Monday, March 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచేతివృత్తులకు చేయూత ఏది?

చేతివృత్తులకు చేయూత ఏది?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది చేతివృత్తులు చేస్తున్నారు. ప్రధానంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఈ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి వృత్తిలో ఆధునీకరణ తీసుకురావడం, ఉపాధి మెరుగుపరచడం కోసం రాష్ట్రంలో వృత్తుల ప్రాతిపదికన పదకొండు కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌లు కల్లుగీత, రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, ఉప్పర, కృష్ణబలిజ, వాల్మీకి బోయ, బట్రాజతో పాటు సంచార జాతుల వారికి ఎంబీసీ కార్పొరేషన్లు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కుల ప్రాతిపదికన మరొక తొమ్మిది కార్పొరేషన్లు పెరిక, ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేర గంగపుత్ర, లింగాయత్‌, ఈ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. జాతీయస్థాయిలో ఫిషరీస్‌, గొర్రెలు మేకల పెంపకం, చేనేత సహకార ఫెడరేషన్‌లు ఉన్నాయి. వీటిని ఏ ఉద్దేశం, లక్ష్యంతో ఏర్పాటు చేశారో అది మాత్రం ఆచరణలో అమలు కావడం లేదు. ఎన్నికల సందర్భంగా ఈ తరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రం రాజకీయ పార్టీలకు బాగా ఉపయోగపడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసింది. కానీ, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లలో కల్లుగీత సహకార సంస్థకు 68 కోట్లు, మిగతా 19 సహకార సంస్థలకు 50 కోట్ల చొప్పున కేవలం 1018 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌ కు 400 కోట్లు మాత్రమే కేటాయించింది. నామమాత్రపు బడ్జెట్‌ కేటాయింపులు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ఆ కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయడం లేదు.వృత్తిదారుల ఉపాధి మెరుగుపరుచుటకు, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు.

ఇటీవల వృత్తి సంఘాల నేతలం రాష్ట్ర కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌లు సందర్శించాం. ఒక్క కల్లుగీత కార్పొరేషన్‌కు మాత్రమే 17 కోట్లు విడుదలైనట్లు తెలిసింది. మిగతా 51 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మిగతా సంస్థలకు ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు. మరొక 15 రోజులలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. బడ్జెట్‌ కేటాయింపులే తక్కువ చేశారు. అవి కూడా ఖర్చు చేయకపోవడం చూస్తే వృత్తిదారుల పట్ల ప్రభుత్వ వైఖరి అర్ధం చేసుకోవచ్చు. డబ్బులు లేకపోవడంతో ఆఫీసులో సిబ్బంది ప్రభుత్వ ఖజానా వైపు ఎదురుచూస్తున్నారు. ఎంతో కొంత ఏమైనా సహకారం అందుతుందేమోనని ఆఫీసుల చుట్టూ వృత్తిదారులు తిరుగుతున్నారు.

ఉత్పత్తి వృత్తులు చేసేవారు నేత, గీత, మత్స్య, గొర్రెలు మేకలు పెంపకం, ఇనుము, కలప, ఇత్తడి, బంగారం, అల్లికలు, దూదేకుట, రాళ్లు కొట్టడం, కుండలు, మేదర, టైలరింగ్‌ ఉన్నారు. సేవా వృత్తులు చేసేవారు రజక, క్షౌర, సాంస్కృతిక వృత్తులు చేసేవారు ఒగ్గు కథ, మంద హెచ్చులు, దుబ్బుల కొలుపు, వాయిద్య కళాకారులు, పడపోత్ర, గంగిరెద్దుల, జెట్టి, ఏసూటి, సంచార జాతులు ఎంబీసీలు తదితరులు నేటికి గణీనీయమైన సంఖ్యలో ఉన్నారు. వృత్తుల్లోకి బడా పెట్టుబడిదారులు ప్రవేశించడంతో వ్యాపారంగా మారి వృత్తిదారులు వారి కింద జీతాలు తీసుకొని పనిచేసే కార్మికులుగా మారిపోతున్నారు. చేనేత, స్వర్ణకారులు ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు.

లిక్కర్‌ శీతల పానీయాల దాటికి కల్లుగీత వృత్తి మరింతగా దెబ్బతింటున్నది. రజక, క్షౌర లాంటి సేవావృత్తులు యాంత్రీకరణ వల్ల ఆదాయం కోల్పోతున్నారు. పెత్తందారుల చేత కులవివక్ష, అవమానాలు, సాంఘీక బహిష్కరణలకు, దాడులు, దౌర్జన్యాలకు, హత్యలకు గురవుతున్నారు. మత్స్య సంపద రియల్‌ ఎస్టెట్‌, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వలన చెరువులు, కుంటలు, జలవనరులు కబ్జాలు కాలుష్యానికి గురవుతున్నాయి. గొర్రెలు, మేకలు పెంపకం వృత్తిలోకి పెట్లుబడిదారులు ప్రవేశిస్తున్నారు. వైద్యం, మేత సరిపడా ప్రభుత్వం అందించలేకపోతుంది. వడ్డెర, వడ్రంగి, ఇనుము పని, బంగారం, ఇత్తడి, శిల్పాలు చెక్కుట, దూదేకుల, కుమ్మరి, దాసరి, సగర, ఉప్పర, బట్రాజులు, బోయ, పూసల,

మేదర, టైలర్‌ వీరితో పాటు బ్యాండు, వాయిద్య, ఒగ్గు, మంద హెచ్చుల, దుబ్బుల కొలుపు, పడపోత్ర, గంగిరెద్దుల, జెట్టి, ఏనూటి తదితర సాంస్కృతిక వృత్తులవారు వృత్తిలో బతకలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ఆచరణలో ఖర్చు చేయడం లేదు. ఆ సంవత్సరం ఖర్చు కాకపోతే తదుపరి బడ్జెట్‌లో వాటిని కలిపి ఖర్చు చేసే విధంగా బీసీ సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలి. వృత్తి చేసేవారి ఉపాధి భద్రతకు, సామాజిక రక్షణకు, చిత్తశుద్ధితో పని చేయాలి. 2026-27 బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలి. వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ వర్గీకరించి అమలు చేయాలి.

యం.వి.రమణ 9490098485

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -