భారత ఎన్నికల కమిషన్ ఇటీవలే 75 ఏండ్లు పూర్తిచేసుకుంది. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం స్వాతంత్య్ర అనంతరం స్వతంత్ర ఎన్నికల సంఘం 1950లో వ్యవస్థీకతమైంది. అంటే, ఒకరకంగా ఎన్నికల సంఘం సిల్వర్ జూబ్లీ జరుపుకోవాల్సిన సమయం.కానీ, బీహార్ ఓట్ల తొలగింపు విషయమై సుప్రీం కోర్టు ఆదేశాలు చెంపపెట్టులా తగలడం, ఇది ఎన్నికల సంఘానికే కాదు, స్వతంత్ర సంస్థలను భ్రష్టు పట్టించాలని చూసే రాజకీయ పక్షాలకు సరైన గుణపాఠం! ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం చిత్రంగా, తన స్వతంత్ర శైలికి భిన్నంగా తొలిసారి ప్రతిపక్షాలు, మేధావి వర్గం నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందికరం. ఇప్పటివరకు చిన్నచిన్న ఆరోపణలు తప్ప ఎన్నికల సంఘం విశ్వసనీయత విషయంలో రాజకీయ పక్షాలు ఏ విధానపరమైన విమర్శలు చేయలేదు? తొలిసారి ప్రతిపక్షాల విమర్శ లకు ఈసీ కూడా నోరు విపాల్సిన స్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ఎన్నికలే! ప్రజలు తమ ఓటు అనే ఇటుకలు పేర్చి అధికార పీఠాన్ని నిర్మిస్తారు.అలాంటి అధికారాన్ని నిర్మించడంలో కీలకపాత్ర నిర్వహించే ఎన్నికల సంఘం స్వతంత్రతకు భిన్నంగా తను కూర్చున్న కొమ్మను తానే నరుకున్న తీరుగా ఎందుకు వ్యవహరించింది?
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా సిటిజన్ షిప్ వెరిఫికేషన్ యాప్‌ను ఉపయోగించడమనేది అనేక అనుమానాలు,అభ్యంతరాలకు దారితీసింది.ఒకేసారి 65లక్షల ఓట్లు తొలగించడం మామూలు విషయం కాదు? తొలగింపు అంశంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా దాన్నే బల పర్చింది. బీహార్ వెనుక బడిన రాష్ట్రంతో పాటు, భవన నిర్మాణరంగంలో పనిచేయడం కోసం ప్రజలు దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు ఇతర రాష్ట్రాలకు పనుల నిమిత్తం తాత్కాలిక వలస వెళ్తారు. ఇండ్లవద్ద వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉంటారు.స్పెషల్ డ్రైవ్‌లో అట్లాంటి వారి ఓట్లు తొలగించడం అంటే దరిదాపు శ్రామిక వర్గం ఓట్లు గంపగుత్తగా ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించడమే! అంతేకాదు, బీహార్ ఓటర్లను ఉన్న పళంగా సిటిజన్ షిప్ నిరూపించుకోవాలనడంలో కూడా అర్థం లేదు? ఎందుకంటే, విదేశాలకు వెళ్లి నివసించే వారికి తప్ప,ఈ దేశంలో పుట్టిపెరిగిన వారెవరూ సిటిజన్ షిప్ పత్రాలు దగ్గర పెట్టుకోరు.అవేమిటో కూడా సామాన్య ప్రజలకు అర్థం కాదు. తన స్వతంత్రతను కాపాడు కోవాల్సిన ఎన్నికల సంఘం చర్యలకు నిరసనగా స్థానిక ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణ నినాదం వరకు వెళ్లింది.అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఈవిషయంలో సిటిజన్ షిప్ అవసరం లేదు? ఆధార్ కార్డు ప్రాతిపదిక తీసుకుని వెరిఫికేషన్ చేయవచ్చని స్పష్టంగా ప్రకటించింది. అంటే ఏస్థాయిలో ఎన్నికల సంఘం పప్పులో కాలేసిందో అర్థమవుతుంది.ఈ మధ్యకాలంలో సంఫ్‌ు పరివార్ ఎజెండాను భుజానికెత్తుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే సిటిజన్‌షిప్ వివాదాన్ని తరచూ వివిధ రంగాల్లో అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నది, అనేకచోట్ల వివాదాస్పదమవుతున్నది. అదేతీరుగా ఎన్నికల స్వతంత్రతను కూడా దెబ్బతీసే వ్యూహంలో బీహార్‌ను పాచికగా ఉపయోగిస్తున్నది. స్వతంత్ర వ్యవస్థగా కొనసాగించాల్సిన ఎన్నికల సంఘం విధానాల్లోకి రాజకీయ పరమైన ఎత్తుగడలు ప్రవేశించాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా తనదైన ముద్రవేసిన టీఎన్ శేషన్ లాంటి అధికారి ముక్కుసూటి, నిక్కచ్చి నిబంధనలు అమలు పరిచిన స్వతంత్ర ఆలోచనలు ముందుకు తీసుకెళ్లిన ఎన్నికల సంఘమేనా ఇది అన్న సంశయం కూడా ఒక్కోసారి మనకు కలుగుతుంది. నిరం తరం ఎన్నికల సరళీకరణ, ఎక్కువమంది వయోజనులు ఓటు వేసే విధంగా ప్రచారం చేస్తూ వచ్చిన ఎన్నికల సంఘం విధానాలు రూపకల్పన పేరుతో ఎందరో వయోజనుల ఓట్లు తొలగించే సంక్లిష్టత వైపు హఠాత్తుగా మళ్లడం దేనికి సంకేతం?ఇది మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ కాదా? విభిన్న భాషా, ప్రాంతీయ,కుల,మత వైరుధ్యాలు ఉన్న మన వ్యవస్థలో ప్రజాస్వామ్య మూలస్తంభం ఎన్నికల విధానమే?మన ఆలోచన ధోరణిని ప్రతిబింబంగా మారిన ఎన్నికల సంస్కరణలు కనిపిస్తాయి. గత ఏడున్నర దశాబ్దాల కాలం, అంతకు ముందు నుండి మనం ఎన్నికల సరళీకరణ, పరిణామక్రమం ఒకసారి గుర్తుచేసుకుంటే, అనేక అడ్డంకులను, వివక్షతను అధిగమిస్తూ వచ్చింది. ఓటు హక్కును ప్రజల చెంతకు చేర్చడంలో, ప్రాధాన్యత గుర్తింపు చేయడంలో సఫలమైంది. సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలకు చాలాకాలం ఓటుహక్కు లేదు.బ్రిటీష్ పరిపాలనా కాలంలో మనదేశంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆస్తులు కలిగి ఉన్న ధనికులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, కొన్ని ప్రత్యేక నిబంధ నలతో సిక్కులు, ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే ఇరవై ఏండ్లు నిండిన వయోజను లందరికీ,పేద,ధనిక,స్త్రీ, పురుష బేధం లేకుండా ఓటుహక్కు వచ్చింది.
1951-52 తొలి సాధారణ ఎన్నికల నాటికి పోటీచేసిన అభ్యర్థులందరికీ తలో బ్యాలెట్ బాక్స్ ప్రతి ఓటింగ్ కేంద్రంలో ఉండేది. ద్విసభ్య నియోజకవర్గం ఉనికిలో ఉంది. అటు తర్వాత 1969లో మన ఎన్నికల ”మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” రూపుదిద్దుకున్నది.1970-80 దశకానికి కానీ మన ఎన్నికల విధానంలో సమగ్రత,పారదర్శకత చోటుచేసుకుంది.1988 ఏడాదిలో 61వరాజ్యాంగ సవరణ ద్వారా మన వయోజన ఓటు హక్కును21 నుండి 18 ఏండ్లకు కుదించింది. 1993లో దొంగ ఓట్లు అరికట్టడానికి ఓటర్ ఐడి కార్డులు రూపకల్పన చేసింది. 2004నాటికి మన బ్యాలెట్‌లో ”నోటా”వచ్చి చేరింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే ”నోన్ ఆఫ్ ఎబోవ్”కు ఓటు వేసే సంస్కరణ తెచ్చింది. 2010నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లు ఎన్నికల నిర్వాహణలో భాగమైంది. ఇది కోట్లాది రూపాయల బ్యాలెట్ పేపర్ ముద్రణ ఖర్చు తగ్గించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్ తోడ్పడింది. ఎలక్ర్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయత కోసం 2017లో వివి పాట్ స్లిప్పు వాడుకలోకి వచ్చింది.2018లో ఎన్నికల నిధులు పారదర్శకత పేరుతో బీజేపీ ”ఎలక్టోరల్ బాండ్లు” అనే సంస్కరణక తెరదీసింది. వివిధ పార్టీలకు సమకూరిన నిధులు, వేలకోట్లు బాండ్లు కొనుగోలు చేసిన కార్పోరేట్ సంస్థలు తీరుచూస్తే, మీకిది-మాకిదన్న రీతిగా వ్యవ హారం మారింది. చట్టబద్దమైన అవినీతి రూపమే ”ఎన్నికల బాండ్లు”అని సీపీఐ(ఎం) బహిర్గతపరిచే వరకు మనకు తెలియదు. ఈ విషయంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది.
ఇంత సంక్లిష్ట దశను ఎదుర్కొన్న ఎన్నికల కమిషన్ మెజారిటీ ప్రజలు ఓటు వేసేలా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చూడాల్సిందిపోయి సిటిజన్‌షిప్‌ను నెత్తికెత్తుకోవడం వెనుక ఉన్న మతలాబేంటి? పౌర సమాజంలో ఈ వ్యవస్థ అభాసుపాలు కావడానికి లెక్క ఎక్కడ తప్పింది? బీజేపీతో అంటకాగి, పూర్తిగా ఆ పార్టీ చేతుల్లో బందీ కావడం వల్లేనా? అయితే ఈ అప్రతిష్టను రూపుమాపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే రాజకీయ పక్షం కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. ఓటుహక్కును ప్రతిఒక్కరికి కలిగించే విధంగా నడుచుకోవాలి. ఇది రాజ్యాంగం ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారమన్న సంగతి అస్సలు మరచిపోకూడదు.
ఎన్. తిర్మల్
9441864514
ఎన్నికల సంఘం ఎక్కడ లెక్కతప్పింది!?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES