– పట్టణాలకు బలమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి అవసరం
– భారత ఆర్థికాభివృద్ధికి ఇది అవశ్యం
– ఆర్థిక నిపుణులు, మేధావులు
కేంద్రంలోని మోడీ పాలనలో నగరాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశ జీడీపీలో సగానికి మించిన వాటా అందిస్తున్న భారతీయ నగరాలు.. నేడు తీవ్రమైన నిధుల కొరతతలో కొట్టుమిట్టాడుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద జీఎస్టీ అమలుతో మున్సిపల్ ఆదాయ వనరులు తగ్గిపోయాయి. దీంతో నగర అభివృద్ధి అటకెక్కింది. దీంతో నగర పాలక సంస్థలకు జీఎస్టీ నిధుల్లో స్థిరమైన వాటా కల్పించాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. పలువురు ఆర్థిక నిపుణులు, మేధావులు ఇదే విషయాన్ని సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో పట్టణాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా గుర్తింపు పొందినా… వాటిని నిర్వహించే నగర పాలక సంస్థలు మాత్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం 2017లో అమలులోకి తీసుకొచ్చిన వివాదస్పద వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారింది. ముఖ్యంగా ఇది దేశంలోని మునిసిపల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా పట్టణాభివృద్ధి లక్ష్యాలు, మౌలిక వసతులు, వాతావరణ మార్పులకు ఎదుర్కొనే సామర్థ్యం దెబ్బతింటున్నాయని ఆర్థిక నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత నగరాలు దేశ జీడీపీలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. అయినప్పటికీ.. పట్టణ పాలక సంస్థలు అవసరమైన నిధులను మాత్రం పొందలేని పరిస్థితి దేశంలో ఉన్నది. గత మూడు సంవత్సరాల కేంద్ర బడ్జెట్ల విశ్లేషణ ప్రకారం.. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏడాదికి సగటున రూ.0.5 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది పట్టణ మౌలిక సదుపాయాల కోసం అవసరమైన కనీస పెట్టుబడిలో ఐదో వంతు కూడా కాకపోవడం గమనార్హం.
మౌలిక వసతుల లోపాలు.. పెరుగుతున్న సమస్యలు
మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటూ ప్రచారాలు చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర, మునిసిపాలిటీల్లో తమ ప్రభుత్వాలే ఉండాలనే ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కారు’ నినాదాన్ని తీసుకొస్తు న్నది. కానీ నగరాలకు కేంద్రం బాధ్యతగా కేటాయించాల్సిన నిధుల విషయంలో మాత్రం మొండిచేయి చూపుతున్నది. ఈ కారణంతో నగరాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల్లో లోపాలు ఏర్పడుతున్నాయి. సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. రవాణా వ్యవస్థ, నీటి సరఫరా, పారిశుధ్యం పడకేసింది. ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్నది. వర్షకాలంలోనైనే వరదలతో నగరాలు నదులను తలపిస్తున్నాయి. వాతావరణ మార్పులతో ప్రమాదాలు మరింత తీవ్రమవు తున్నాయి.
మున్సిపల్ ఆదాయానికి జీఎస్టీ దెబ్బ
జీఎస్టీకి ముందు పట్టణాలు తమ పరిధిలోకి వచ్చే వస్తువులు, సేవలపై పన్నులు వసూలు చేసేవి. ఆక్ట్రారు, ఎంట్రీ ట్యాక్స్, లోకల్‌బాడీ ట్యాక్స్, ప్రకటనల పన్ను, వినోద పన్ను వంటి వనరులు మునిసిపల్ ఆదాయానికి కీలకంగా ఉండేవి. అయితే జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దయ్యాయి. మునిసిపాలిటీల ఆదాయానికి తీవ్రంగా గండిపడింది. దీంతో వాటి ఆర్థిక స్వయం ప్రతిపత్తి దెబ్బ తిన్నదని ఆర్థిక నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉదాహరణకు.. జీఎస్టీకి ముందు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయంలో ఆక్ట్రారు (అంటే నగర సరిహద్దుల్లోకి వస్తువులు ప్రవేశించినప్పుడు వసూలు చేసే స్థానిక పన్ను) వాటా దాదాపు 35 శాతం ఉండేది. ఆక్ట్రారు రద్దుతో ముంబయికి భారీ ఆదాయ లోటు ఏర్పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా.. పూణే, నాగ్‌పూర్, నాసిక్ వంటి నగరాలకు ఇప్పటికీ పూర్తి పరిహారం అందలేదు. ఒక్క పూణేకే రూ.500 కోట్ల మేర లోటు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
2024-25లో పట్టణ సంస్థలకు సుమారు రూ.1.3 లక్షల కోట్లు బదిలీ అయినట్టు అంచనా. ఇందులో అమృత్, స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ వంటి పథకాల ద్వారా సుమారు 25 శాతం, కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర నిధులు వచ్చాయి. అయినా.. జీఎస్టీ తర్వాత పట్టణాలకు జీడీపీలో నిధుల వాటా పెరగలేదు.
జీఎస్టీ నిధుల్లో పట్టణాలకు స్థిర వాటా అవసరం
పట్టణాలకు జీఎస్టీ నిధుల్లో నేరుగా, స్థిరమైన వాటా ఇవ్వాలన్న అభిప్రాయం మేధావుల నుంచి బలంగా వినబడు తోంది. ఇషర్ జడ్జ్ అహ్లూవాలియా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థిక నిపు ణులు విజరు కేల్కర్‌లు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. విజరు కేల్కర్ ప్రతిపాదన ప్రకారం… జీఎస్టీ ఆదాయంలో ఆరో వంతు మూడో స్థాయి ప్రభుత్వాలకు ఇవ్వాలి. దానిని గ్రామీణ, పట్టణ సంస్థల మధ్య సమానంగా పంచాలి. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో ఆ విధంగా జరగటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
గణాంకాలను బట్టి చూస్తే…
2024-25లో నికర జీఎస్టీ ఆదాయం రూ.19.5 లక్షల కోట్లుగా ఉన్నది. ఇందులో ఆరోవంతు అంటే.. రూ.3.25 లక్షల కోట్లు. ఇందులో పట్టణాలకు సగం కేటాయిస్తే అది రూ.1.6 లక్షల కోట్లు అవుతుంది. అంటే.. ఇది ఇప్పుడు నగరాలు, పట్టణాలకు ఇస్తున్న నిధుల కంటే దాదాపు రెట్టింపు కంటే అధికమని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబాటు
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు బదిలీ చేస్తాయి. అయితే భారత్‌లో ఈ బదిలీలు జీడీపీలో 0.45-0.5 శాతం మాత్రమే. ఇది మెక్సికో (1.6 శాతం), దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్ (2.5 శాతం), బ్రెజిల్ (ఐదు శాతానికి పైనే) దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అని మేధావులు చెప్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో జాతీయ ఆదాయంలో 40 శాతం స్థాకిక ప్రభుత్వాలకు కేటాయించాల్సిందేనని చట్టబద్ద నిబంధన ఉంది. ఈ నిధులు ముందే నిర్ణయించిన సూత్రాల ప్రకారం అందుతాయి. దీంతో అక్కడి నగరాలకు బలమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
రాజ్యాంగపరమైన లోపం
74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ సంస్థలకు బాధ్యతలు అప్పగించినా..వాటికి తగిన ఆదాయ వనరులు మాత్రం నిర్దేశించలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. 2009లోనే పట్టణ మౌలిక వసతులపై ఉన్నతస్థాయి కమిటీ… కేంద్రం-రాష్ట్రాల జాబితాలలాగా ప్రత్యేక ‘స్థానిక సంస్థల ఆర్థిక జాబితా’ ఏర్పాటు చేయాలని సూచించింది. జీఎస్టీ తర్వాత ఈ అవసరం మరింత తీవ్రమైంది. భారతదేశ ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం.. ఇవన్నీ బలమైన పట్టణ పాలనపై ఆధారపడి ఉన్నాయి. అందుకే జీఎస్టీ నిధుల్లో పట్టణాలకు స్థిర వాటా కల్పించడం, రాజ్యాంగపరమైన ఆర్థిక హక్కులు ఇవ్వడం అత్యవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



