ఆశలు, ఆందోళనలు, వివాదాలు
ఏఐ సదస్సులో పనిచేయని ఇంటర్నెట్
చేతులు కలపని సీఈఓలు
చైనా రోబో వివాదంతో అంతర్జాతీయంగా విమర్శలు
పలు ఆవిష్కరణలకు కుదిరిన ఒప్పందాలు
న్యూఢిల్లీ : భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026 ఆశలు, ఆందోళనలు, వివాదాల మధ్య ముగిసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో భారత్ తన నాయకత్వాన్ని చాటుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సమ్మిట్, నిర్వహణ లోపాలు, ప్రముఖుల గైర్హాజరు, ఏఐ వల్ల తలెత్తే సామాజిక సవాళ్లపై లోతైన చర్చల కొరత వంటి అంశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాలే సమ్మిట్ చర్చలకు ప్రధానాంశంగా మారాయి. అయితే ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసెల్వా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ నాయకే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, తదితర దేశ నాయకులు ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై 88 దేశాలు సంతకాలు చేశాయని, 250 బిలియన్ల డాలర్ల పెట్టుబడులకు హామీలు వచ్చాయని, ఈ శిఖరాగ్ర సదస్సులో దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
చుట్టుముట్టిన వివాదాలు, నిర్వహణా లోపాలు
సమ్మిట్ ప్రారంభం నుంచే పలు వివాదాలు, నిర్వహణా లోపాలు దీని ప్రతిష్టను దెబ్బతీశాయి. భారత్ మండపంలో జరిగిన ఈ సమ్మిట్‌లో మొదటిరోజు నుంచే భారీ క్యూలు, గందరగోళం నెలకొంది. అనేక గేట్లు మూసివేయడం, సరైన సమాచారం లేకపోవడంతో ప్రతినిధులు గంటల తరబడి బయటే ఉండిపోయారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త ధనుంజరు యాదవ్ తన వేర్‌బుల్ వస్తువులను దొంగలించారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసులు దొంగను పట్టుకుని, వస్తువులు అయనకు అందజేశారు.
-ఎగ్జిబిటర్ల తరలింపు మరో వివాదానికి దారితీసింది. ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఎగ్జిబిటర్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించారు. వారికి కనీసం నీరు, ఆహారం ఎక్కడ దొరుకుతాయో చెప్పే సైన్ బోర్డులు కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
-టెక్ సమ్మిట్ అయినప్పటికీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో డిజిటల్ చెల్లింపులు వైఫల్యం చెందాయి. దీంతో స్టాల్స్ వద్ద నగదు మాత్రమే తీసుకున్నారు. ఇది సందర్శకులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది.
-ప్రధాని మోడీ వేదికపై ప్రముఖ సంస్థల సీఈఓలతో జరిపిన అభివాదం నెట్టింట వైరల్ అయింది. ఒపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ చేతులు కలపడానికి ఇబ్బందిపడ్డారు. అనంతరం అకస్మాత్తుగా మోడీ అలా చేయడంతో ఇబ్బంది పడ్డామని సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.
-యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అమెరికాతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. దీంతో దేశం పరువు తీసారంటూ బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేశాయి.
భారీ పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు
-వివాదాల మధ్య కూడా, సమ్మిట్‌లో ఏఐ రంగంలో పలు భారీ పెట్టుబడుల ప్రకటనలు వెలువడ్డాయి. రిలయన్స్ ఇండిస్టీస్, జియో ఏఐ రంగంలో 110 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించగా, అదానీ గ్రూప్ 2030 నాటికి ఏఐ డేటా సెంటర్ల కోసం 100 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) లో ఏఐ కోసం 50 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. ఈ సమ్మిట్ ద్వారా భారత్ సుమారు 200 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆశించింది.
-సాంకేతిక ఆవిష్కరణల విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ సర్వం ఏఐ ‘విక్రం’ పేరుతో రెండు అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (సర్వం 30బీ-ఏ1బీ, సర్వం 105బీ) ఆవిష్కరించింది. ఇవి భారతీయ భాషల్లో ప్లానింగ్, ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్ కోసం రూపొందించబడ్డాయి.
-భారత ఏఐ మిషన్ కోసం ఎన్‌వీఐడీహెచ్‌ఏతో కీలక ఒప్పందాలు కుదిరాయి, ఇది దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తుంది. భారత్ తన సొంత ‘స్వదేశీ ఏఐ’ని కూడా ప్రదర్శించింది. ఇది 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
-సమ్మిట్ ముగింపులో, సుమారు 88 దేశాలు ‘ఢిల్లీ డిక్లరేషన్’ పై సంతకం చేయనున్నాయి. ఇది ఏఐని ఆర్థిక వద్ధికి చోదకశక్తిగా మార్చడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బాధ్యతాయుతమైన, సురక్షితమైన ఏఐ వినియోగంపై ఈ డిక్లరేషన్ దృష్టి సారిస్తుంది.
డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
సమ్మిట్‌లో అత్యంత కీలకమైన చర్చల్లో ఒకటి డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎదురయ్యే ముప్పు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వంటి ప్రముఖులు డీప్‌ఫేక్‌ల ప్రమాదాన్ని నొక్కిచెప్పారు. నైతిక ఏఐ అభివృద్ధి ఆవశ్యకతను ఉద్ఘాటించారు. ఏఐ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో, సమాజంలో అపనమ్మకాన్ని పెంచి, ప్రజాస్వామ్య ప్రక్రియలను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరించారు. 4ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక, చట్టపరమైన పరిష్కారాలు అవసరమని, వాక్ స్వాతంత్య్రం, బాధ్యత మధ్య సమతుల్యత పాటించాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, డీప్‌ఫేక్‌లను విశ్వసనీయంగా గుర్తించగల ఏఐ వ్యవస్థలు ఇంకా అభివృద్ధి చెందలేదని నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగించే విషయం.
మన టెక్నాలజీ చూసి ప్రపంచం ఆశ్యర్యపోయింది : ప్రధాని మోడీ
మోడీ మాట్లాడుతూ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచ దేశాలను ఆకర్షించిందని, దీనిలో ముఖ్యంగా రెండు భారత ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని ప్రధాని మోడీ తెలిపారు. జంతువుల చికిత్సకు, వాటిని ట్రాక్ చేయడానికి ఏఐను వినియోగించడం, భారత పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని సంరక్షించడానికి ఏఐను ఉపయోగించడం చూసి ప్రపంచ నేతలు ప్రశంసించారంటూ ప్రధాని ప్రకటించారు. అయితే ఈ సమ్మిట్‌లో జరిగిన లోపాలను ప్రపంచం ముందు పోయిన పరువు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
అంతకుముందు ప్రధాని మోడీ ‘మానవ-కేంద్రీకత ఏఐ’ (హ్యూమన్ సెంటర్ ఏఐ) విజన్‌ను సమ్మిట్‌లో ఆవిష్కరించారు, దీనికి ‘ఎంఏఎన్‌ఏవీ’ అనే సంక్షిప్త రూపాన్ని ఇచ్చారు ఎంఏఎన్‌ఏవీ అంటే ఎం – (నైతిక విలువలు), ఏ -(జవాబుదారీతనం) ఎన్ – (జాతీయ సార్వభౌమాధికారం) ఏ- (అందరికీ అందుబాటులో) వీ- (చట్టబద్ధత) అని తెలిపారు. ఈ విజన్ ఏఐ అభివృద్ధిలో నైతికత, జవాబుదారీతనం, సార్వభౌమాధికారం, సమ్మిళితత్వాన్ని ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే, ఈ విజన్‌కు కార్యాచరణ స్పష్టత కొరవడిందని, కేవలం విస్తృత సూత్రీకరణలు, సూచనలు మాత్రమే కలిగి ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
బిల్ గేట్స్ గైర్హాజరు
రోబో డాగ్ వివాదం
సమ్మిట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీనోట్ అడ్రస్ ఇవ్వకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్‌స్ట్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో ఆయన గైర్హాజరు సమ్మిట్ ప్రతిష్టను దెబ్బతీసిందని అంతర్జాతీయ మీడియా (రాయిటర్స్, సీఎన్‌ఎన్, ఫార్చ్యూన్) పేర్కొంది. సమ్మిట్ వెబ్‌సైట్ నుంచి ఆయన పేరును తొలగించడంపై ప్రభుత్వం ‘టెక్నికల్ గ్లిచ్’ అని చెప్పినా, అసలు కారణం ఆయనపై వస్తున్న ఆరోపణలేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు మరోవైపు, గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ‘ఒరియన్’ అనే రోబో డాగ్‌ను తమ సొంత ఆవిష్కరణగా ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
అయితే, అది చైనాకు చెందిన ‘యునైట్రీ రోబోటిక్’ తయారు చేసిన ‘యునైట్రీ గో-2’ అని… నెటిజన్లు గుర్తించారు. ఈ తప్పుడు క్లెయిమ్ కారణంగా యూనివర్సిటీని ఎగ్జిబిషన్ నుంచి బహిష్కరించారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ, చైనా ఉత్పత్తులను మనవిగా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్వహణా లోపాలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.



