి మాటలు చెప్తూ భయపెడతారా? మంచి పనులు, చెడు పనులు ఉంటాయి. శుభ్రం, అశుభ్రం ఉంటాయి అంతే! పుణ్యం- పవిత్రత వంటి పదాలకు అర్థమే లేదు. జనాన్ని భయపెట్టడానికి మనువాదులు సృష్టించిన పదాలు కావా? ఇదంతా అత్మ పరమాత్మల గురించి చెప్పి మూఢభక్తుల్ని తయారుచేసే ముడిసరుకు కాదా?
అసలు ‘సనాతన’ – అనే పదమే దొంగిలించింది కదా? ‘ఏ స ధమ్మో సనాతనో’ – అనేది బౌద్ధుల పద్య భాగంలోని చివరి చరణం హింసను అహింసతోనూ, దుర్మార్గాన్ని సన్మార్గంతోనూ ఎదుర్కోవాలి- అదే సనాతన ధర్మం – అని బౌద్ధం చెపుతుంది. దానికి అర్థం మార్చి ప్రచారం చేసుకుంటున్నారు. మాది అనాది కాలం నుండి ఉన్న ధర్మం అని చెప్పుకుంటున్నారు. అలాగే ‘ఓం’ – అనేది కూడా వీరు బౌద్ధం నుండి తస్కరించిందే! వైదిక మతం కన్నా ముందే విశ్వవ్యాప్తమైన బౌద్ధంలోని అంశాలు కాపీ కొట్టి అవన్నీ తమవిగా గొప్పలు చెప్పుకుంటున్నారు. మాది సనాతం మాది సనాతనం” అని ఆవేశపడుతూ ప్రతి పనికిరాని వాడూ రొమ్ము విరుచుకోవడం ఎందుకూ? కొంచెం మూలాలు తెలుసుకోండిరా బాబూ – మేం ఎదగం ఈ దేశాన్ని ఎదగనివ్వమన్నట్లుగా ఉంది కదా వీరి వాలకం? సామాన్యులు ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుని.. అర్థం చేసుకుని, మసులుకుంటూ ఉండాలి!
బంగారం, వెండి, ఇనుము, రత్నాలు, వజ్రాలు వంటివి ఉనికిలో ఉన్నాయని తెలుసుకున్నాకే, మనిషి తను కల్పించుకున్న దేవీదేవతల్ని ఊహించుకున్నాడు. వారికి రత్నఖచిత సింహాసనాల్ని కూడా ఊహించుకున్నాడు. అంటే మనం చూస్తున్న దేవీదేవతల రూపురేఖలు- ఆభరణాలు, ఆయుధాలు, పట్టువస్త్రాలు వంటి వన్నీ మనిషి తన నిజజీవితంలో సాధించుకున్నాకే-వాటిని తమ దేవీదేవతలకు ఆపాదించుకున్నాడని సులభంగా తెలిసిపోతుంది కదా? అంతేకాదు, ఆ దేవ దేవతల్ని వర్ణిస్తూ, వారి మహిమల్ని కీర్తిస్తూ రాసుకున్నా పురాణ రచనలన్నీ ఆ తర్వాత వచ్చినవే అని కూడా స్పష్టమౌతోంది కదా? ఉదాహరణకు మైక్రోస్కోప్టులో కనిపించే జీవకణనిర్మాణం గానీ, అంతరిక్ష ప్రయోగాల గురించి గానీ – పవిత్ర మతగ్రంథాలలో ” ఎందుకు లేవూ? అంటే- అవి రాయబడ్డ కాలానికి ఈ పరిజ్ఞానం అందుబాటులో లేదు. ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఆయా విషయాలన్నీ అందులో పొందుపరుచుకోవచ్చు-
మానవుడు నాగరీకుడు అవుతూవున్న కొద్దీ, ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నకొద్దీ వాటిని అతను తన రచనల్లో, శిల్పాల్లో, చిత్రాల్లో, కీర్తనల్లో భజనల్లో జప్పిస్తూ వచ్చాడు. ఇవన్నీ కాలక్రమంలో వచ్చాయని ఒప్పుకోవడమన్నది బుద్ధిమంతుల లక్షణం. అంతేగాని, సృష్టి మొదలైనప్పుడే మా దేవుడు మాకు పవిత్ర గ్రంథాలు ఇచ్చి వెళ్లాడు అని చెప్పుకోవడం మూర్ఖత్వమవుతుంది. ఎందుకంటే, మనిషి ముందు సైగలతో తనను తాను వ్యక్తీకరించుకున్నాడు. చిన్న చిన్న అరుపులూ, కేకలతో కొంత కాలం కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత, క్రమ క్రమంగా భాషను రూపొందిం చుకున్నాడు. భాష ఏర్పడిన తరువాతనే కదా ఏ రచన అయినా వెలుగు చూస్తుందీ? మనిషి అనాగరికంగా ఏ భాషా లేని రోజులు గడుపుతున్నప్పుడు.. ఏ దేవుడో వచ్చి పవిత్ర గ్రంథాలు ఇచ్చి వెళతాడా? ఇచ్చి వెళ్లినా ఆ గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయీ ? సరే, ఆయన ఇచ్చి వెళితే మాత్రం ఇక్కడ వీడు ఎట్లా చదవగలిగాడు? విషయం అబద్ధాల మీద అబద్దాలు పేర్చినట్టుగా లేదూ?
అందుకే మనం, అబద్ధాల దొంతరను పడగొడుతూ, నిజాల్ని మాత్రమే నిలుపుకోవాలి! ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. మొదట శిల్పకళను అభివృద్ధి చేసింది బౌద్ధులు. కొన్ని వైజ్ఞానిక విషయాలు చెప్పింది వారే. అయితే, వారు ఎన్ని మంచి విషయాలు చెప్పినా, వారిదైన ఒక సంస్కృతిని వారు అభివృద్ధి చేయలేకపోయారు ఇక వైదిక మతంలో నిజానికి మతం లేదు. వక్రీకరించి, అభివృద్ధి చేసి, ప్రచారం చేసుకున్న సంస్కృతి మాత్రమే ఉంది. అందుకే జీవితంలోని అన్ని విశ్వాసాల్లోని, అన్ని ఆచార వ్యవహారాల్లోకి వారు వారి భావజాలాన్ని జొప్పిం చారు. అలాగే కళల్ని కూడా వారి స్వంతం చేసుకున్నారు. కవుల్ని, గాయకుల్ని, నాట్ల కారుల్ని అందరినీ ప్రభావితం చేశారు. యశస్సూ, ధనమూ చేకూరుతూ ఉంది కదా అని వారంతా మనువాదానికి బానిసలై పోయారు.
కవుల, కళాకారుల ప్రతిభ మీద నాకు గొప్పగౌరవముంది. కానీ, వారంతా మనువాద భావజాలంలో కొట్టుకుపోయారే అని బాధపడు తుంటాను. ఒకరంటే ఒక్కరు మనిషి కేంద్రంగా తమ కళారూపాల్ని సృష్టించలేదు. లేని దేవుడి కీర్తనలు పాడుతూ, ఆయన అభినయాలు చేస్తూ, నాటకాలు వేస్తూ, సినిమాలు తీస్తూ వైదిక మతం ప్రచారం చేసిన- దేవ దేవతలను బతికిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆ పని కొనసాగు తూనే ఉంది. అలా పాడితేనే, అలాంటివి ప్రదర్శిస్తేనే ఉత్తమ అభిరుచి ఉన్నట్లు – అనే భావన సమాజంలో స్థిర పరిచారు. ఇక, మరో రకంగా ఆలోచించే అవకాశమే ఎవరికీ లేకపోయింది!
ఒకరకంగా సంప్రదాయం పేరుతో శతాబ్దాలుగా కళలన్నీ భ్రష్టుపట్టిపోయాయి. ఈ జాడ్యం మన భారతీయ భాషల్లో ఎక్కువగా ఉంది. అదే ఉరుదూ, ఫారసీ భాషల్లో ఇది లేదు. అక్కడి కవులు జీవితం గూర్చి, ప్రేమ, విరహం, ఈతి బాధల గూర్చి కవితలల్లారు. అల్లా గురించి, ఖుదా గురించీ లేదా? అని అంటే – అది మత గ్రంథాలకూ వారి ప్రార్థనా స్థలాలకూ మాత్రమే పరిమితమౌతుంది. బయట సామాజిక జీవితంలో పెద్దగా కనపడదు. మరి మనకూ? ఇక్కడా అక్కడా అని లేదు – ప్రతి చోటా ఏదో రూపంలో దేవుడు ఉంటూనే ఉన్నాడు. ఆ తేడాను గమనిస్తే గాని, విషయం బోధపడదు! ”మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలని” ఒక కేసులో జెస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్నిలు చెప్పారు. ”వరదల్లో కొట్టుకుపోయిన వారు నేరుగా స్వర్గానికి పోతారు” అని అన్నాడు సంజయ్ నిషాద్, ఉత్తరప్రదేశ్ మంత్రి. అన్నిట్లో మనువాదం సప్రదాయబద్దంగా ఎలా జీర్ణమైపోయిందో చూస్తున్నాం కదా? ఇక అందులోంచి బయటపడాల్సి ఉంది.
-సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్
డాక్టర్ దేవరాజు మహారాజు



