Friday, October 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎటు పోతున్నాం…

ఎటు పోతున్నాం…

- Advertisement -

భార్యను చంపిన భర్త.. తల్లిని చంపిన కొడుకు.. భర్తను బండరాయితో మోది హతమార్చిన భార్య…ఇటీవల కాలంలో పత్రికల్లో ఇలాంటి శీర్షికన ఎక్కువగా వస్తున్న వార్తలను చూస్తే భయమేస్తోంది. అంతకుమించి మన సమాజం ఎటువైపు పోతోందోననే ఆందోళన కలుగుతోంది. కుటుంబ బంధాలు.. మానవ సంబంధాలు.. మంటగలిసి పోతున్నాయంటూ మానసికవేత్తలు సైతం కలత చెందుతున్నారు. మన ఆందోళనలు, వారి కలతలకు ఊతమిచ్చే విధంగా ఇటీవల కుమురం భీమ్‌-ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన కొడుకు వేరే సామాజిక వర్గాని(ఎస్టీ)కి చెందిన యువతిని వివాహం చేసుకోవటం జీర్ణించుకోలేని ఓ తండ్రి(బీసీ)… కుమారుడు లేని సమయం చూసి నిండు గర్భిణీ అని కూడా చూడ కుండా తన కోడల్ని కడతేర్చాడు. అభం శుభం తెలియని కడుపులో బిడ్డ కూడా ఈ ఘోరానికి బలైపోయింది.

ఈ కుల దురహంకార హత్యను యావత్‌ తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. ప్రజా సంఘాల ఆందోళనల ఫలితంగా హత్యకు పాల్పడిన మామను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడితో కథ ముగిసినట్టు భావిస్తోన్న ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అంతటితో చేతులు దులుపుకున్నాయి. కానీ వాస్తవంలో ఏం జరుగుతోందనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఓ పదేండ్ల నుంచి కుల దురహంకార హత్యల పరంపర కొనసాగుతోంది. తమ పిల్లలు వేరే మతం వాడినో, కులం వాడినో పెండ్లాడారనే ఉద్దేశంతో కన్నవారు కనికరం లేకుండా హత్యలు, అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అయినా కులాంతర, మతాంతర వివాహితులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తేవాలనే డిమాండ్‌ పాలకుల చెవికెక్కటం లేదు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదకొండేండ్ల కాలంలో సనాతన సంప్రదాయాలు, మతాచారాలు, వ్యవహారాల పేరిట దాని ‘కాషాయ పరివారం’ వాట్సాప్‌ యూనివర్సిటీల్లో వండి వడ్డిస్తోన్న ‘విద్వేషపు కంటెంట్‌’ ప్రజల మెదళ్లను విషతుల్యం చేస్తోంది. చాతుర్వర్ణ వ్యవస్థను పెంచి పోషించే విధంగా, ప్రోత్సహించే విధంగా దాని భావజాల వ్యాప్తి కొనసాగటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. శతాబ్దాల తరబడి మన సమాజంలో వేళ్లూనుకున్న ఫ్యూడల్‌ భావజాలానికి ఇది మరింత ఆజ్యం పోస్తోంది. అయితే తన చేతికి ఎక్కడా మట్టి అంటకుండా ‘సంఘ పరివారం’ సమాజంలో పేరెన్నికగన్న వ్యక్తులు, మేధావుల రూపంలో ‘తనదైన’ కంటెంట్‌ను సమాజం మీదికి వదులుతోంది. అందులోని మర్మం తెలియని అమాయక జనాలు…తమకు ఎదురవుతున్న సంఘటనల్లో వాటిని అమలు చేసి చూపుతుండటం విషాదకరం. ఇలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాల్సిన కేంద్రం, అక్కడి మంత్రులు… దాన్ని మరింత పెంచే విధంగా సమర్థిస్తూ ఉండటం బాధ్యతారాహిత్యం.

ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దోషులే. సమాజానికి హాని కలిగించే కంటెంట్‌ పట్ల ప్రజలను చైతన్య పరచటం, అప్రమత్తంగా ఉండాలని సూచించకుండా నిమ్మకునీరెత్తినట్టు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ కుల దురహంకార హత్య జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ అయినా, నేటి కాంగ్రెస్‌ అయినా ఇదే దుస్థితి. ఇలా మూలాల్లోకి వెళ్లి చూస్తేనే అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది జరగాలంటే పాఠశాల స్థాయి నుంచే రేపటిపౌరులకు సమాజ పరివర్తనా క్రమంపైనా, దాని పురోగతిపైనా అవగాహన కల్పించాలి.

కుల ఛాందసం, మత విద్వేష బీజాలు ఎక్కడ పెచ్చరిల్లినా కూకటివేళ్లతో వాటిని పెకిలించాలి. ఇందుకోసం పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించాలి. పౌరసమాజం, మేధా వులు, అభ్యుదయ వాదులు, ప్రగతిశీల శక్తులు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించాలి. ‘ఏ ఉన్మాదమైనా మొదట మనిషిని చెవిటివాడిగా చేస్తుంది, ఆ తర్వాత అతడి కళ్లను పీకేస్తుంది, ఆ తర్వాత మెదడును మొద్దుబారుస్తుంది. చివరకు అది నరబలిని కోరుతుంది…’ అని ఓ మేధావి చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో ఆ ప్రమాదకర కంటెంట్‌ మన మెదళ్లను మొద్దుబార్చే పనిలో ఉంది. దీన్ని తిప్పికొట్టి, చైతన్యపు భావాలతో మన మెదళ్లను నింపుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -