గాడిలో పెట్టాల్సింది సాహితీవేత్తలే
వీధి పోరాటాలను మించిన వీడియో పోరాటాలు
రేటింగులు, వ్యూవర్‌షిప్పే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలు
ఈ పరిస్థితి మారాలంటే అభ్యుదయ సాహితీవేత్తలు అప్‌డేట్ కావాలి : తెలంగాణ సాహితి దశాబ్ది సాహితీఉత్సవాల్లో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
లాభమే పరమావధిగా కొనసాగుతున్న ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో సాటి మనిషి పట్ల ప్రేమ, కరుణ, జాలి, సోదరతత్వం పూర్తిగా కనుమరుగవుతున్నాయని పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎటు పోతున్నామో తెలియని స్థితిలో సమాజం కొట్టుమిట్టాడుతోందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని సరిదిద్ది, మనుషులను గాడిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత అభ్యుదయ, ప్రగతిశీల భావాలుగల సాహితీవేత్తలపైనే ఉందని అన్నారు. మతాలు, కులాల పేరిట పాలకులు.. మనుషులను విడదీస్తున్న నేటి తరుణంలో వారందరినీ కలిపి ముందుకు నడపటమే సాహిత్యకారుల పరమావధి కావాలని సూచించారు.
సాహిత్యంలో మనం జీవితాన్ని తడిమితే.. అది మన జీవితాన్ని తడుముతుందని పేర్కొన్నారు. తద్వారా అటు జీవితం, ఇటు సాహిత్యం రెండూ సుసంపన్నమవుతాయని వ్యాఖ్యానించారు. అందుకే నేటి యువ కవులు క్షేత్రస్థాయిలోని ప్రజల జీవితాలను ఆవిష్కరింపజేసే సాహిత్యాన్ని సృష్టించాలని వారు పిలుపు నిచ్చారు. రెండు రోజుల పాటు కొనసాగే తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యో త్సవాలు హైదరాబాద్‌లోని తంగిరాల చక్రవర్తి (ఏవీ కాలేజీ) ప్రాంగణంలో శనివారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభకు ప్రముఖ కవి, విమర్శకులు నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ రియాజ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
యువత సాహిత్యాన్ని చదవాలి
సాహిత్యం తెలిస్తేనే లోకం తెలుస్తుందని, అందుకే విద్యార్థులు, యువత సాహిత్యాన్ని చదవాలని సిధారెడ్డి సూచించారు. చదువంటే కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదని.. డిగ్రీలతోపాటు సరైన వివేచన కావాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల సినిమాల్లో సాహిత్య ప్రాధాన్యత తగ్గి.. సంగీత హోరు పెరిగిందని వాపోయారు. వాటి మోజులో పడిన యువత గాలికి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమస్యలపై వీధి పోరాటాల కంటే వీడియో (సోషల్ మీడియా) పోరాటాలే ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. సమాజ సేవ చేస్తే మాకేం వస్తుందనే ధోరణి అందరిలో పెరిగిపోవటం ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ హితాన్ని కాంక్షించే కవులు, రచయితలు, సాహితీవేత్తలకు.. తెలంగాణ సాహితి వేదిక కావటాన్ని ఆయన అభినందించారు.
కేవలం సన్మానాలు, సత్కారాలు, పుస్తకావిష్కరణలకే పరిమితమయ్యే సంస్థలకు భిన్నంగా ప్రజల జీవితాలతో అది మమేకం కావటం స్పూర్తిదాయకమని కొనియాడారు. పదేండ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ.. దశాబ్దకాలంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ఎదుర్కొని నిలబడటం హర్షణీయమని అన్నారు. మున్ముందు కూడా ఇలాగే సమాజానికి దశ, దిశ, నిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. రియాజ్ మాట్లాడుతూ… ప్రగతిశీల సాహితీవేత్తలకు, నేటి సామాజిక మాధ్యమాల వేగానికి ఉన్న అంతరాన్ని విడమరిచి చెప్పారు. వారు ఆ వేగాన్ని, తాజాదనాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరముందని సూచించారు. పెద్ద పెద్ద పుస్తకాలు, సుదీర్ఘ వ్యాసాలు రాయటంతోపాటు వాటిలోని సారాంశాన్ని చిన్న చిన్న వీడియోల రూపంలో విడుదల చేయగలిగితే ఎక్కువ ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. తద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేటి యువతకు సులభంగా చేరవేయొచ్చని పేర్కొన్నారు.
గోరటి వెంకన్న మాట్లాడుతూ… సోషల్ మీడియా నేటి సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తోందని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విష కౌగిలి నుంచి ముందుగా సాహితీవేత్తలు బయటపడాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం సామ్రాజ్యవాదం తన విశ్వరూపాన్ని చూపిస్తూ కరాళ నృత్యం చేస్తోందని తెలిపారు. మతోన్మాదం జడలు విప్పుతూ మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో కవులు, రచయితలు… ప్రజల పక్షాన ఉంటూ వారిని నిరంతరం అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ ఏనుగు నర్సింహారెడ్డి, కార్యదర్శి బాలాచారి, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత (కర్నాటక) శివలింగప్ప, కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, ప్రొఫెసర్ బన్న ఐలయ్య, ఏవీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, ప్రముఖ కవులు యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రఘు ప్రసంగించారు. నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ను ఈ సందర్భంగా జ్ఞాపికతో సత్కరించారు. అనంతోజు మోహన కృష్ణ ఆహూతులను వేదికపైకి ఆహ్వానించగా.. సలీమా వందన సమర్పణ చేశారు. సభకు ముందు పదేండ్ల కాలంలో తెలంగాణ సాహితి చేపట్టిన వివిధ కార్యక్రమాలతో కూడిన ఫొటో ప్రదర్శనను డాక్టర్ సీహెచ్ రాజలింగం ప్రారంభించారు.



