Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ కాలుష్య నివారణపై చిత్తశుద్ధి ఏది?

ఢిల్లీ కాలుష్య నివారణపై చిత్తశుద్ధి ఏది?

- Advertisement -

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో ప్రజలకు తప్పని తిప్పలు
సగానికిపైనే ఖాళీలు…తూతూ మంత్రంగా నివారణ చర్యలు
ఈ పోస్టులపై పార్లమెంటులో పర్యావరణ శాఖా మంత్రి ప్రశ్నలు

న్యూఢిల్లీ : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజురోజుకూ కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు.. వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దేశ రాజధాని హస్తినలో ఇలాంటి దుస్థితి నెలకొన్నప్పటికీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియాగేట్‌ వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారుల్ని కటకటాల వెనక్కి నెట్టింది. గతంలోనూ ఢిల్లీలో నెలకొన్న కాలుష్యంపై అప్పటి ఆప్‌ సర్కార్‌పై దుందుడుకు చర్యలకు దిగిన బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఉన్నా ఒరిగిందేవిూ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య తీవ్రతతో అక్కడి బీజేపీ సర్కార్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హౌం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. వాస్తవానికి ఈ లోపాలను అధిగమించే చర్యలకు ససేమిరా అంటోంది. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ బోర్డులు, ఏజెన్సీలలో 45 శాతం కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో, కాలుష్య నియంత్రణ బోర్డులు, ఏజెన్సీలలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి పర్యావరణ శాఖ సహాయ మంత్రి పలు ప్రశ్నలను లేవనెత్తారు. సీపీసీబీలో 16 శాతం, ఎస్‌ పీసీబీలలో దాదాపు 48 శాతం, పీసీసీలలో 43 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ డేటా ప్రకారం.. కాలుష్య నియంత్రణ సంస్థలలో ( సీపీసీబీ, ఎస్‌ పీసీబీ , పీసీసీ) మంజూరు చేసినన 6,932 పోస్టులలో 3,161 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం భర్తీ కాని పోస్టులలో 45.6 శాతంగా ఉన్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)లో, మొత్తం 393 పోస్టులలో 64 ఖాళీలు ఉన్నాయి. ఇది 16.3 శాతం కొరతను సూచిస్తుంది. వాయు నాణ్యత అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (ఎస్‌ పీసీబీ) మంజూరు చేసిన 6,137 స్థానాల్లో 2,921 ఖాళీలను కలిగి ఉన్నాయి. ఇది దాదాపు 48 శాతం సిబ్బంది కొరతను సూచిస్తుంది. కాలుష్య నియంత్రణ కమిటీలు (పీసీసీ) మొత్తం 402 స్థానాల్లో 176 ఖాళీలను కలిగి ఉన్నాయి. మార్చ్‌ డేటా ప్రకారం.. ఢిల్లీలో మంజూరు చేయబడిన 344 స్థానాల్లో 153 ఖాళీలు ఉండగా, రాజస్థాన్‌లో 808 స్థానాల్లో 488 ఖాళీలు ఉన్నాయి.

సుప్రీం హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిస్పందన…
మే 19న..ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనందుకు సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. ధిక్కార చర్యలకు పాల్పడుతుందని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్‌ నాటికి ఖాళీలను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించింది. నవంబర్‌ 17న.. ఢిల్లీ ప్రభుత్వం 52 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానీ మే నెలలో డీపీసీసీలో మొత్తం 344 పోస్టులు ఉన్నాయని, వాటిలో 189 ఖాళీగా ఉన్నాయని సీపీసీబీ నివేదించింది.

నియామకాలు లేకపోవడానికి కారణాలు?
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ బోర్డులకు నియామకాలు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం జులై 28న పార్లమెంటుకు తెలియజేసింది. వీటిలో చట్టపరమైన అడ్డంకులు, సాంకేతిక సమస్యలు, సిబ్బంది విధానాలు, రిజర్వేషన్‌ జాబితాలు, పోస్టుల అప్‌గ్రేడ్‌, కోర్టు కేసులు, మోడల్‌ ప్రవర్తనా నియమావళి, కొత్తగా ఎంపికైన అభ్యర్థులు చేరకపోవడం వంటివి ఉన్నాయి. నియామకాలకు తగిన అభ్యర్థులు లేకపోవడం లేదా దరఖాస్తులు లేకపోవడం కూడా ఒక కారణమని ప్రభుత్వం పేర్కొంది.

పరిష్కారం ఎలా ?
గత రెండు సమావేశాల్లోనూ ప్రభుత్వం పార్లమెంటులో ఇదే సమాధానాన్ని పునరావృతం చేసింది. కాలుష్య పర్యవేక్షణ, నియంత్రణ సంస్థలలో సగం స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా అనేక రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారు? ఈ తీవ్రమైన సిబ్బంది కొరత అట్టడుగు స్థాయిలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలను నేరుగా దెబ్బతీస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -