కార్యకర్తలే మా పార్టీకి బలం
ప్రజాస్వామ్యంలో పైసలు ఎప్పుడు గెలువవు
ప్రజల మన్ననలు పొందితేనే విజయాలు సాధ్యం
దుద్దిళ్ల అరాచకాలను ఎండగట్టేలా చైతన్యం రావాలే
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – కాటారం
ప్రజాస్వామ్యదేశంలోఎప్పుడు పైసలే గెలుస్తాయనుకోవద్దని, డబ్బున్న ఎంతో మంది నాయకులు ఓటమిని చవిచూశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధన్న ఐదు వందలో వెయ్యో ఇస్తే గెలిచేవాడని అనేక మంది తనతో అంటుంటారని, కానీ ఎప్పుడు అలా పైసలు గెలువయని అన్నారు. మంథని నియోజకవర్గంలో మాత్రం అందుకు బిన్నంగా జరుగుతున్న తీరుపై ఆలోచన చేయాలన్నారు. ప్రజలను ప్రేమించాలని, వాళ్లతో ప్రేమించబడితే పైసలు లేకున్నా విజయం సాధించగలమని అన్నారు.
అందుకు గ్రామపంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. పదేండ్లు అధికారంలో లేకపోయినా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద కోట్ల మేర ఖర్చు చేశారని, రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్నివేల కోట్లు ఖర్చు చేస్తాడో ఊహించుకోవాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నాలుగు కంపెనీలు పెట్టి తన తమ్ముడిని కలెక్షన్ ఏజెంట్ గా పెట్టుకున్నాడన్నారు. వాళ్లు స్థానికంగా వ్యాపారాలు చేయరని, ఇండ్లు కట్టుకోరని, సింపుల్ ఉంటూ పై నుంచి డబ్బుల సంచులు తెచ్చుకుంటారని అన్నారు.
గతంలో శ్రీపాదరావు సైతం మనోళ్ల కంటే ఆంద్రోళ్లకే ఎక్కువ పని చేస్తారని చెబుతుండేవారని ఆయన గుర్తుచేశారు. తనది ఓటు, పదవితో సంబంధం కాదని, ప్రజలతో పేగుబంధమేనని, ఆ బంధంతోనే ఇరువై ఏండ్లుగా మీతో ఉంటున్నానని అన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ అరాచకాలను ఎండగట్టడంతో మనం విఫలం అవుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యం అయ్యే వరకు తన పోరాటం ఆగదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని , మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ , కాటారం సర్పంచ్ పంతకాని సడువలి, బీ ఆర్ ఎస్ నాయకులు జక్కు రాకేష్, ప్రతాపగిరి సర్పంచ్ వురా వెంకటేశ్వర్ రావు, ఓడిపిలవంచ సర్పంచ్ నరివేద్ది మాధవి, కాటారం ఉపసర్పంచ్ కొండగొర్ల బాణయ్య, జక్కు శ్రావణ్, మానేం రాజబాపు, తదితరులు పాల్గొన్నారు.



