ఎప్పుడు ఏ మీడియా చూసినా భారీ పథకాల ప్రారంభం, శంకుస్థాపన, అధ్యయనం, చర్చలు, ప్రతినిధి బృందాల సందర్శనల హైప్ లేకుండా ఒక్క రోజుండదు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఏదో ఒకచోట ఏ రోజైనా ఇదే హడావుడి. సువిశాల దేశం గనక ఇలా జరగడం సహజమే. అయితే ఇందులో ఏవి ఏ తేదీన ఎలా ప్రారంభమయ్యాయి, ఎన్ని రకాలుగా ముగిశాయి, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాయి, ఎవరికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి వంటి ఫాలోఅప్(కొనసాగింపుకథ)కు మాత్రం ఎలాంటి హంగామా ఉండదు. హైప్‌లో గత ప్రస్తుత ప్రభుత్వాల నేతలు పోటీపడుతుంటారు. పోటాపోటీ పీపీపీలు (పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు) సమర్పిస్తారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్. నిర్మాణాలకు ఒప్పందాలకు సంబంధించింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచ బ్యాంకు వరకూ విస్తారమైన ప్రతిపాదనలు, ఇంకా చెప్పాలంటే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మౌలిక ఛట్రంతో నిమిత్తం లేకుండా తను ఇప్పించే దానధర్మాలకు నాలుగో పీ జోడించి మరీ తనదైన 4పీ హడావుడి సాగిస్తున్నారు. పురాణాల్లో శిబి, బలి, దధీచి, దాన వీర శూర కర్ణల నుంచి ఇప్పటి వారెన్ బఫెట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వరకూ రకరకాల దానశీలులున్నారు.కానీ, వారెవరూ ఈ 4పీ తగిలించుకోలేదు. ఆ దానమూ దాంతో ముడిపడిన ధర్మమూ మరో కథ. స్కూళ్లలో బల్లలూ బెంచీలు, ఆస్పత్రుల్లో పడకలూ ఆఖరుకు టాయిలెట్లకు కూడా సొమ్ములు లేవనే పాలకులు వేల లక్షల కోట్ల విలువైన ఈ పథకాలను అవలీలగా ప్రకటించేయడం, ప్రచారార్భాటం చేయడం ఎలా జరుగుతుంది? బిల్లులు చెల్లించలేదని, బకాయిలు పేరుకుపోయాయనీ మోయలేని భారం మీద పడిందని సణుక్కుంటూ కథనాలు ఇస్తూనే భారీ ఇన్వెస్టర్లు కంపెనీలు వీటికోసం ఎందుకు పోటీ పడుతుంటారు? మరొకరికి వస్తే, లేక ప్రభుత్వాలు మారితే వ్యతిరేక లీకులు ఎందుకు ఇస్తుంటారు? ఇన్ని వేల కోట్ల భారం నిజంగా తట్టుకుంటారా? దేశ వ్యాపితంగా మరీ ముఖ్యంగా నగరాలు, పెరిగే పట్టణాల్లో లేదంటే సరి కొత్తగా కట్టుకునే నగరాల్లో కనిపిస్తున్న ఇన్‌ఫ్రా/రియల్ ఎస్టేట్ హడావుడి దేనికి సంకేతం? రియాల్టీలో కూడా స్థానిక వ్యాపారులు, సంస్థలు అటుంచి మెట్రో పాలిటన్, కాస్మోపాలిటన్ సంస్థల రహస్యాలేమిటి?
ఎన్నెన్ని ఉపద్రవాలు? అపశ్రుతులు?
ఈ ప్రశ్నలు అడగ్గానే కొందరికి కోపమొస్తుంది. అభివృద్ధిని చూడలేని వారంటూ ఆగ్రహంతో రెచ్చిపోతారు. కాలం చెల్లిన సిద్ధాంతాలంటారు.తమ ఇమేజిని చూసి విశ్వ కుబేరులు వరస కట్టి వచ్చేస్తున్నారని విపరీత ప్రచారాలతో ఉక్కిరి బిక్కిరైపోతారు. కానీ తేడాలు వస్తే మాత్రం ప్రత్యర్థులు కారణమంటారు. ఇటీవలి కాలంలో మచ్చుకు కొన్ని ఉదాహరణలు …కేంద్రం బాధ్యతగా నిర్మించవలసిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్, కఫర్ డాం దెబ్బతిన్నాయి. మేడిగడ్డ డ్యాం ఫిల్లర్లు కుంగిపోయాయి.శ్రీశైలం సొరంగ నిర్మాణంలో ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోగా సహాయ చర్యలు కూడా ఆలస్యమయ్యాయి. ఢిల్లీ జబల్పూర్, గౌహతి, పోర్డ్‌బెలార్(అండమాన్) ఎయిర్‌పోర్టులు రకరకాలుగా దెబ్బతిని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.2022 జులై 22న ప్రధాని మోడీ ప్రారంభించిన బుందేల్ ఖండ్ హైవే కొద్ది రోజుల్లోనే దెబ్బతిన్నది. 2022 అక్టోబరులో ఆయన ప్రారంభించిన పూర్వాంచల్ సోనాపూర్ హైవేలో 18 అడుగుల లోతు గుంట పడింది.920 కోట్లతో నిర్మించిన ప్రగతి మైదాన్ స్పోర్ట్స్ మైదానం సొరంగం కూలిపోయింది.బీహార్‌లో గత ఏడాది జులై నాటికి 13 బ్రిడ్జిలు, గుజరాత్‌లోనూ అయిదు బ్రిడ్జిలు కుప్పకూలాయి. గుజరాత్‌లోనే రాజ్‌కోట్ టిఆర్‌పి ప్లేజోన్‌లో ఘోరమైన అగ్ని ప్రమాదం భారీప్రాణనష్టానికి కారణమవగా, లైసెన్సు కూడా లేకుండా అలాంటివి 18 నడుస్తున్నాయని తేలింది. ఇక హైటెక్ రైల్వేల గురించి సదుపాయాల గురించి ఎంతగానో చెప్పుకుంటున్నా 2019-24 మధ్యలో ఏడాదికి సగటున 44 రైల్వే ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి దారితీశాయి. టూరిజం, వాట్సప్ గవర్నెన్స్, జిపిసి ట్యాగింగ్ వంటి ఎన్నో గొప్పల మధ్య వరుసగా కుంభమేళా నుంచి బెంగళూరు క్రికెట్ కప్ వేడుకలు, తిరుపతి సందర్శనలు ఇలా అనేక చోట్ల తొక్కిసలాటలను కూడా నివారించలేక క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి.ఇందులో ఏవీ కావాలని అల్లిన కథలో లేక రాజకీయ వ్యతిరేకతతో చెబుతున్నవో కాదు. కళ్లముందు ఇటీవల చూసినవే. పాలిమర్స్ అనకాపల్లి ఫార్మా నుంచి మొన్న హైదరాబాద్ సిగాచీ కెమికల్స్‌వరకూ వందల ప్రాణాలు బలైన ప్రమాదాలను ఇక్కడ చెప్పడం లేదు. మనం తరచూ వింటుంటాము బ్రిటిష్ వారు వేసిన బ్రిడ్జిలు, నిజాం కట్టిన ఆనకట్టలూ, కాకతీయుల నాటి చెరువులూ, రెడ్డి రాజుల నాటి కట్టడాలూ అలాగే ఉంటే, ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఆర్భాటంగా కట్టిన నవీన నిర్మాణాలెందుకు ఇలా అవుతున్నాయని. తమ నిర్మాణ నిర్వహణా దక్షతను గురించి గొప్పలు చెప్పుకునే పాలక వర్గ నేతలెవరూ ఈ ఘోరాల పరం పరకు బాధ్యత తీసుకోలేదు. చివరాఖరికి అయోధ్య రామమందిరం లీకులకు గురైతే భారీ ఖర్చుతో వేసిన రోడ్డు గుంటలు పడిపోయింది.
గనులూ, వనరులూ సమస్తం..సర్వత్రా
ఈ జాబితా ఇలా పొడగించుకుంటూ పోవడంకంటే వీటి లోగుట్టు తెలుసు కోవడం ముఖ్యం.ఇన్ ఫ్రా రంగం అనే మాట అనేక రకాలుగా వాడుతున్నారు. కానీ మౌలిక సదుపాయాల రంగమన్నది ఇస్తున్న అర్థం. అయితే నిర్మాణాల నుంచి గనులు, భూములు, అడవులు, కొండల వంటి ప్రకృతి వనరుల వరకూ ఆ రంగంలోకి చేరతాయి. అవి ప్రభుత్వాల అధీనంలో వుంటాయి. లేకపోయినా సేకరణలు, సమీకరణలు, చట్టబద్దమైన హక్కులు సర్కార్లకే ఉంటాయి. ఇన్ ఫ్రా వసతుల కల్పన అంటూ వాటిని కట్టబెట్టడం.. ఒక వేళ అందుబాటులో లేకపోతే అధికారంతో హస్తగతం చేసుకుని అప్పగించడం నిరంతరాయంగా సాగిపో తున్నది. పాలకులను బట్టి ఆ ఒప్పందాలు చేతులు మారొచ్చు గానీ ఒరవడి మారదు. హైదరాబాద్ చుట్టుపక్కల రియాల్టీలో ఒక సంస్థ ప్రధాన పాత్ర వహించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు ప్రధానంగా ఒక సంస్థ చేస్తుంటుంది. ఇలాంటి వారు ఇక్కడ ప్రాంతీయ పార్టీలనూ, అక్కడ మోడీ సర్కారును ప్రసన్నం చేసుకుంటూనే ఉంటారు. దేశ వ్యాపితంగా హైవేలు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ చుట్టూనే తిరుగుతుంటాయనేది జాతీయ రహస్యం. ఇక గనులు పనులూ అదానీ,అంబానీ, వేదాంత వంటివారి నిర్వహణలోకి వెళ్తాయి. కాంగ్రెస్ కాలంలో అంబానీ ప్రధాన పాత్ర వహిస్తే బీజేపీ హయాంలో అదానీ దూకుడు పెరిగి ఉండవచ్చు. కానీ, వీరైనా వారైనా కార్పొరేట్ చట్రంలో ఉన్నవారే. మోడీ సర్కారుకు మొదటి రెండుసార్లు పూర్తి మెజార్టీ ఇప్పుడు కూడా ఆధిపత్యం ఉన్నందువల్ల మరింత జోరుగా సాగడం సాధ్యమవుతున్నది. అంతర్జాతీయంగా మోడీ ట్రంప్‌తో ఉండటం ఆయన స్వయంగా ఇండియలో కూడా ట్రంప్ టవర్స్ కట్టిన ప్రపంచ రియల్టర్ కావడం గమనించదగింది. బిల్ క్లింటన్ సతీమణి, బుష్ కుమారులు కూడా చమురు సామ్రాజ్యాలకు, ఆయుధ వ్యాపార వలయాలకు సన్ని హితులే. ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో ధన ప్రవాహాలు ఎటు నుంచి ఎటు సంచరిస్తున్నాయో ఒక పట్టాన బోధ పడకపోవచ్చు.వీటిపై చాలా అధ్యయనాలు, పరిశోధనా పత్రాలే ఉన్నాయి. అందులో ఆర్థిక రాజకీయ కోణాలను చూద్దాం.ఎందుకంటే రాజకీయ మూలాలు ఎప్పుడూ ఆర్థికంలోనే వుంటాయి గనక.
ఉత్పత్తి నుంచి ఉత్తుత్తికా?
ఆర్థిక సంక్షోభాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఉత్పత్తిరంగం వెనకపట్టు పట్టింది. గిరాకీ లేదు గనక ఉత్పత్తి దాంతో పాటు ఉపాధి కూడా కరువై పోతున్న స్థితి. దీనంతటి వెనక ఉన్న ప్రపంచీకరణ తెచ్చిన భయానకమైన ఆర్థిక వ్యత్యాసాల ఫలితంగా నయా సంపన్న కుబేరవర్గాల గిరాకీ ఉన్న వస్తువులే చేయాలి. దానికోసమే పోటీ పడాలి. వస్తూత్పత్తి రంగంలో భారీ పరిశ్రమలపై పెట్టుబడులు పెట్టి విస్తార వినియోగదారుల కోసం వ్యాపారం చేసే అవకాశం లేదు గనక ద్రవ్య రంగంలోనూ స్పెక్యులేషన్ రంగంలోనూ కేంద్రీకరించాలి. అవేమో ఒడిదుడుకులకు, కుంభకోణాలకూ నిలయంగా మారిపోతుంటాయి. అందులో భాగంగా వేల కోట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెంచర్లు, ఇండ్లు నిర్మాణం చేసినా దీర్ఘకాలం వేచి ఉండక తప్పదు. ప్రతి నగరంలో లక్షల యూనిట్లు అమ్మకం జరగాల్సి ఉంది. గనుక సరక్షితమైంది గనుల వంటి ప్రకృతి వనరులు భూములు స్వాధీనం చేసుకోవడం. వాటిలో ప్రభుత్వ సంస్థల రుణాలతోనే నిర్మాణాలు చేసి తమ పెత్తనం లాభాల దాహం తీర్చుకోవడం.అందుకోసం రకరకాల పేర్లతో భారీ పథకాలతో రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు,టన్నెల్స్,హైవేలు, రేవులు, వినోద సముదాయాలు, టూరిస్టు ప్లాజాలు నిర్మించడం, వీటి మధ్య ఆహార చెయిన్లు సరఫరా కోసం అగ్రిగేటర్లు. అంటే ఒకప్పటిలా ఈ మొత్తంలో కూడా మామూలు మనుషులకు ఉద్యోగాలు దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. గతంలో గని కార్మికులు, కార్ఖానా వర్కర్లు రాత్రి పగలు లేకుండా రోజంతా పనిచేస్తే ఇప్పుడు గిగ్‌వర్కర్లు ఆ పనిచేస్తుంటారు. ఈ వ్యాపార వ్యవహారాలు, లావా దేవీలు చూడటానికి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, కార్పొరేట్ అధిపతుల మాఫియాలు తయారై కూచున్నాయి. ముంబాయిలో మొదలైన ఈ రాజకీయం ఇప్పుడు దేశమంతా తరతమ తేడాలతో విస్తరించింది. ఆ మాటకొస్తే ఇప్పటికీ ముంబాయి, గుజరాత్‌లలో ఇది లోతుగా పాతుకుపోయి ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో పారిశ్రామిక పెట్టుబడి మొదలైంది కూడా ఇంచుమించు అక్కడే. మోడీ హయాంలో పాలనలో అది మరీ పట్టుపెంచుకున్న వైనం సుస్పష్టం. కాకపోతే ఇదో రాజకీయార్థిక లింకు. వాటివల్ల మేలు జరగదని కాదు కానీ వాటి పరిమితులూ కఠోర షరతులేమిన్నది ప్రశ్న.
మరిన్ని కలలు.. కబుర్లు
రెండోది రాజకీయాంశం. ఎక్కడిదాకా ఎందుకు తెలుగు రాష్ట్రాలే చూద్దాం. ప్రాజెక్టుల సమస్యలు ఇంత తీవ్రంగా ఉంటే చంద్రబాబు నాయుడు బనకచర్ల రూ.80 వేల కోట్లతో తొలి ప్రయివేటు ప్రాజెక్టు గా కడతానంటారు.ఆగిపో యిన అమరావతి వేగంగా పూర్తి చేసే బదులు, మరో 40 వేల ఎకరాలు తీసుకుంటామని అందులో పెద్దభాగం ప్రయివేటు ఎయిర్‌పోర్టు కడతానని చెబుతారు (అంతకు ముందున్న గన్నవరం ప్రభుత్వ ఎయిర్‌పోర్ట్ మాటేంటి?) రాజధాని దశల కంటే క్వాంటమ్ ప్రాజెక్టు కలలు చూపిస్తారు. ఇక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీపై విదేశాల్లో చర్చలు జరిపి వస్తారు. ఏపీలో తాడూ బొంగరం లేని మెట్రోపై హడావుడి చేస్తే, తెలంగాణలో మెట్రో మలిదశపై సవాళ్లు నడుస్తాయి. మెడికల్ ఇన్‌ఫ్రా, ఐటి ఇన్ ఫ్రా, మళ్లీ రకరకాలు, రైతుల భూసేకరణలు,గిరిజనులపై దాడులు, నిరాశ్రయత, వనరుల హరింపు షరామామూలుగా నడుస్తాయి. ఆఖరుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చి ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులను తరిమివేశాక వాటిని అభివృద్ధి కారిడార్లుగా మారుస్తామని ప్రకటిస్తారు. రాజకీయ సైద్ధాంతిక కోణాలు అలావుంచితే అన్ని పార్టీలూ కోరుతున్నా మావోయిస్టులతో చర్చలు మొదలెట్టకుంటా పూర్తిగా నిర్మూలన చేస్తామని బెదిరించడం ఆ వనరుల స్వాధీనం కోసమే.
తక్షణ సమస్యలపై కోర్కెలపై మాట్లాడకుండా విజన్2047 గురించి చెప్పడం, వీగిపోయిన విజన్2020ని పెద్ద విజయంలా చూపించడం ఇందులో భాగమే. విశ్వగురు మోడీ పంచరంగుల ప్రకటనలు వీటిని విస్తరించిన చిత్రమే. విశాఖ ఉక్కును నాశనం చేసి మిట్ట్‌ను తీసుకువచ్చింది. మేమంటే మేమని వైసీపీ, టీడీపీ పోటీపడటం ఉర్సా నుంచి టాటాల వరకూ భూ పందేరాలు, వారొక స్వామికి ఇచ్చిన భూమిని వీరు మరో కార్పొరేట్ స్వామికి కట్టబెట్టాలని చూడటం ఒకటేమిటి? సమస్తం ఆ కోవలోవే.. పేరుకు ప్రయివేటు అన్నా ఇన్‌ఫ్రాలో 22 శాతం మాత్రమే వారు పెట్టుబడి కాగా ప్రభుత్వ బ్యాంకుల నుంచే వేల కోట్ల రుణాలు తీసుకుంటారనీ, వాటిలో చాలాభాగం ఎగవేస్తారనీ తెలిసిందే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగానే దేశంలో సమస్త కార్మికవర్గం వివిధ తరగతుల ప్రజల మద్దతుతో జులై9న సమ్మెకు సిద్ధమవుతున్నది. 1871లోనే యూజినీ పాటియర్ రాసిన అంతర్జాతీయ గీతం ఇవన్నీ ఊహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వారి యోగమూ వారల దర్జా వారి భోగమూ వారల దర్పం రెక్కల కష్టంబే కాదా మన రెక్కల కష్టంబే కాదా!
తెలకపల్లి రవి
ఎవరిసొమ్ము..ఎవరిసోకు? ఇన్‌ఫ్రా షాకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES