Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసోపతిప్రతిభకు గుర్తింపు లేనిచోట...

ప్రతిభకు గుర్తింపు లేనిచోట…

- Advertisement -

మీరు ఎక్కడో చోట పెద్దదో, చిన్నపాటి ఉద్యోగమో చేస్తున్నారు. ఎంతటి ప్రతిభావంతులైనా మారుతున్న కాలం కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతే మిమ్మల్ని వదిలించుకోవాలని మీ పై అధికారి ప్రయత్నం చేస్తారు. అలా అని మీరు అక్కడే ఉండాలని చూస్తే మిమ్మల్ని గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీ ఉద్యోగం పట్ల మీకు ఎంతటి క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యం వున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా మీ వైఖరులు, అలవాట్లు మార్చుకోకపోతే మిమ్మల్ని కచ్చితంగా ఉద్యోగం నుండి తొలగిస్తారు. వారు తొలగించేలోగే మీరు హుందాగా అక్కడి నుండి బయటపడి మీ గౌరవాన్ని కాపాడుకొని, మరోచోట ఉద్యోగంలో చేరటం ఉత్తమం. లేనిపక్షంలో ఏం జరుగుతుందో ఈ చిన్న కథను చదవండి.

ఒక కిరాణాషాపువాడు తన షాపు కట్టేసే సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో కిరాణా సామాను చిట్టీి, డబ్బులు ఉన్నాయి. అది చూసిన షాపు యజమాని ఆశ్చర్యపడుతూ ఆ సరుకుల లిస్టు తీసుకొని వాటన్నింటిని ఒక సంచిలో ప్యాక్‌ చేసి ఇస్తాడు. ఆ సంచిని నోట్లో పెట్టుకొని కుక్క మళ్ళీ పరుగెత్తడం ప్రారంభించింది. అది చూసిన షాపు అతను అసలు ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందోనని దానిని అనుసరిస్తాడు. కుక్క చక్కగా, క్రమశిక్షణతో వెళ్తు రోడ్డుదాటే క్రమంలో ట్రాఫిక్‌ సిగల్‌ రెడ్‌ లైట్‌ను చూసి ఆగుతుంది. గ్రీన్‌ సిగల్‌ పడగానే మళ్ళీ రోడ్డు దాటుతుంది. బస్‌ స్టాప్‌ దగ్గరికి వెళ్ళి తను ఎక్కాల్సిన బస్సు వచ్చే వరకు నిరీక్షించి ఆ నెంబర్‌ బస్సురాగానే ఎక్కుతుంది. కూడా వెళ్తునటువంటి షాపువాడు ఇదంతా గమనిస్తూ ఇంకా ఆశ్చర్యపోతాడు. కుక్కలో ఇంత విశ్వాసాన్ని చూసి ముచ్చటపడతాడు. బస్‌ స్టాప్‌ వద్ద బస్సు ఆగగానే దిగి తన ఇంటికి వెళ్ళి, తీసుకొని వచ్చిన కిరాణ సంచిని మెట్ల దగ్గర పెట్టి తనకాలితో కాలింగ్‌ బెల్‌ నొక్కింది. ఇంట్లో నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పక్కన వున్న కిటికీ వద్దకు వెళ్ళి లోపలికి చూసి మళ్ళీ వచ్చి రెండోసారి కాలింగ్‌ బెల్‌ కొట్టింది. బెల్‌ శబ్దానికి నిద్రమత్తులో వున్న యజమాని వచ్చి తలపుతీసి కాలుతో కుక్కను రెండుసార్లు బలంగా తన్నుతాడు. అది చూసిన షాపు అతను షాక్‌కు గురై ఏంటి మీకేమైనా పిచ్చా. మీ దగ్గర పనిచేసే కుక్క ఇంత విశ్వాసంతో కిరాణ సామాను తెస్తే తన్నుతావా అంటూ మందలిస్తాడు.
దానికి సమాధానంగా ఇంటి యజమాని ఇది ఈ వారంలో రెండోసారి తప్పు చేసింది. వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళలేదు తన కుక్క బుద్ది చూయించింది అంటూ షాపు అతడికి సమాధానం చెప్తాడు.

దానికి షాపు అతడు మీకేమైనా మతిపోయిందా ఇలాంటి కుక్క సినిమా వారికి, కోటీశ్వరుల వద్ద వుంటే మీకు విలువ పెరుగుతుంది. దీనివల్ల మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అలాంటి దాన్ని కొడతావా అంటాడు. దానికి యజమాని ఈ కుక్క వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది నేను చెప్పినట్లు వినట్లేదు. చెప్పిన పని ఏరోజు సక్రమంగా చేయట్లేదని కుక్కను వదిలించుకొని లోపలికెళ్ళి తలుపు వేసుకున్నాడు.

చూశారా దీన్నిబట్టి మీకు ఏం అర్ధమైందో ఓసారి ఆలోచించండి. మీకు గుర్తింపు లేని దగ్గర అది మీ బంధువులు కావొచ్చు లేదా మీ యజమాని కావొచ్చు, మీ ఆఫీస్‌/ మీ చుట్టు పక్కల పరిసరాలు ఏవైనా కావొచ్చు. మీ స్నేహితులకు మీరు ఎంతగా మేలు చేసినా వాళ్ళు ఏరోజూ అర్ధం చేసుకోకుండా, మీ విలువను తక్కువచేసి చులకనగా అవమానంగా ప్రవర్తిస్తారో అలాంటి చోట మీరు ఎక్కువ కాలం వుంటే మీ విలువను కోల్పోయినట్లే. కాబట్టి అలాంటి చోట వుండే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి… మీపై అధికారికి మీరు నచ్చలేదంటే మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా అవి వధానే. ఇక్కడ కుక్కకి చాలా తెలివి తేటలు ఉన్నాయి. అది షాపువాడు గుర్తించాడు. కానీ దాని యజమాని గుర్తించలేకపోయాడు. అది అతడి దౌర్భాగ్యం. పైగా ఆ కుక్క కూడా వద్దన్నా అతడి వద్దనే ఉండటానికి ఇష్టపడుతుంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మీపై అధికారి కావొచ్చు, దగ్గరి బంధువులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు… మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోండి. మీ అవసరం లేని చోట మాత్రం ఉండే ప్రయత్నం చేసి మీ విలువను తగ్గించుకోకండి. అందుకే అవసరం వున్నచోట వుంటే మీ విలువ పెరుగుతుంది. అవసరం లేని చోట మీ విలువ తగ్గుతుంది. వెన్నెల ఊర్లో కాస్తే అందరూ ఆస్వాదిస్తారు. అదే అడవిలో కాస్తే నిష్ప్రయోజనం. ఇప్పుడు మీరు ఏం చేయాలో అర్థమైంది కదా!

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad