చట్టాలు, న్యాయస్థానాలు ఎండమావులే, సామాన్యులకు అవి ‘నేతి బీరలో నెయ్యి చందమే’ అని మరోసారి రుజువైంది. పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ”దేశంలో ఏ హిందువు ఉగ్రవాది కాదు” అంటూ ప్రకటన చేసిన మరుసటి రోజే ఇలాంటి తీర్పు రావటంపలు అనుమానాలకు తావిస్తున్నది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న మసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు అమా యకుల మరణానికి, వందమంది గాయపడిన కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక న్యాయస్థానం 31 జూలై 2005న ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశను మిగిల్చింది. దుర్ఘటన జరిగిన పదిహేడేండ్ల తర్వాత సాక్ష్యాలు లేవంటూ ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద న్యాయస్థానం నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఇది ధర్మం కాదు. మాజీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, నాటి ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహితులతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించటం న్యాయాన్ని అపహస్యం చేయటమే! మరి ఈ నరమేధంలో దోషులెవరు?
రంజాన్ మాసంలో ప్రార్థనలు జరుగుతున్నా ఒక మసీదు ఎదుట పేలుడు సంభవించి ఆరుగురి మరణానికి, వందకు పైగా గాయపడటానికి కారకులెవరు? ఎవరు బాధ్యులు కారని చివరకు తేల్చి, కేసును కంచికి చేర్చారు .మొదట మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. ప్రజ్ఞ ఠాకూర్ సహా పదహారు మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అప్పటి ఎటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే సమర్థవంతంగా విచారణ చేపట్టాడు మంచి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. చార్జి సీటులో’ ‘అభినవ భారత్’ స్థాపకురాలైన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, పురోహిత్ కుట్రను విచారిస్తూ తీవ్ర ఆరోపణలు ఎటిఎస్ వీరిపై చేసింది. ఈ దశలో హేమంత్ కర్కరే ముంబాయి ఉగ్ర దాడిలో టెర్రరిస్టుల చేతుల్లో చనిపోయాడు. ఈయన మరణం అంతుచిక్కని మిస్టరీగా ఉంది. మాలేగావ్ కుట్రను శోధించి, ఛేదించినా హేమంత్ కర్కరేను ఆమె తీవ్రంగా దూషించారు. తన శాపం వల్లే ఈయన మరణించాడని 2019 లోక్‌సభ ఎన్నికల్లో భూపాల్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వాఖ్యానించారు. 2011లో ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి బదిలీ చేశారు. ఈ కేసులో సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ ప్రజ్ఞ సింగ్ ఠాకూర్‌తో సహా మరికొందరికి 2016లో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుల పట్ల మెతకగా, సానుభూతితో వ్యవహరించాలని తనను ఎన్‌ఐఏ ఒత్తిడి చేస్తున్నదని ఆరోపిస్తూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ పక్కకు తప్పుకున్నారు. దర్యాప్తు సంస్థల మార్పు, 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసును ఐదుగురు జడ్జీలు విచారణ జరపడం గమనార్హం. చివరకు ఇలా తేలిపోవడం విషాదం.
వడ్ల గింజలోదే బియ్యపు గింజ అని రుజువైంది. అదే నిందితులు వేరే మతస్తులు అయితే కథ మరొకరకంగా ఉంటుంది. అనేక సంఘటనల్లో ముస్లిం ప్రజలనే టార్గెట్ చేశారు. ముస్లింలనే అరెస్టు చేసి, జైల్లో నిర్బంధిస్తున్నారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకున్నా అరెస్టులు చేసి వారి మీద టాడా, పోటా,ఉపా వంటి భయంకర చట్టాలు ప్రయోగించింది జైళ్లలో మగ్గేటట్లు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రొఫెసర్ సాయిబాబా, స్టాన్ స్వామి, ఉమర్ ఖాలీద్‌లను చెప్పుకోవచ్చు. ఖైదీలలో మెజారిటీగా ముస్లింలు, దళితులు, బీసీలు, ఆదివాసీలు, వామపక్ష భావాజాలం గల ప్రగతి శీలురు బాధితులుగా ఉన్నారు. అనేక కేసుల్లో చట్టం ముందు అందరూ సమానం కాదని నిరూపించ బడింది. మన దేశంలోని ఖైదీలలో 30శాతం పైగా ముస్లింలు ఉన్నారని, ఇది దేశ జనాభాలో ముస్లిం జనాభాకు రెండింతలు ఎక్కువ అని జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ ఘటనలో ఆరుగురిని చంపి, 100 మందిని ఎవరు గాయపరిచారు…? ఇది సమాధానం దొరకని ప్రశ్న కాకూడదు. దోషులు ఎవరైనా, ఏ మతం వారైనా వారికి శిక్ష పడాలి. ఉగ్రవాదానికి మతం లేదు. మతంతో సంబంధం లేదు. దోషులకు తగిన శిక్ష ఉంటేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎన్‌ఐఎ కోర్టు నిర్ణయాన్ని తిరిగి విచారించా ల్సిందిగా సుప్రీంకోర్టుగా అప్పిల్ చేయాలి.
– షేక్ కరీముల్లా, 9705450705
మాలేగావ్ నరమేధంలో దోషులెవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES