Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుకు భరోసా ఎక్కడ.? 

రైతుకు భరోసా ఎక్కడ.? 

- Advertisement -

అన్నదాతల ఎదురుచూపుల్లో యాసంగి ముగింపు
నవతెలంగాణ – కాటారం

యాసంగి సాగు ముగింపు దశకు చేరినా, రైతులకు అందాల్సిన ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం మాత్రం ఇంకా దారితప్పినట్టే ఉంది. పంటలు పొట్ట దశకు చేరి గింజలు కట్టే దశకు వస్తుంటే, రైతు భరోసా మాత్రం ప్రభుత్వ ఫైళ్లలోనే మొలకెత్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మండలంలో మొత్తం 8566 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా గుర్తించబడినా, వారి ఖాతాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఎన్నికల ముందు “మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యగానే నిధులు” అంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం నిధుల విషయాన్ని మరిచినట్టు వ్యవహరిస్తోందని రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్‌కు సాయం… యాసంగికి నిరీక్షణ
2025 ఖరీఫ్ సీజన్‌లో మండల రైతులకు రూ.6 కోట్ల 92 లక్షల పెట్టుబడి సాయం జమ చేసిన ప్రభుత్వం, యాసంగి విషయంలో మాత్రం మౌన వ్రతం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో సాయం వస్తుందో లేదోనని రైతులు “భవిష్యత్తు వాతావరణ సూచన”లా ఊహాగానాలు చేస్తున్నారు.

శాటిలైట్ చూసింది… రైతు కన్నీళ్లు కాదు
శాటిలైట్ సర్వే పేరుతో సాగు భూముల గుర్తింపు ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం, రైతుల కన్నీళ్లను మాత్రం ఇంకా గుర్తించలేదని అన్నదాతలు కంట కన్నీరు కరుస్తున్నారు . ఎన్నికల కోడ్ వచ్చిందని నిధులు నిలిపివేసి, కోడ్ ముగిసినా నిధులపై స్పష్టత ఇవ్వకపోవడం “రైతు భరోసా అంటే ఎదురుచూపేనా?” అనే ప్రశ్నను పెంచుతోంది.

నవంబర్‌లో ఇవ్వాల్సిన సాయం… ఫిబ్రవరి దాటినా లేదు
విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులకు ముందుగానే సాయం ఇస్తే ఉపశమనం లభించేదని రైతులు అంటున్నారు. కానీ పెట్టుబడి సాయం ఆలస్యం కావడంతో సాగు ఖర్చులు పెరిగిపోయాయి. రైతు భరోసా ముందుగా కాకుండా “పంట కోత తర్వాత వస్తేనే బాగుంటుంది” అన్నట్టుగా వ్యవహారం సాగుతోందని రైతులు దిగులు చెండుతున్నారు. 

రూ.7,500 హామీ… రూ.6,000 వాస్తవం
ఎన్నికల హామీల్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును ‘రైతు భరోసా’గా మార్చి ఎకరాకు రూ.6,000 మాత్రమే ఇస్తోంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఇది సరిపోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల భారం… అన్నదాతల ఆందోళన
పెట్టుబడి సాయం ఆలస్యం కావడంతో రైతులు వ్యాపారులు, ప్రైవేట్ వడ్డీల వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట దిగుబడి, ధరలు అనిశ్చితంగా ఉన్న వేళ అప్పుల భారం అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి అన్నదాతలకు నిజమైన భరోసా కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడి సాయం వెంటనే అందించాలని, రైతుల బాధలను అర్థం చేసుకుని త్వరగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నికి విజ్ఞప్తి చేస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -