నవతెలంగాణ – కంటేశ్వర్
మూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మనుషులను చంపే అధికారం బీజేపీకి ఎవరు ఇచ్చారు అని సీపీఐ(ఎం) ప్రశ్నించింది. శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నక్సల్స్ ఏరువేత పేరుతో బూటకపు ఎన్కౌంటర్లను జరుపుతూ మావోయిస్టు నాయకులను, ఆదివాసీలను, గిరిజనులను పట్టుకొని చంపుతున్నారని అన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఈ నరమేధం తగదని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే వారిని పట్టుకుని శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదని అన్నారు. కానీ 2026 మార్చి చివరివారం వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి, ఆపరేషన్ కగారు పేరుతో వందలాది మంది అమాయక ఆదివాసి గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో ఏకపక్షంగా పట్టుకొని కాల్చి చంపటం చూద్దామని ఆయన అన్నారు.
దేశంలో వామపక్ష భావజాలం ఉండకూడదు అనే దుర్బుద్ధితో విధానాలను వ్యతిరేకించే వారిపైన అర్బన్ నక్సల్స్ ముద్రను వేస్తూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ బూటకపోయే ఎన్కౌంటర్లుగా అనేకమంది మేధావులు చెప్తున్న విషయం తెలిసిందే అని అన్నారు. మానవతా విలువలను మరిచి ప్రాణాలు తీసే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇటీవల చంపబడ్డ అనేకమంది మావోయిస్టు నాయకులు, గిరిజనులు, ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారని, వారిని చంపినంత మాత్రాన ప్రశ్నించే తత్వం కానీ, తిరుగుబాటు తత్వం కానీ మరుగున పడదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించి దోపిడీ లేని వ్యవస్థను నిర్మమించినప్పుడే నక్సలిజం ఆగిపోతుందని తెలిపారు. దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, గిరిజన సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో భాగంగానే ఇది చేస్తున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, నాయకులు నిల్వల నరసయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.



