యాసంగి సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు
90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
ఇప్పటికే 31,500 ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షాలతో మరింత కుదేలు
ముందస్తు ఏర్పాట్లు చేయకపోతే రైతుకు కన్నీళ్లే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి ఎక్కువ మొత్తంలో సాగైంది. ఈనెల రెండో వారం నుంచి కోతలు సైతం షురూ కానున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. వ్యవసాయ శాఖ ధాన్యం కొనుగోలు కేంద్రాల జాబితాను సిద్ధం చేసి, జిల్లాల కలెక్టర్లకు పంపాల్సి ఉంటుంది. దిగుబడి అంచనా, మార్కెట్‌కు ఎంత పంటొస్తుంది? ఆ మేరకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? పంట తగ్గుతుందా? పెరుగుతుందా? అనే అంశాలపై కరసత్తు చేసిన తర్వాత కలెక్టర్లు కొనుగోలు కేంద్రాల సంఖ్యను ప్రకటిస్తారు. కానీ ఇటు వ్యవసాయశాఖ గాని, అటు పౌర సరఫరాలశాఖ గానీ ఈ అంశంపై దృష్టి సారించకపోవటం గమనార్హం. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవటంతో రైతులు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే వడగండ్ల వానలు, ఈదురుగాలులు, అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో యాసంగిలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. మొత్తం 55 లక్షల ఎకరాల్లో 30 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లను సాగు చేశారు. కాగా అధికారిక లెక్కల ప్రకారమే అకాల వర్షాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 31,500 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పంటలు కోత దశకు చేరుకున్నాయి. కానీ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటంతో వడగండ్ల వానలు, అకాల వర్షాల వల్ల కోసిన ధాన్యం ఎక్కడ పాడైపోతుందోననే ఆందోళన రైతులను వెంటాడుతోంది. మరోవైపు ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తున్నా, రైతులు మాత్రం దొడ్డు వడ్లనే ఎక్కువగా సాగు చేశారు. అలాంటప్పుడు ప్రభుత్వం దొడ్లు వడ్లను కొనుగోలు చేస్తుందా? లేదా? ఒకవేళ కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్ఫాలిన్లు..యార్డుల కొరత…
ధాన్యం కోతలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో నిల్వ సదుపాయాలు లేకపోవడం మరో సమస్యగా మారింది. అకాల వర్షాలు కురిస్తే ధాన్యాన్ని కప్పేందుకు తగినంత సంఖ్యలో టార్ఫాలిన్లు లేకపోతే రైతులు నిండా మునిగిపోతారు. వీటితోపాటు గోదాములు, డ్రైయింగ్ యార్డులు కూడా చాలినంత సంఖ్యలో లేవు. దీనికితోడు కొనుగోలు కేంద్రాలు అవసరమైనంత సంఖ్యలో లేకపోవటంతో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరను సైతం రైతులు పొందలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేంతవరకు వేచి చూస్తే వడగండ్ల వాన, అకాల వర్షాలకు తమ పంటలు ఎక్కడ పాడైపోతాయోననే భయంతో వారు తక్కువ ధరకు మధ్య దళారులకు ఎంతకో ఒకంతకు వాటిని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో బ్రోకర్లు రంగంలోకి దిగినట్టు తెలిసింది.
స్పందన ఏది?
వర్ణ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, కౌలు రైతు సంఘం
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించాలి. లేదంటే అన్నదాత మరింత ఇబ్బందులపాలవుతాడు.
ముందస్తు ఏర్పాట్లు చేయాలి
టి సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
పంట చేతికి రాకముందే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. తీరా పంట చేతికొచ్చిన తర్వాత ఏర్పాట్లకు ఉపక్రమిస్తే రైతులకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం ఆలస్యమైతే ప్రయివేటు వ్యాపారులు రంగంలోకి దిగుతారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలి.



