‘క్రీడ అంటే స్నేహం.. క్రీడంటే ఆరోగ్యం.. క్రీడ అంటే విద్య.. క్రీడే జీవితం.. క్రీడలు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తాయి’… అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాజీ అధ్యక్షుడు జువాన్ ఆంటోనియో సమరాంచ్ పైన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ భువిపై నివసించే మానవులందరికీ ఇవి వర్తిస్తాయి. ‘జీవితంలో ముఖ్యమైన విషయం విజయం కాదు పోరాటం. క్రీడల్లోనూ అంతే. గెలవడం కాదు, పాల్గొనడం’ అంటారు ఆధునిక ఒలింపిక్ ఉద్యమ స్థాపకులు పియరీ డి కూబెర్టిన్. ‘జీవించడంలో ఉన్న గొప్ప మహిమ ఎప్పుడూ పడకపోవడంలో కాదు, పడిపోయిన ప్రతిసారీ లేవడంలోనే ఉంది’ అంటారు నెల్సన్ మండేలా. ఇది కూడా క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తుంది.
ఆటలాడటం అనేది మనుషులకు జన్మతః లభించే సహజ లక్షణం. పుట్టిన శిశువు వయసు పెరిగే కొలదీ ఆట పాటల వైపు ఎక్కువ మక్కువ చూపుతారు. నడక ప్రారంభమైన నాటి నుంచి తన అందుబాటులో ఉండే వస్తువులతో లేదా అదే వయసు గల పిల్లలతో ఆటలు ఆడటానికి ఉత్సహం కలిగి ఉంటారు. తన చుట్టూ పిల్లలు ఉండి వారితో ఆట పాటల్లో పాల్గొన్న పిల్లలలో సామాజిక నైపుణ్యాలు వద్ధి చెందుతాయి. బృందంతో కలసి ఆడుకోవడం,బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి.
వ్యక్తుల మధ్య బృందాల మధ్య దేశాల మధ్య స్నేహ సౌబ్రాతత్వాల వృద్ధి అనేది క్రీడలు ద్వారానే సాధ్యం. ఏ దేశంలో అయితే ఆరోగ్యవంతమైన సామర్థ్యం కలిగిన జనాభా ఉంటారో ఆ దేశం సర్వతోముఖాభివద్ది చెందుతుంది. ఆరోగ్యం అనేది క్రీడలు వ్యాయామం ద్వారానే పరిపూర్ణం అవుతుంది. విద్యలో పరిపక్వత సాధించాలి అంటే మానసిక పరిపక్వత కావాలి. క్రీడల ద్వారానే అది మెరుగవుతుంది. దేశం దష్ట్యా వ్యక్తి దష్ట్యా చూసిన క్రీడల ప్రభావం జీవితంపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా కనపడుతుంది. అందుకే క్రీడే జీవితం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు.
క్రీడలు.. జీవనతత్వాన్ని కూడా బోధిస్తాయి.. దీన్ని గ్రహించినవారు ఎట్టి పరిస్ధితులలో ఓటమికి కుంగిపోరు.. గెలుపుకి పొంగిపోరు! అసలు గెలుపోటములనేవే లేవని.. ఎదురొడ్డి పోరాడడమే ముఖ్యమని విశ్వసిస్తారు! ఆటల స్ఫూర్తిని బతుకు పోరుకు అన్వయించుకుని ఇటు జీవితంలో కానీ.. అటు మైదానంలో కానీ నిలబడతారు. పాల్గొన్న అన్ని ఆటలలో గెలవడం ఆనందకరమే కానీ, ఓటమి నుంచి నేర్చుకోవడం అంతకంటే అవసరం. ఆ స్ఫూర్తి ఆటల ద్వారానే అలవడుతుందన్నది వాస్తవం. క్రీడా స్ఫూర్తి కలిగిన వారు ఎవరైనా సరే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా ధీటుగా ఎదుర్కోగలుగుతారు. గెలుస్తామా లేదా అనేది ఆలోచించకుండా పోరాటమే లక్ష్యంగా పాల్గొంటారు. అందుకే ప్రాచీన భారతదేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే వారు. మార్షల్ ఆర్ట్స్, విలువిద్య, కత్తిసాము, బరువులు ఎత్తడం మొదలైనవి చేయించేవారు. కానీ రాను రాను ఈ క్రీడా సంస్కతి దేశంలో మాయమైపోతుంది.
క్రీడల వలన లాభాలు
ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడంలోనూ, బుద్ధి వికాసం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి.
సానుకూల దృక్పథం: క్రీడలు సానుకూల దక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది.
మానసిక ఆరోగ్యం: క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిపుణులు తేల్చి చెప్పారు. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి.
నాయకత్వ లక్షణాలు వృద్ధి: క్రీడాకారులు ఒక బృందంగా కలసి ఆడటం వలన వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగవతాయి.
ఊబకాయాన్ని తరిమేయవచ్చు: ఈ రోజు పది మంది పిల్లల్ని పరిశీలిస్తే వారిలో ఒకరో ఇద్దరో ఊబ కాయులు మనకు కనిపిస్తున్నారు. అయితే తరచూ క్రీడలు ఆడటం వల్ల ఈ స్థూలకాయం రాదు.. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
గ్రుండెకు భరోసా: క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. క్రీడల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. క్రీడాకారుల్లో గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు.
అదుపులో రక్తపోటు: ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మెరుగైన రోగనిరోధక శక్తి: క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.
ఒత్తిడిని తరిమేస్తాయి: క్రీడలు ఆడని వారితో పోల్చి చూస్తే క్రీడలు ఆడే వారే సదా ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం అధికంగా ఉంటుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
హార్మోన్ల విడుదలకు సహకరిస్తాయి: మెదడు సహజమైన ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనాలు లేదా హార్మోన్లు క్రీడలు ఆడే వారికి చాలా ఎక్కువగా విడుదల అవుతాయి. ఫలితంగా వారు సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తారు.్డమెరుగైన సమకాలీన సమాజంలో పనులు, ఆలోచనలు యాంత్రీకరణ, రెడీమేడ్ అయిపోయాయి. దాంతో ఆలోచనాశక్తి, శారీరక శ్రమ కుంటుపడ్డాయి. దాంతో మనిషి భావి జీవితం ప్రమాదంలో పడుతోందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా తల్లిదండ్రులు శారీరక శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మానేశారు. పిల్లల విద్యా నైపుణ్యం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు. పిల్లలు మార్కులు ప్రాతిపదికన చదువే పరమావిధిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలల్లో పచ్చటి మైదానాలు లేకపోయినా పరవాలేదు నిరంతరం అభ్యసనం ఉంటే చాలు అనే నిర్ణయానికి తల్లి తండ్రులు వచ్చేసారు.
కేవలం తరగతి గదులు ఉంటే అది పాఠశాల అనిపించుకోదు. సువిశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పుడే అది పాఠశాల అవుతుంది. ఈ నిబంధన నేటి తరం పాఠశాలలకు వర్తించదు. ఎందుకంటే నేడు పట్టణాల్లో కానీ నగరాలలో కానీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్ధలలో అధిక భాగం బహుళ అంతస్తుల భవనాల్లో, గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో విద్యనభ్యసించే విద్యార్థులే అధికులు. పాఠశాల లేదా కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలంటే కచ్చితంగా మైదానం ఉండి తీరాలి. కానీ వాస్తవంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితం. క్రీడలను ప్రోత్సహించడమే మా ధ్యేయం అని చెప్పుకొనే ప్రభుత్వాలు క్రీడా సౌకర్యాలు చూపని విద్యా సంస్ధలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. పైగా వ్యాయామ ఉపాధ్యాయలు పోస్టులు భర్తీ చేయడం ప్రభుత్వ ఖజానాకు భారంగా నేటి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కనీస క్రీడాసౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదనే చెప్పవచ్చు.
దీని కారణంగా బాల్యంలో ఊబకాయంతో బాధపడేవారు మనకు తరచూ కనిపిస్తున్నారు. ఊబకాయంతో పాటు రోగ నిరోధక శక్తి క్షీణించి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఆటలు పాటలు వద్దు మా పిల్లలకు చదువే ముద్దు అంటూ పిల్లల బాల్యాన్ని నిలువునా చిదిమేస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. నేడు క్రీడలు ఆడే వారి కన్నా చూడటానికి ఇష్టపడే వారు ఎక్కువై పోయారు. ప్రధానంగా నేటి తరం పిల్లలు ఎక్కువుగా ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.
నిత్యం ఏదో ఒక వాహనంలో బడికి బయలుదేరడం, సాయంకాలం మళ్లీ వాహనంలోనే ఇంటికి రావడం.. వచ్చీరాగానే టీవీ, కంప్యూటర్, ఫోన్ ఆటలతో బిజీ.. ఇదీ నేటి పిల్లల దైనందిన జీవితం. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అయిదు వందల మిలియన్ల కొత్త దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే పిల్లలకు శారీరక శ్రమ కలిగేలా ఆడించాలని చెబుతున్నారు నిపుణులు. నిత్యం అలుపెరిగేలా ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా పెరుగుతారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో 12-15 ఏండ్ల పిల్లలకు కూడా డయాబెటీస్ రావడం ఆందోళన కలిగించే అంశం. ఇంతకు ముందు 50-60 ఏండ్ల వారికి గుండె జబ్బులు వచ్చేవి.. కానీ, ఇప్పుడు 35-40 ఏండ్లకే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం శారీరక వ్యాయామం లేకపోవడమే.
భారత్ కృషి
వ్యాయామ విద్య ప్రాధాన్యతను మన దేశంలో స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ళలోనే గుర్తించారు. దాని ద్వారానే భావితరాన్ని బలోపేతం చేయాలని 1948లో డాక్టర్ తారాచంద్ కమిటీ సూచన కూడా చేసింది. ఆ తరువాత కాలంలో కుంజ్రు, సీడీ దేశముఖ్ సంఘాలూ క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. ఇలా దశబ్దాల తరబడి ఎన్నో ఆదర్శ సూచనలు చేస్తూ రావడం జరుగుతూ ఉంది. తాజాగా 2005 జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం, ఆ తరవాతి విద్యాహక్కు చట్టమూ ఆటపాటలతో కూడిన చదువులకే మద్దతు పలికాయి. అయినప్పటికీ ఆ సూచనలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే ఈ రోజుకు కూడా దేశవ్యాప్తంగా సుమారు నలభైమూడు శాతం సర్కారీ బడుల్లో ఆటస్థలాలే లేవని పార్లమెంటరీ స్థాయి సంఘం రెండేండ్ల కిందట తేటతెల్లం చేసింది.
ఉమ్మడి జాబితా
క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోడం భారత క్రీడారంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అది చాలదన్నట్లు ఏడాది నుంచి ఎనిమిదేండ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడాదిగ్గజాలు అంటున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రీడా సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో 2012, ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది.
జాతీయ క్రీడా దినోత్సవం
భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినోత్సవంగా 2012 నుండి ఏటా ప్రభుత్వం జరుపుతూ వస్తోంది. ధ్యాన్‌చంద్ ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. మధ్య ప్రదేశ్‌లోని ధ్యాన్‌చంద్‌నగరంలో పెరిగారు. ఆయనకు చిన్న తనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. ప్రపంచ హాకీలో ‘ది విజార్డ్’, ‘మెజిషియన్’గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు.
1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కింది. ఆయన నేతత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. 1936లో లాస్ ఎంజిల్స్‌లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి భారత్‌ను గెలిపించారు. ధ్యాన్‌చంద్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1948లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కేరీర్‌లో 400కు పైగా గోల్స్‌ను నమోదు చేసాడు.
ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు. క్రికెట్‌కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్‌చంద్‌ను అభివర్ణిస్తుంటారు. మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్‌చంద్ ప్రత్యేకత. తన ఫుట్ వర్క్‌తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. అందుకే అతని జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్ డే రోజున ప్రభుత్వాలు క్రీడలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. అయితే హాకీ క్రీడకు వన్నెతెచ్చిన ధ్యాన్ చంద్‌కు ఇప్పటివరకు భారత రత్న అవార్డు మాత్రం దక్కక పోవడం శోచనీయం.
క్రీడలు ప్రాథమిక హక్కు?
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై 2018 ఆగస్టులో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. అనంతరం,కోర్టు 2019 ఏప్రిల్‌లో శంకర్నారాయణన్‌ను అమికస్‌గా నియమించింది. క్రీడలకు బదులుగా ‘భౌతిక అక్షరాస్యత’ అనే విస్తత పదాన్ని స్వీకరించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా రక్షించబడిన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. అన్ని ఎడ్యుకేషన్ బోర్డ్‌లు తప్పనిసరిగా ప్రతి పాఠశాల రోజులో కనీసం 90 నిమిషాలు ‘ఉచిత ఆటలకు’ అంకితమివ్వాలని కోరింది. అలాగే ఢిల్లీ డైలాగ్ కమీషన్ ‘ఆడే హక్కు’ పిల్లల హక్కుగా పరిగణించాలని ‘క్రీడలకు మార్కులు’ వంటి పథకాలను తేవాలని రాష్ట్ర క్రీడల బిల్లును రూపొందించాలని కూడా సూచనలు చేసింది. అయితే ఈ సూచనలు అన్నీ కూడా నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.
విస్తుపోయే నిజాలు
వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బందంతో ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో భారత క్రీడారంగం వెనుకబాటుకు విస్తుపోయే నిజాలు వెలుగు లోనికి వచ్చాయి.130 కోట్ల పైబడి ఉన్న భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా తేలింది. అంతకన్నా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉంది. మొత్తం మీద దేశజనాభాలో 3.27 శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తిచూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.
ఇంకా కొంత వెనుకబాటే…
క్రీడారంగంలో భారత్ ఇంకా కొంత వెనుకబడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అగ్రగాములుగా నిలుస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇంకా తొలి పదిస్థానాల్లో చోటు పొందలేదు. నాలుగేండ్లకు ఒకసారి వెలువడే ఈ జాబితాల ప్రపంచంలో క్రీడలలో అగ్రస్థానంలో ఉన్న 10 దేశాల జాబితా ప్రకారం.. 1.అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 2.చైనా 3.జర్మనీ, 4.బ్రిటన్ 5.జపాన్, 6.ఆస్ట్రేలియా 7.కెనడా 8.ఫ్రాన్స్, 9.ఇటలీ 10.స్పెయిన్ ఉన్నాయి. భారత్ మాత్రం ఈ జాబితాలో 37వ స్థానంలో ఉంది.
ఒలింపిక్స్‌లో వెనుకంజ
భారత్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు కేవలం 35 పతకాలను మాత్రమే సాధించింది. అందులో 10 స్వర్ణం, తొమ్మిది రజతం, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా తొలిసారి జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సష్టించాడు. ఆ ఒలింపిక్స్‌లో మొత్తం ఏడు పతకాలను భారత్ దక్కించుకుంది. ఇవే భారత చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన ఒలింపిక్స్ కావడం విశేషం.
కామన్వెల్త్‌లో…
భారత్ 1934 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటోంది. ఇప్పటివరకు మొత్తం 564 పతకాలను సాధించి భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 203 బంగారు, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి. ఢిల్లీ వేదికగా జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్ భారత్ అత్యధికంగా 101 పతకాలు దక్కించుకుని చరిత్ర సష్టించింది. తాజాగా బర్మింగ్హామ్ వేదికగా జరిగిన గేమ్స్ నూ ఫర్వాలేదనిపించి 61 పతకాలతో సరిపెట్టుకుంది.
హర్యానా ఓ క్రీడా గ్యారేజ్
హర్యానాలో క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం వల్ల అక్కడ మంచి క్రీడాకారులు తయారు చేయబడుతున్నారు. మన దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్నారు. ఒలింపిక్స్ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో ఆ రాష్ట్ర ఆటగాళ్లు ఎక్కువ మంది ఉంటున్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారత జెండాను రెపరెపలాడిస్తున్నారు. దీనికి కారణం హర్యానాలోని మారు మూల పల్లెల్లో కూడా క్రీడా స్టేడియంలు ఏర్పాటు చేశారు. దీనీతో పాటు ‘మెడల్ కొట్టు జాబ్ పట్టు’ అనే నినాదంతో యువతకు ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని హర్యానా ప్రభుత్వం కలిగిస్తుంది. గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 మెడల్స్ సాధిస్తే ఈ రాష్ట్రం వాటా 22గా ఉంది. ఇవే విధానాలను మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చు.
క్రీడాభివద్ధికి నిధులేవీ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో క్రీడలకు నిధులు కేటాయించడంలో, ఖర్చు చేయడంలో అలసత్వం, ప్రాధాన్యత లేని అంశంగా చూడటమే క్రీడాకారులకు నేడు శాపంగా మారింది. గత పదేండ్లుగా కేంద్ర బడ్జెట్ పరిశీలిస్తే 2014-15లో రూ.1769 కోట్లు కేటాయించగా ఇది వరుసగా 1943, 2197, 2596, 2776, 2826 కోట్ల రూపాయలు కేటాయించారు. 2024-25లో రూ.3442 కోట్లు. గతేడాది కన్నా రూ.45 కోట్లు పెంచారు. దీన్నిబట్టి చూస్తే బడ్జెట్లో జిడిపి పెరుగుదల ద్వారా పెరగడం తప్ప పాలకులు క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమీ లేదని అర్థం అవుతుంది. ఇలా ఎటూ చాలని ఈ నిధులతో క్రీడలలో అద్భుత లక్ష్యాలు సాధించడం సాధ్యం కాదు. ప్రభుత్వాలు, అధినేతలు ఇప్పటికైనా ఈ విషయం గుర్తిస్తే మంచిది.
రాజకీయ ప్రమేయం
మన దేశంలో క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధు ప్రీతి, పారదర్శకత లేకపోవడం ప్రతిబంధకాలు అవుతున్నాయి. క్రీడా సంఘాల నిర్వహణలో రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగి పోయింది. ఈ విషయమై సర్వోన్నత న్యాయ స్ధానం కూడా ప్రభుత్వాలను మందలించింది. దీన్ని నివరించగలిగితే భారత క్రీడాకారులు తమ సత్తా చూపగలుగుతారు. ఒలింపిక్స్‌లో ఫలితాలు తప్పక సాధించగలుగుతారు
డబ్ల్యుహెచ్‌ఓ సూచన
గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా 2030 నాటికి కౌమారదశలో ఉన్నవారిలో శారీరక స్తబ్దతను 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికలో చేర్చబడింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు దీనికి సహకరించాలని పిలుపునిచ్చింది. బోట్స్వానా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఈ నాలుగు ఆఫ్రికన్ దేశాలలో జరిపిన ఈ అధ్యయనాల ప్రకారం నిపుణుల సూచనల మేరకు డబ్ల్యుహెచ్‌ఓ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు.. పిల్లలు శారీరక శ్రమలో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర వహించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పి, ప్రోత్సహించాలి. పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు బోధనేతర కార్యక్రమాలు, క్రీడలు తప్పనిసరిగా నిర్వహించాలి. సురక్షితమైన పచ్చని ప్రదేశాలు, ఆట స్థలాలు, క్రీడా సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమేనని, ఈ విషయంలో ప్రభుత్వాలు గురుతర బాధ్యత వహించాలి’ అని ప్రకటించింది.
ఖేలో ఇండియా
క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పదేండ్ల నుంచి 18 ఏండ్ల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీయువకులను గుర్తించి ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ప్రధానలక్ష్యంగా 2017-18లో ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి శిక్షణతో పాటు విద్యా సదుపాయాలను సైతం అందిస్తారు. క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడం ఖేలో ఇండియాకు ఆయువుపట్టుగా ఉండే విధంగా కార్యాచరణ చేపట్టారు.
ఫిట్ ఇండియా ఉద్యమం
యూత్ ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో 2019లో జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్ ఎల్లప్పుడూ మన సంస్కతిలో అంతర్భాగంగా ఉంది. గతంలో శరీరక శ్రమతో మనుషులు దఢంగా ఉండేవారు. ఇప్పుడు సమయాభావం, పనులు భిన్నంగా ఉండటం వల్ల ఫిట్నెస్‌కు దూరమయ్యారు. దీన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండటానికి రోజూ వ్యాయాం, వాకింగ్, జాగింగ్ లాంటివి తప్పని సరి చేసే విధంగా చర్యలు చెయ్యాలని, ఒంట్లో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువును తొలగించి దేశాన్ని ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు నడిపించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినదే ఫిట్ ఇండియా ఉద్యమం. అయితే ప్రభుత్వాలు ఆర్భాటంగా విభిన్న పధకాలు ప్రవేశపెట్టినా వాటి అమలుకు కావలసిన నిధులు అరకొర గానే ఉంటున్నాయి.
నూతన జాతీయ క్రీడా విధానం 2025.. లోపభూయిష్ఠమైన క్రీడా వ్యవస్థకు సంస్కరణల శస్త్రచికిత్స చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘జాతీయ క్రీడాపాలనా బిల్లు’ తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందింది. అందులోని నియమ నిబంధనలు పక్కాగా అమలుకు నోచుకుంటే సమాఖ్యల తీరుతెన్నులు గాడినపడటమే కాదు, క్రీడాపాలకులు జాతికి జవాబుదారీగా ఉండాలన్న ప్రజాభీష్టమూ నెరవేరుతుంది. ఇది అవినీతికీ, రాజకీయాలకు తావులేకుండా సక్రమంగా సాగితే భారతీయ క్రీడా రంగం మరెన్నో విజయాలను సాధించ గలుగుతుంది. రానున్న పదేండ్లలో ఆటల్లో భారత్‌ను టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలపాలని కేంద్రం సంకల్పించింది. అందుకోసం నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సంఘాలు, అథ్లెట్లు, నిపుణుల సలహాలతో ఖేలో భారత్ నీతి-2025′ పేరుతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రీడా విధానాన్ని ఇలా వ్యూహాత్మక, నిర్మాణాత్మక, ఆచరణాత్మక పద్ధతిలో రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
2036 ఒలింఫిక్స్ లక్ష్యం
నూతన జాతీయ క్రీడా విధానం ద్వారా ఒలింపిక్స్, కామన్వెల్త్ లాంటి పెద్ద క్రీడల్లో సత్తా చాటే విధంగా క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మహిళలు, గిరిజన, దివ్యాంగ క్రీడాకారులపై ప్రత్యేక దష్టి సారించనున్నారు. దేశవ్యాప్తంగా ఫిట్ నెస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమూ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నారు. అయితే ఈ కొత్త విధానం పకడ్బందీ అమలుకు పెద్దయెత్తున నిధులు అవసరమవుతాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో క్రీడలకు రూ.3794 కోట్లు ప్రత్యేకించారు. గతేడాది కంటే ఇది రూ.350కోట్లు అదనం. కానీ, ఈ నిధుల నుంచి ఒక్క ఖేలో ఇండియా పథకానికే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. భారత్ 2036లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమివ్వాలన్న సంకల్పంతో ఉంది. ఆ దిశగా వేసిన తొలి అడుగే ఈ కొత్త క్రీడా విధానం. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు తాము సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి భారత్ తెలియజేసింది.
చదువు సంస్కారం అనేవి జంట పదాల లాగే చదువు క్రీడలను కూడా అదే విధంగా భావించాలి. వ్యాయామం లేని విద్య విజ్ఞానాన్ని ఇస్తుందే కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఆరోగ్యం సహకరించని విజ్ఞానం నిష్ప్రయోజనం. ఆరోగ్య భారత్ సాధించాలంటే క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మైదానం మొఖం చూపించకుండా ఇరుకు గదుల్లో కుక్కేసి బాల్యాన్ని చిదిమేసే అధికారం ఎవ్వరికీ లేదు. ప్రభుత్వాలు విద్యా సంస్థల విషయంలో క్రీడల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కఠిన చట్టాలు అమలు చేయగలిగితే చిన్నారుల విలువైన బాల్యాన్ని కాపాడిన వాళ్లమవుతాము. అలా కాకుండా ఎదో స్వాతంత్య్ర దినోత్సవం నాడు, రిపబ్లిక్ దినోత్సవం నాడు, క్రీడల దినోత్సవం నాడు మమ అని నాలుగు ఆటలు ఆడించి తిరిగి తరగతి గదుల్లో ఇరికించే పరిస్ధితులు ఉన్నంత కాలం మేలిమి క్రీడా సంస్కతిని ఆశించలేము.
చిత్త శుద్ధితో ప్రభుత్వాలు తమ కార్యాచరణ ఆరంభించినట్లయితే ఇది అసాధ్యమైన విషయం కానే కాదు. ఎందుకంటే క్రమం తప్పని వ్యాయామ తరగతులు, క్రీడా వ్యాపకాలతో జర్మనీ, నార్వే తదితరాలు తమ భావిపౌరుల సర్వతోముఖాభివద్దికి శ్రమిస్తున్నాయి. మొగ్గదశ నుంచే క్రీడాకారులకు చేయూతనందిస్తున్న చైనాతో పాటు ఫిన్లాండ్, నెదర్లాండ్స్, పోలాండ్, హంగేరీ, డెన్మార్క్, బల్గేరియా వంటి చిన్న చిన్న దేశాలూ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కొల్లగొడుతున్నాయి. పాఠశాలల్లో పీఈటీల నియామకాలు మొదలు వసతుల వరకు అన్నింటా కొరతే తాండవిస్తున్న మన దేశంలో మాత్రం స్వీయ పట్టుదల, తల్లిదండ్రులు, గురువుల తోడ్పాటుతో ఏ కొద్దిమందో మేటి క్రీడాకారులుగా ఎదగగలుగుతున్నారు.
ఏది ఏమైనా జనజీవితంలో క్రీడాసంస్కతి ఓ ప్రధాన భాగంకానంత వరకూ ఎన్ని క్రీడా దినోత్సవాలు జరుపుకున్నా ఆచరణలో అద్భుత ఫలితాలు ఆశించడం అనేది అత్యాశే. జాతీయ క్రీడల దినోత్సవం కేవలం ఒక వేడుక కాకుండా, భారత్‌లో క్రీడలకు నిజమైన పునాదులు వేసే సంకల్ప దినం కావాలి. ధ్యాన్ చంద్ స్ఫూర్తి మనకు చెబుతున్న సందేశం ‘క్రీడలు మన సంస్కతికి ఆత్మ, దేశానికి గౌరవం, యువతకు భవిష్యత్’ ఈ సందేశాన్ని ఆచరణలో చేసి చూపాలి.
– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578