రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతానని 2020 సెప్టెంబర్ 9న ఆర్డినెన్స్ ద్వారా బీ(టీ)ఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈచట్టాన్ని 2020 సెప్టెంబర్ 19 నుండి అమలు చేసింది. మొత్తం 18 సెక్షన్స్‌తో తెచ్చిన చట్టం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పింది. వాస్తవంలో 33 లోపాలతో 13 లక్షల మంది రైతులు పాసు పుస్తకాలు లేకుండా 2020 నుండి కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి మాజీ మంత్రి హరీష్‌రావు నాయకత్వాన వేసిన క్యాబి నెట్ సబ్‌కమిటీ కూడా లోపాలను అంగీకరించింది. భూ రిజిష్టరీ కాకుండా పార్ట్-బిలో 18.45 లక్షల ఎకరాల భూమిని 22-ఎ రిజిష్టర్‌లో నమోదు చేసి క్రయ, విక్రయాలు నిషేధించారు. అంతేకాక పట్టాదారు పేరులోపాలు, సర్వేనెంబర్ లోపాలు, భూ విస్తీర్ణం తదితర లోపాలతో 9.5లక్షల మంది దర ఖాస్తులు చేసుకున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోపాలన్నింటిని సరిచేయడానికి ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో తొక్కి ”భూభారతి చట్టాన్ని” తెచ్చి భూ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాని ఫెస్టోలో వాగ్ధానం చేసింది. 9డిసెంబర్2023న అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ఆలస్యంగానైనా 18 డిసెంబర్ 2024న భూభారతి చట్టాన్ని ఆర్‌ఓఆర్- 2024 చట్టంగా శాసన సభలో ప్రవేశపెట్టి అమోదం పొందింది. భూ భారతిలో 23 సెక్షన్‌లు న్నాయి.గత ధరణిలోని కొన్ని లోపాలను మాత్రమే సరి చేసింది.04 జనవరి 2025న చట్టం గెజిట్ పబ్లికేషన్ తర్వాత 14ఏప్రిల్ 2025న పందొమ్మిది అంశాలతో భూభారతికి రూల్స్ అమోదించారు. భూభారతి వల్ల సమస్యలు ఉన్నవారు ఒక్క రూపాయి చెల్లించకుండా తప్పొప్పులను సరిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పదేపదే సమావేశాలల్లో చెప్పారు. కానీ, ధరణిని, భూభారతిని, దాని నిబంధనల్ని లోతుగా విశ్లేషిస్తే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తున్నది.
ధరణిలోనూ, భూభారతి చట్టంలోనూ కొన్ని అంశాలు ఒకే విధంగా ఉన్నాయి. సాదాబైనామాల పట్టాలు, కౌలుదారుల నమోదు యెడల వైఖరి, మ్యూటేషన్ మార్పుల సందర్భంగా ఉన్న అంశాలు ఒకేలా ఉన్నాయి. సాదా బైనామాలకు సంబంధించి 02జూన్2014కు ముందు పన్నెండేండ్లకు పైగా స్వాధీనంలో ఉన్నట్లు రుజువు చేస్తూ చిన్న, సన్న కారు రైతులు 12అక్టోబర్ 2020 నుండి 10నవంబర్ 2020 మధ్యకాలంలో దరఖాస్తులు చేసుకున్న వారు మాత్రమే ఆర్‌ఓఆర్ చట్టం మార్చడానికి అరులౌతారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో సాదాబైనామాల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు. 9.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో 70శాతం మంది అనర్హులవుతారు. భూమి క్రయ, విక్రయాల సందర్భంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గతంలో లాగే స్లాట్ బుక్ చేయాలి. ఒకసారి బుక్ చేసి రిజిస్ట్రీ కాకపోతే, రెండోసారి బుక్ చేసినప్పుడు రూ.500, మూడోసారి బుక్ చేస్తే రూ.1000 షెడ్యూల్డ్ స్లాట్ ఫీజు చెల్లించాలి. అధికారుల లోపాల వల్ల రిజిస్టరీ కాకపోయినా రైతులు ఫీజు చెల్లించాల్సిందే.వారసత్వ రిజిస్ట్రేషన్‌కు భాగస్వాముల ”పరిష్కారపత్రం” సరిపోతుందని భూ భారతిలో చెప్పారు. కానీ, రూల్స్‌లో వారసత్వ మ్యుటేషన్‌కు ఎకరాకు రూ.2500 ఫీజు చెల్లించాలి. (గుంటకు రూ.62.50 పైసలు) పదెకరాల కుటుంబం రూ.25వేలు మ్యుటేషన్ ఫీజుకింద కట్టాలి. పరోక్షంగా రిజిస్ట్రేషన్ ఫీజుకన్నా ఇది ఎక్కువే.రెవెన్యూ రికార్డుల్లో జరిగిన సవరణలకు ప్రతి సవరణకు రూ.1000 ఫీజు చెల్లించాలి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దరఖాస్తుకు రూ.1650 4.5లక్షల మంది వద్ద ‘మీసేవా’ కేంద్రాల ద్వారా వసూలు చేసి రికార్డులు సరిచేయలేదు. ఇప్పుడు కూడా ప్రతి ధరఖాస్తుదారు రూ.1000 చెల్లించాలని రూల్స్‌లో చెప్పారు.ఇది పేద రైతులకు కష్టతరంగా మారనుంది.
పట్టాదారు పాసుపుస్తకం పోయినచో రూ.300 ఫీజు చెల్లించాలి. పేరు, సర్వే నెంబర్ల సవరణ, డిజిటల్ సంతకం సవరణ ఆ సమస్యకు సంబంధించిన భూమి మార్కెట్ విలువ రూ.5లక్షల లోపు అయినచో ఆర్‌డిఓకు, రూ.5లక్షలు దాటినచో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం భూముల ధరలు 75శాతం రూ.5 లక్షలకు పైన విలువ గలిగిన తగాదాలున్నాయి. ఇవన్నీ పరిష్కారానికి కలెక్టర్ దగ్గరకు వెళ్లాలి. రెవెన్యూ కోర్టులను (తహశీల్దార్, ఆర్‌డిఓ, కలెక్టర్) పునరుద్ధరిస్తున్నామని చెబుతూనే బాధ్యతలన్నీ కలెక్టర్‌పైన పెడితే, అందరూ కలెక్టర్ దగ్గరకు వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అసైన్డ్ భూమి పేరు సవరణకు, ఇండ్ల స్థలాల పట్టాలకు కలెక్టర్ మాత్రమే సవరణ చేసే అధికారం రూల్స్‌లో పొందుపరిచారు. రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయడం తహశీల్దార్‌పై, ఆర్‌డిఓకు, ఆర్‌డిఓపై కలెక్టర్‌కు, కలెక్టర్‌పై, ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవడానికి రూల్స్‌లో 14వ అంశం చెప్పినప్పటికీ తహశీల్దార్, ఆర్‌డిఓ గత హక్కులన్ని కలెక్టర్ వద్ద కేంద్రీకరింపచేశారు.
కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది.ఇంతవరకు లక్షల మంది ఎదురుచూస్తున్న భూ సమస్యల పరిష్కారం చూపకపోగా, పరోక్షంగా అధికార కేంద్రీకరణ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రజా పాలనలో 1.30 కోట్ల దరఖాస్తులలో 70 శాతం దరఖాస్తులు భూములకు సంబంధిం చినవే. వీటిని పరిష్కరించ డానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత మార్చి 1నుండి 20 వరకు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తీర్మానాలు రాసింది. కానీ, నేటికీ అవి రికార్డు రూపంలో అమలు జరగ లేదు.గ్రామాల్లో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అబాది (గ్రామ కంఠం) భూముల రికార్డులు విడివిడిగా రాయాలని అదేశించడం సరైనదే. కానీ, ఇంత వరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నిర్ణయం జరగలేదు. భూధార్ కార్డులు ఇవ్వడానికి సర్వే నిర్వహిస్తామని, ప్రస్తుతం ”తాత్కాలిక భూధార్ కార్డు” ఇస్తామని తర్వాత శాశ్వత కార్డు ఇస్తామని రూల్స్‌లో చెప్పారు. దీని ప్రకారం భూములను డిజిటల్ సర్వే చేయాలి. అంటే శాశ్వత సిబ్బంది తగినంతమంది ఉండాలి. లైసెన్స్‌డ్ సర్వేయర్‌ల ద్వారా పరిష్కారం కాదు. ఈరూల్స్‌లో అత్యంత తీవ్రమైన అంశం పరిష్కారం కాని కేసులను సివిల్ కోర్టుకు పంపించాలని 13వ అంశంలో చెప్పారు. రెవెన్యూ కోర్టులు ప్రస్తుతం ఉన్న కేసులను పరిష్కరించాలి.
తప్పులు చేసిన అధికారులపై కేసులు పెట్టరాదని చెబుతూనే, మరో అంశంలో తప్పుడు రికార్డులు రాసిన వారిపై కేసులు పెట్టాలని, ఆ కేసులను ”భారతీయ శిక్ష అధీనియం” 2023లోని సెక్షన్ 75 ప్రకారం శిక్షించాలని భూభారతి కొత్త చట్టంలో ఉంది.దాన్ని త్వరితగతిన అమలు చేయాలి. గతం నుండి సమస్యల పరిష్కారానికి రైతాంగం పోరాటాలు, ఆందోళనలు జరుపుతున్నా నేటి ప్రభుత్వం కూడా పాక్షికంగానే పరిష్కరించింది. చట్టాలకు లొసుగులు పెట్టడం స్వాతంత్య్ర పూర్వం నుండి జరుగుతున్నదే, నేటికీ అది కొనసాగుతునే ఉంది. సమగ్ర భూ సర్వే జరగకుండా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు జరిపి సాదాబైనామాల పట్టాలు, కౌలుదారుల హక్కులు, ఎలాంటి లొసుగులు లేకుండా వారసత్వ పట్టాల మార్పిడి చేయాలి. తహశీల్దార్, రెవెన్యూ కోర్టుల్లోనే ప్రాథమిక పరిష్కారాలు జరిగేటట్లు రూల్స్‌ను సవరించాలి. లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ శాఖల కింద ఉన్న భూములను రెవెన్యూ శాఖలోకి మార్చి సమస్యల్ని పరిష్కరించాలి. లేదంటే ధరణిలాగే ఇది కూడా రైతు సమస్యలు పరిష్కరించని చట్టంగా చరిత్రలో మిగిలిపోతుంది. అలా కాకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌దే.
టి సాగర్
9490098055
‘భూభారతి’ భూసమస్యలన్నీ పరిష్కరిస్తుందా?
- Advertisement -
RELATED ARTICLES