ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పోస్ట్
స్పీకర్ లేనప్పుడు సభను నడపాల్సింది ఆయనే
ప్యానల్ నుంచి ఒకరిని ఎంచుకోవాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై వచ్చే నెల 9న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తదుపరి దశలో చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉప సభాపతి పోస్టుపై తిరిగి చర్చలు మొదలయ్యాయి. ఉప సభాపతి లేకపోవడంతో సభ నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని రాజ్యాంగ నిపుణులు తెలిపారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా అనేక ప్రతిపక్షాలు గత వారం అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. పధ్నాలుగు రోజుల నోటీసు కాలం తర్వాత తీర్మానాన్ని ఏ రోజున చేపట్టేదీ నిర్ణయిస్తారు.
లోక్‌సభలో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. రూల్ 200-ఏలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచారి తెలిపారు. అయితే స్పీకర్ అందుబాటులో లేనప్పుడు తీర్మానాన్ని అనుమతించే విషయంపై ఎవరు నిర్ణయం తీసుకోవాలో నిబంధనలు చెప్పడం లేదు. తీర్మానాలు స్పష్టంగా ఉండాలని, పరువుకు నష్టం కలిగించే భాష లేదా వాదనలు ఉండకూడదని మాత్రమే నిబంధనలు చెబుతున్నాయి. తన పైనే అభియోగాన్ని మోపినందున తీర్మానాన్ని అనుమతించే విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని, నిర్ణయం తీసుకోవాల్సిన ఉప సభాపతి పదవి ఖాళీగా ఉన్నదని, ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలో నిబంధనలు చెప్పడం లేదని ఆచారి తెలిపారు.
స్పీకర్ లేనప్పుడు అందుబాటులో ఉన్న చైౖర్‌పర్సన్స్ ప్యానల్ నుంచి ఒకరిని ఎంచుకోవడం ఇప్పుడు సభ ముందున్న ఒక అవకాశమని ఆయన చెప్పారు. పది మంది ఎంపీలతో కూడిన ప్యానల్‌ను స్పీకర్ గత సంవత్సరం జులైలోనే ఎంపిక చేశారు. అయితే తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా ? అని నిర్ణయించే బాధ్యతను వారిలో ఎవరికి అప్పగించాలన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆచారి చెబుతున్న దానిని బట్టి డిప్యూటీ స్పీకర్ పదవి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం తప్పనిసరి నిబంధన. దీనిపై పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ సంస్థకు చెందిన డాక్టర్ ఎంఆర్ మాధవన్ ఏమంటున్నారంటే ‘స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై ఉప సభాపతి చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా ఉంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లేనప్పుడు చైర్మెన్ల ప్యానల్ నుంచి ఎవరో ఒకరు సభను నడిపించాల్సి ఉంటుంది’. ఏదేమైనా స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఖాళీగా ఉన్న ఉప సభాపతి పదవిపై చర్చకు దారి తీస్తోంది.
మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఓటింగ్
కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తదుపరి ఓటింగ్ మార్చి 9న జరుగుతుందని, విరామం తర్వాత సభ తిరిగి సమావేశమవుతుందని కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. బడ్జెట్ సెషన్ రెండవ దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుందని అన్నారు. పలు ముఖ్యమైన చట్టాలు, క్లిష్టమైన బిల్లులపై పార్లమెంటులో చర్చ, ఆమోదం కోసం సమర్పించనున్నట్లు తెలిపారు. మార్చి 9న లోక్‌సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందని, పార్లమెంట్ నిబంధనల ప్రకారం తీర్మానంపై మొదటి రోజే చర్చ చేపట్టాలని అన్నారు. చర్చతోపాటు ఓటింగ్ నిర్వహిస్తామని అన్నారు. సభ పని చేసేందుకు ప్రతిపక్షం అనుమతించకపోతే గిలెటిన్‌ను ప్రవేశపెడతామని, దాంతో వారికే నష్టమని అన్నారు.



