Sunday, February 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివాళ్లెక్కడుంటారంటే..!?

వాళ్లెక్కడుంటారంటే..!?

- Advertisement -

”కమ్యూనిస్టులు ఎక్కడున్నారు?”
అంటూ ఇటీవల ఒక బడా(యి)నేత హేళనగా ప్రశ్నించారు.
అయ్యా…!
మీరు అడిగిన ప్రశ్నే మీ
రాజకీయ దివాళాకోరుతనానికి సాక్ష్యం.
మీకు కమ్యూనిస్టులు కనిపించకపోవడంలో
ఆశ్చర్యమేమీ లేదు.

ఎందుకంటే..
వాళ్లు రాజ్‌భవన్‌ లాబీల్లో ఉండరు.
కార్పొరేట్‌ బోర్డు రూముల్లో డాలర్లు లెక్కించే
మీ యజమానుల కుర్చీల పక్కన ఉండరు.
నిత్యం అబద్ధాలు వల్లిస్తూ మీకు భజన చేసే
టీవీ స్టూడియోల అరుపుల్లో, మీడియా డిబేట్‌ల
నాటకాలలో కనిపించరు.
ప్రజల చెమటకి విలువ లేనిచోట,
నిజాలను సమాధి చేసేచోట
కమ్యూనిస్టులు ఉండరు.

కానీ వాళ్లు ఉంటారు.
ఎక్కడంటే..
పంటకు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే
శవాలవుతున్న రైతుల దగ్గర ఉంటారు.
జీతం అడిగితే లాఠీలు సమాధానమిచ్చే
కర్మాగారాల గేట్ల వద్ద ఉంటారు.
మీ లేబర్‌ కోడ్స్‌ కార్మికుడి చెమటను చట్టబద్ధంగా
దోచుకునే కొత్త ఆయుధాలు.
అందుకే వాళ్లు 8 గంటల పనిదినాన్ని
చెరిపేసే, సమ్మె హక్కును నేరంగా మార్చే,
ట్రేడ్‌ యూనియన్లను నిర్వీర్యం చేసే
ఈ కోడ్స్‌కు ఎదురుగా నిలబడి ఉంటారు.
ఫీజుల భారం మోయలేక భవిష్యత్తునే
వదిలేస్తున్న విద్యార్థుల పక్కన ఉంటారు.
ఉపాధికోసం తిరుగుతూ తమ యవ్వనాన్ని
వృధా చేసుకుంటున్న నిరుద్యోగ యువకుల మధ్య ఉంటారు.
ఆస్పత్రిలో బెడ్‌ దొరకక వరండాల్లో
ప్రాణాలు లెక్కపెట్టుకునే రోగుల వెంట ఉంటారు.
అభివృద్ధి పేరుతో అడవుల నుంచి
తరిమివేయబడుతున్న గిరిజనుల వెన్నంటి ఉంటారు.

కానీ మీ అధికారం, మీ అహంకారం ఆ దిశగా చూడదు.
చూడలేదు కూడా.
ఎందుకంటే.. అంత ధైర్యం మీకులేదు.
అందుకే మీకు కమ్యూనిస్టులు కనిపించరు.
ఒకప్పుడు అధికార శిఖరం మీద నుంచే
మీ మూలవిరాట్టు అనుకోకుండా నిజం చెప్పాడు.. మరిచిపోయారా?
”కమ్యూనిస్టు ఒక్కడున్నా ప్రమాదమే!” అన్నారాయన.
అవును… ప్రమాదమే.
మీ అధికారానికి ప్రమాదం.
మీ అబద్ధాల సామ్రాజ్యానికి ప్రమాదం,
మీ దోపిడీ పునాదులకు అంతకన్నా ప్రమాదం.

ఎందుకంటే.., కమ్యూనిస్టు ఒక్కడున్నా తలవంచడు, ప్రశ్నిస్తాడు.
ఎందుకు రైతులు చనిపోతున్నారు?
ఎందుకు ఉద్యోగాలు లేవు?
ఎందుకు విద్య వ్యాపారమైంది?
ఎందుకు ఆరోగ్యం అంగడి సరుకైంది?
ఎందుకు కార్మికుడికి పని తప్ప
హక్కులు మిగలడం లేదు? ఈ ఒక్కో ప్రశ్న
మీ వంద అబద్ధాలను ముక్కలు చేస్తుంది.
మీ దేశభక్తి డ్రామాను బట్టబయలు చేస్తుంది.

అయ్యా…!
మీకు కమ్యూనిస్టులు ఎన్నికల లెక్కల్లో కనిపించకపోవచ్చు.
కానీ, చూసే ధైర్యం ఉంటే
ప్రజల్లో కనిపిస్తారు. ప్రజల పోరాటాల్లో కనిపిస్తారు.
రేపు ఫిబ్రవరి 12న ఈ దేశమంతా మారుమోగనున్న
సార్వత్రిక సమ్మెలో చూడండి..
మీ లేబర్‌ కోడ్స్‌కు, మీ రైతు వ్యతిరేక విధానలకు ఎదురుగా
కోట్లాది మంది కార్మిక కర్షకులతో కలిసి నిలబడి ఉంటారు.
అయినా కమ్యూనిస్టులంటే
ఓట్లూ సీట్లూ కాదని మీకూ తెలుసు.
వాళ్లు మీకు నిద్రలేకుండా చేసే ప్రశ్నలు.
మీ అధికారాన్ని వణికించే నిప్పుకణికలు.
అదే మీ అసలు భయం.

  • ధ్రువ రాహ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -