అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు
నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం : పాకిస్తాన్
హార్ముజ్‌ను తెరిచేందుకు ఇతర దేశాల సాయం : ట్రంప్
కొలిక్కిరాని ఇరాన్ ఆస్తుల విడుదల అంశం
వాషింగ్టన్, టెహ్రాన్, ఇస్లామాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధానికి స్వస్తి చెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ కేంద్రంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య ఇస్లామాబాద్‌లోని సెరెని హోటల్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. అయితే చర్చలు ఏ రీతిలో జరుగుతున్నాయనేది అస్పష్టంగానే ఉంది. ఇరు పక్షాలు ముఖాముఖి భేటీ అయ్యాయా లేక పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సందేశాల మార్పిడే కొనసాగుతోందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఇరు బృందాలు వేదిక వద్దకు చేరుకున్నాయి. పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం, అమెరికా బృందం చర్చల్లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి.వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో శనివారం విడిగా చర్చలు జరిపారు. వైట్‌హౌస్, పాక్ ప్రధాని కార్యాలయం రెండూ ఈ విషయాన్ని నిర్ధారించాయి. అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నార్, ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
పశ్చిమాసియాలో శాశ్వత శాంతి దిశగా ఈ చర్చలు ఒక ముందడుగు అని ప్రధాని షరీఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ సీనియర్ అధికారుల బృందం కూడా పాక్ ప్రధానితో విడిగా భేటీ అయింది. అమెరికాతో గతంలో చర్చల అనుభవాలు బట్టి చూస్తే తమకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించింది. శాంతి చర్చల్లో ఇరు పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించగలవని ఆశిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దర్ శనివారం వ్యాఖ్యానించారు. లెబనాన్ విషయంలో ఒప్పందం కుదరాలని ఇరాన్ పట్టుబడుతోంది. అలాగే ఈ చర్చలకు ముందుగానే విదేశాల్లోని తమ ఆస్తులపై గల ప్రతిష్టంభనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా, అమెరి కాతో ఆటలాడవద్దని ఆ దేశ ఉపాధ్యక్షుడు వాన్స్ శుక్రవారం ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ సహకారం ఉన్నా లేకపోయినా హార్ముజ్‌ను తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణు బాంబును తయారు చేయకుండా నిలువరించడమే ఇస్లామాబాద్ చర్చల్లో ప్రాధాన్యత గల అంశమని స్పష్టం చేశారు.
త్వరలోనే హార్ముజ్‌ను తెరుస్తాం : ట్రంప్
త్వరలోనే హార్ముజ్‌ను తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అదేమీ అంత సులభ మైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఎలా తెరుస్తామనే విషయంలో మాత్రం అంతకుమించి వివరాలేమీ వెల్లడించ లేదు. విలేకర్లతో మాట్లా డుతూ… ఈ దిశగా ఇతర దేశాలు కూడా సాయమంది స్తున్నాయని ట్రంప్ అన్నారు. అయితే ఆ దేశాల పేర్లు ఆయన వెల్లడించలేదు. ‘హార్ముజ్‌ను ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి కదా, అందువల్ల అవి కూడా ముందుకు రావాలని అనుకుంటున్నాను, వారు వస్తున్నారు కూడా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
లెబనాన్‌లో 10 మంది మృతి
దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ముగ్గురు ఎమర్జన్సీ వర్కర్లతో సహా 10మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. డజనుకుపైగా ప్రాంతాల్లో దాడులు సాగాయని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఎమర్జన్సీ వర్కర్లను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయిల్ ఒక పద్ధతి ప్రకారం దాడులు జరుపుతోందని ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మృతి చెందినవారిలో పౌరరక్షణ దళానికి చెందిన సభ్యుడు, ఇద్దరా పారా మెడికల్ సిబ్బంది ఉన్నారని తెలిపాయి.
ఆస్తుల స్తంభనపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఖతార్, ఇతర విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ సీనియర్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ చర్యపై ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా సీరియస్‌నెస్‌కు సూచనగా ఇరాన్ స్వాగతించింది. అయితే అమెరికా ఇంతవరకు దీనిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ పేరు చెప్పడానికి ఇష్టపడని వైట్‌హౌస్ సీనియర్ అధికారి మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పారు. ఆస్తుల విడుదలకు ఎలాంటి అంగీకారమూ కుదరలేదన్నారు. హార్ముజ్‌లో నౌకలు సురక్షితంగా సాగడంతో ఈ ఆస్తుల స్తంభన రద్దు నిర్ణయం ముడిపడి ఉందని చెప్పారు.



