చేనేత పరిశ్రమ రోజురోజుకూ అంతరిస్తోంది. ప్రోత్సాహం లేకపోవడంతో యువత ఈ రంగంలోకి రాలేకపోతోంది. ప్రభుత్వాల కంటితుడుపు పథకాలు ఫలితాలివ్వడం లేదు. అప్పటి ఏపీ పాలనతో పోల్చితే ప్రస్తుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు స్ఫష్టమౌతోంది. 80 వేల మంది చేనేత కార్మికులకుగాను ప్రస్తుతం 50 వేలకు తగ్గడమే ఇందుకు నిదర్శనం. నల్గొండ, మహబూబ్‌నగర్‌లో అక్కడడక్కడ కొన్నిచోట్ల మినహా చేనేత కళా వైభవం ఎక్కడా కానరావడం లేదు. తెలంగాణలో గత సర్కార్ అమలు చేసిన త్రిఫ్ట్‌ఫండ్‌ను ప్రస్తుత కాంగ్రెస్ యథావిధిగా అమలు చేస్తోంది. గతంలో నలభై శాతం యార్న్ సబ్సిడీని అమలు చేయగా..ప్రస్తుతం నేతన్న భరోసా పేరుతో ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికునికి రూ.6 వేల చొప్పున అమలు చేస్తోంది. అయితే ఇది గత సర్కారు అం దించిన ప్రోత్సాహం కంటే తక్కువే. వయస్సుతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తోంది ప్రస్తుత సర్కారు. ఈ పథకాలు కొంతవరకు తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చుతున్నా.. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగును నింపలేకపోతున్నాయి. శిక్షణ, అత్యాధునిక ఉత్పత్తులు, మార్కెటింగ్‌తో పాటు సంక్షేమాలు తోడైతేనే అభివృద్థి సాధ్యం. కానీ ఆ దిశగా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. 1990లో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన చేనేత శిక్షణా కేంద్రం స్వరాష్ట్రం తొలినాళ్లలోనే మూతపడింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ నిరుపయోగంగా మారింది. కేంద్రం చేనేత పరిశ్రమను గుర్తించే స్థితిలో లేదు. గతంలో క్లస్టర్ల ద్వారా డైయింగ్, వీవింగ్, తదితర అంశాల్లో శిక్షణలిచ్చేవారు. ఆయా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండేవి. తద్వారా లాభాల బాటలో చేనేత సహకార సం ఘాలు నడిచేవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఎత్తివేయడం వల్ల మూస పద్ధతిలో వస్త్రోత్పత్తులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం టెస్కో ద్వారా వస్త్రాల ఆర్డర్ ఇస్తేనే చేనేతల మనుగడ కొనసాగే దుస్థితిలోకి నెట్టివేయబడింది పరిశ్రమ.
కేంద్ర ప్రభుత్వ జాతీయ చేనేత పురస్కార్-2024కు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. మార్కెటింగ్ రంగంలో నరేంద్ర హ్యాండ్లూమ్ పేరుతో గజం నర్మద, యువ చేనేత విభాగం నుండి గూడ పవన్ గుర్తింపు దక్కించుకున్నారు. అయితే రాష్ట్రంలో ఇలాంటివారు అరుదు. గతంలో పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఎంతో నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులున్నప్పటికీ..కొద్ది ప్రాంతాల వరకే పరిమితమౌతోంది. మిగతా చోట్ల చేనేత పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితిలోకి నెట్టబడుతోంది. తెలంగాణలో చేనేత జౌళిశాఖ, టెస్కో పరిధిలో 400కు పైగా చేనేత సహకార సంఘాల్లో 17వేల మంది నేతన్నలు మరో 30 వేలమంది అనుబంధ కార్మికులున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయా కార్మికులకు శిక్షణ, ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ దిశగా కృషి జరిగితే..తెలంగాణ చేనేత బ్రాండ్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తుంది.
చిలగాని జనార్ధన్
8121938106