Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవారికి ఇష్టమున్నా లేకున్నా స్వాధీనమే

వారికి ఇష్టమున్నా లేకున్నా స్వాధీనమే

- Advertisement -

గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్‌
లేకుంటే రష్యా లేదా చైనా దానిని ఆక్రమిస్తాయని వ్యాఖ్య

వాషింగ్టన్‌ : గ్రీన్‌ల్యాండ్‌కు ఇష్టమున్నా లేకున్నా దానిపై ఏదో ఒక చర్య తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఆ పని చేయకపోతే రష్యా లేదా చైనా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించుకుంటాయని చెప్పారు. ఆ దేశాలు పొరుగువారిగా ఉండడం తనకు ఇష్టం లేదని తెలిపారు. శ్వేతసౌధంలో శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, చమురు ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైన సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను డెన్మార్క్‌కు పెద్ద అభిమానినని, కాబట్టి సులభమైన పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ‘నేను ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను. మీకు సులభమైన పద్ధతి తెలుసు. అయితే సులభమైన పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకోలేకపోతే కఠినమైన పద్ధతిలో ఆ పని పూర్తి చేస్తాం’ అని అన్నారు.

కాగా రుబియోతో చర్చలు జరిపే విషయంలో చొరవ చూపుతామని గ్రీన్‌లాండ్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ మాజ్‌ఫెల్డ్‌ చెప్పారు. ‘మాకు మేముగా అమెరికాతో చర్చలు జరిపితే తప్పేముంది? డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాలకు ఉమ్మడి విలువలు, విధానాలు ఉన్నాయి. వాటికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. డెన్మార్క్‌ విదేశాంగ మంత్రి లేకుండానే అమెరికాతో చర్చలు జరుపుతారా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. ఉమ్మడిగానే చర్చలు జరుగుతాయని అన్నారు. ‘రాజ్య హోదా కోసం గ్రీన్‌ల్యాండ్‌ ప్రయత్నిస్తోంది. అందు కోసం సొంత విదేశాంగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా దానిని రూపొందిం చుకోలేదు. అప్పటి వరకూ కొన్ని చట్టాలను అనుసరించాల్సి ఉంటుంది’ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -