కేంద్ర ప్రభుత్వ 2026-27 అంచనా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచక పోగా తగ్గించడం వల్ల చిన్న-సన్నకారు రైతులు మరింత నష్టపోనున్నారు. దేశంలో వ్యవసాయాధారంగా యాభై శాతానికి పైగా ఉన్నా..మొత్తం బడ్జెట్‌లో 2.7 శాతం నిధులే కేటాయించడం ఆందోళన కల్గిస్తోంది. మొత్తం రూ. 53, 47, 315 కోట్ల కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే. గతేడాది సవరించిన బడ్జెట్ కంటే ఆరు శాతం తక్కువ. ఈ కేటాయింపులను బట్టి చూస్తే.. వ్యవసాయం, రైతులపై ఏ మేరకు పట్టింపు ఉందో స్ఫష్టమౌతుంది. రైతులకు సాగులో భారీగా పెట్టుబడులు పెరుగుతుండగా, ఇందుకు అనుగుణంగా పంటల మద్దతు ధరలు పెరగడం లేదు. దీంతో రైతాంగం దిన దినం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. మన దేశంలో సుమారు 350 మిలియన్ల ఎకరాల్లో పన్నెండు కోట్ల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
వీరితో పాటు వ్యవసాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగానూ యాభై శాతానికి పైగా ప్రజలు ఆధార పడి జీవిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతాంగానికి నిధులు కేటాయించాల్సి ఉండగా.. అవేమీ లేకుండా, కార్పోరేట్ వర్గాలకు దున్నుగా నిలిచేలా కేటాయింపులు చేసినట్లు స్ఫష్టమౌతుంది. ఈ బడ్జెట్‌లో ఎరువుల రాయితీల్లోనూ కోతలు విధించింది మోడీ ప్రభుత్వం. గతంలో రూ.1,86,460 కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో రూ.1,70,781 కోట్లు ప్రతిపాదించింది సర్కారు. గత సవరించిన బడ్జెట్ కంటే సుమారు రూ. 16 వేల కోట్లు తక్కువ. అహార, వాణిజ్య పంటలకు 600 లక్షల టన్నులకు పైగా ఎరువులు అవసరం. ఆయా పంటలకు నత్రజని, భాస్వరం, పొటాషియం, తదితర యూరియా అవసరం. గత రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వ తీరును పరిశీలిస్తే.. ఆయా రాష్ట్రాలకు తక్కువగా ఎరువులను సరఫరా చేస్తూ రాయితీల్లో కోతలు విధిస్తోంది.
ఒకవైపు దిగుమతులు తగ్గిస్తూ.. మరోవైపు ఉత్పత్తినీ తగ్గిస్తోంది. గత ఖరీఫ్‌లో తెలంగాణలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తిని నిలిపి వేసింది. నెలల పాటు యూరియా ఉత్పత్తి చేయక పోవడంతో పంటలకు సకాలంలో ఎరువులందక పంటల దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. మోడీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై గొప్పలు చెప్పుకుంటున్నా..కార్యాచరణలో చూపడం లేదు. నేషనల్ ఆన్ నేచురల్ ఫామింగ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, పరం పరాగత్ కృషి వికాస్ యోజన..ఇలా పలు కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ సర్కారు, ఇందుకు సంబంధించిన కేటాయింపులు మాత్రం నామమాత్రం. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర- దక్షణాది రాష్ట్రాలను విభజించి పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఫలితాలు రాబట్టడం లేదు. సరైన నిధులు కేటాయింపులు లేకపోవడం, పర్యవేక్షణ, చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
సాధారణంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేనప్పటికీ.. స్వతహాగా రైతులు ఆయా పంటలు సాగు చేస్తున్నారు. ఆయా వివరాలను తమ ఖాతాల్లో వేసుకుంటోంది ప్రభుత్వం. పంటలకు ఎక్కువగా ఫెస్టిసైడ్స్ వినియోగిస్తున్నారనే నెపంతో దేెశ వ్యాప్తంగా ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రాలకు లేఖలు పంపింది మోడీ ప్రభుత్వం. ఎరువులు, రసాయణాల తయారీ, అమ్మకాలు, నిర్వహణా బాధ్యతలు తమ చెప్పు చేతల్లో పెట్టకునేలా చట్టాన్ని రూప కల్పన చేసింది. పర్యావరణ రక్షణ, ఆత్మహత్యల నివారణ పేరుతో ఈ చట్టాన్ని తీసుకవస్తోంది.
ఇక్కడి వరకు భాగానే ఉన్నా.. ప్రత్యామ్నాయ సేంద్రీయ ఎరువులు, జీవామృతం తయారీకి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించ లేదు. పంటలకు ఎరువులు, రసాయణాల వియోగంపై రైతులకు సరైన అవగాహన కార్యక్రమాలూ చేయలేదు. ప్రధానంగా మట్టి నమూనా పరీక్షలు చేసి నిర్ధారించే వ్యవస్థనూ విస్తరించ లేదు. దీనివల్ల భవిష్యత్‌లో పంటల దిగుబడి రాక రైతుల మరింత నష్ట పోయే అవకాశాలున్నాయి. మనది వ్యవసాయ దేశం అయినప్పటికీ.. ప్రస్తుత మోడీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో సరైన నిధులు కేటాయించకపోవడం బాధాకరం. ఇలా ప్రతీ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కోతలు విధిస్తూ పోతే.. భవిష్యత్‌లో అహార సంక్షోభంతో పాటు ఉపాధి అవకాశాలు మరింతగా క్షీణించే ప్రమాదం పొంచి ఉందనేది వాస్తవం.
చిలగాని జనార్ధన్
8121938106



