సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
రావిర్యాల భూములపై ఎర్రజెండా విజయం
ఫ్యాబ్ సిటీ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు
వచ్చే సోమవారమే రిజిస్ట్రేషన్లు
ఏ కారణం చేతనైనా తప్పించుకుంటే అక్కడే దీక్షలు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దీక్షకు దిగుతాడు
రావిరాలలో భూ నిర్వాసితుల విజయోత్సవ సభ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
పాలకులకు పరిశ్రమలపై ఉన్న ప్రేమ.. పేదలపై లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. 25 ఏండ్లుగా ఫ్యాబ్ సిటీ భూ నిర్వాసిత రైతులను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. చివరకు సీపీఐ(ఎం) నాయకత్వంలో పేదలకు ఇండ్ల స్థలాలు సాధించుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రావిర్యాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాబ్ సిటీ కోసం పేదల నుంచి 827 ఎకరాల భూమిని సేకరించిందని తెలిపారు. కానీ ఆ భూములను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. రైతులు కోల్పోయిన భూముల విలువ నేడు సుమారు ఎకరా రూ.20 కోట్ల వరకు పలుకుతుందని అన్నారు. కానీ 150 గజాల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కించిందని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరిగినా వారి సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. చివరికి సీపీఐ(ఎం) నాయకత్వంలో చేసిన దశల వారి ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన నిలబడి.. పేదలకు న్యాయం చేయగలిగామని అన్నారు.
ఫ్యాబ్ సిటీ భూముల విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయంటూ పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు కాలయాపన చేశాయని అన్నారు కానీ అవే భూములను పరిశ్రమలకు కేటాయిస్తూ రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని ఆధారాలతో ప్రభుత్వం ముందుంచడంతో చివరకు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తూ రిజిస్ట్రేషన్లు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ చేయనున్నారని చెప్పారు. సాధించుకున్న ఇండ్ల స్థలాల్లోనూ కనీస వసతుల కల్పన కోసం ఉద్యమించాల్సి ఉంటుందని తెలిపారు. ఏ కారణం చేతనైనా ప్రభుత్వం తప్పించుకుంటే.. అక్కడే దీక్షలు చేపడుతామని, తమ పార్టీ జిల్లా కార్యదర్శి దీక్షకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, కడిగళ్ల భాస్కర్, ఏర్పుల నరసింహ, దుబ్బాక రామచందర్, కే.జగన్, మహేశ్వరం మండల కార్యదర్శి శేఖర్, మండల నాయకులు రవి, భూ నిర్వాసిత నాయకులు గోదాస్ నర్సింహ, నగేష్, ప్రశాంత్, రాజు, అశోక్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలపై ఉన్న ప్రేమ.. పేదలపై ఏదీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



