Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌పై ధ్యాసేదీ?

బడ్జెట్‌పై ధ్యాసేదీ?

- Advertisement -

సన్నాహక సమావేశాలు ఎటుపాయే
మున్సిపల్‌ ఎన్నికల బిజీలో సీఎం, డిప్యూటీ సీఎం
బడ్జెట్‌ రూపకల్పనపై మదింపు శూన్యం
ఎలక్షన్ల తర్వాతే ఆర్థిక శాఖ కసరత్తు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు. వరుసగా జిల్లాల పర్యటనలున్నాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా మున్సిపల్‌ ఎన్నికల బిజీలోనే ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఎన్నికల పనుల్లోనే నిమగమైంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. గతనెల 24 నుంచి ప్రభుత్వ శాఖల వారీగా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోనే ఈ సమావేశాలు సచివాలయంలో జరుగుతాయని ప్రకటించింది.

ఆయా శాఖల మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ఆయా శాఖల విభాగాధిపతులతో ఈనెల ఐదో తేదీ వరకు ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ సమావేశాలు జరగడం లేదు. బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు ఎటుపాయే అని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వారికి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీ బాధ్యతలను కాంగ్రెస్‌ అప్పగించింది. ఇప్పుడు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుపైనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తు ప్రక్రియ వెనక్కి వెళ్లింది.

కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం
ఈనెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ఎనిమిది మంది, బీజేపీకి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. కానీ రాష్ట్రానికి నిధులను తేవడంలో వారు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రతిపాదనలను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం వాటిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది.

రాష్ట్రాలకు దక్కాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు మాత్రం వస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన కీలకంగా మారనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను ఏమైనా ప్రకటిస్తుందా?అన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్టు తెలిసింది. శాఖల వారీగా ఇప్పటికే ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ప్రతిపాదనలను సమర్పించాయి. వాటి గురించి ఆర్థిక శాఖకు వివరించి ఎక్కువ కేటాయింపులు ఉండేలా ఆయా శాఖల మంత్రులు, అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. త్వరలో జరిగే సన్నాహక సమావేశాల్లో శాఖల వారీగా ప్రభుత్వం తుది కేటాయింపులు జరిగే అవకాశమున్నది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు ఆలస్యం కావడంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -